రాష్ట్రీయం

చెప్పేది అబద్ధం.. చేసేది చాలెంజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 11: ఓ వైపు పచ్చి అబద్ధాలు చెప్తూ, మరోవైపు ఛాలెంజ్ చేసే ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహనరెడ్డేనని, అటువంటి వ్యక్తిని తన రాజకీయ జీవితంలో తొలిసారి చూస్తున్నానని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చెప్పేది అబద్ధం.. చేసేది ఛాలెంజ్.. రికార్డులు తెప్పిస్తా మీరు రాజీనామా చేస్తారా.. అనే వ్యాఖ్యలు సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగవన్నారు. అసెంబ్లీలో గురువారం తొలిరోజు కరవుపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి, వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సభ అనంతరం మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు జీరో వడ్డీ కింద రుణాలు తమ ప్రభుత్వ హయాంలోనే ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం ముఖ్యమంత్రి జగన్‌కే చెల్లిందన్నారు. లక్ష రూపాయల లోపు రుణాలకు జీరో వడ్డీ, 3 లక్షల లోపు రుణాలకు పావలావడ్డీ చొప్పున రాష్ట్రంలో 2013-14 ఆర్థిక సంవత్సరం నుండి అమలవుతూ వస్తుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 వరకు వడ్డీ రాయితీ రూ. 979.45 కోట్లను విడుదల చేశామన్నారు. అలాగే పావలావడ్డీ కింద రూ. 25.14 కోట్లు చెల్లించామని తెలిపారు. 2017-18 సంవత్సరానికి సంబంధించి రూ. 507 కోట్లు పెండింగ్ ఉందని, 2018-19కి సంబంధించి ఎన్నికలకు ముందు వరకు ఇంకా క్లయిమ్స్ అందలేదని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే అబద్ధాలు చెప్పి ఛాలెంజ్ చేయడం జగన్‌కే చెల్లిందని దుయ్యబట్టారు. ఇప్పుడు మీరు రాజీనామా చేస్తారా, లేని పక్షంలో కనీసం ప్రజలకైనా క్షమాపణ చెప్పండంటూ బాబు హితవుపలికారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2013 ఏప్రిల్ 27వ తేదీన జీవో ఆర్‌టి నెంబర్ 639 ద్వారా రైతులకు సున్నా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల పథకాన్ని కొనసాగిస్తున్నట్లు అప్పటి వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్‌రెడ్డి ఎస్‌ఎల్‌బిసి, ఆప్కాబ్‌లకు 2018 మే 20వ తేదీన సర్క్యులర్ ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అసలు వడ్డీలేని రుణాల పథకమే ఇంతవరకు రాష్ట్రంలో లేదని, తానే దానిని ఇప్పుడు మొదలు పెట్టానని జగన్ డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని అన్నారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌తో సహా అడ్డంగా దొరికిన ముఖ్యమంత్రి ఆగమేఘాలపై సభను వాయిదా వేసి పలాయనమంత్రం జపించడం వల్లే తాను రికార్డులను మీడియా ద్వారా ప్రజలకు చెప్పాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారు. కరవు సంభవించినప్పుడు రుణాల రీషెడ్యూల్ చేయాల్సి ఉంటుందని, కరవు మండలాలు ప్రకటించగానే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఎస్‌ఎల్‌బిసి రుణాలను రీషెడ్యూలు చేస్తుందని, ఇవేమీ తెలియకుండానే నన్ను రాజీనామా చేస్తారా అంటూ ఛాలెంజ్ చేయడం జగన్ అవివేకానికి నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీపై వ్యక్తిగతంగా ఎమ్మెల్యేల చేత కించపరిచే వ్యాఖ్యలు చేయించడం సభలో ప్రజలంతా చూశారని, మూడున్నర దశాబ్దాలకు పైగా శాసనసభలో తాను సభ్యునిగా ఉన్నానని, ఇంత దుర్మార్గపు వ్యవహారశైలి ఎన్నడూ చూడలేదన్నారు. అక్కడ ప్రాజెక్టులు కడుతుంటే గాడిదలు కాస్తున్నారా అని ముఖ్యమంత్రి అంటే, దొబ్బేయండి అని మరో మంత్రి పరుషంగా మాట్లాడతారు.. ఇవేనా సభా సాంప్రదాయాలు, హుందాతనమంటే అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సబ్జెక్టులపై పూర్తిస్థాయి అవగాహన, క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని, అవి లేకపోతే కనీసం విచక్షణైనా పాటించాలని, ఇవేవీ ముఖ్యమంత్రి జగన్‌లో లేకపోవడం బాధాకరమన్నారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన ఛాలెంజ్, మంత్రుల వ్యాఖ్యలు తదితర అంశాలపై శుక్రవారం శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పొలిటికల్ టెర్రరిజాన్ని జగన్ సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు. చట్టసభలో విచక్షణ లేని ఆధిపత్యాన్ని సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, పక్కన టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు