రాష్ట్రీయం

లక్ష క్యూసెక్కుల నీరు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: అన్ని నదీ బేసిన్లు వెలవెలబోతున్నాయి. ఉన్నంతలో గోదావరి బేసిన్ మేలు. గతంతో పోల్చితే గోదావరిలో కూడా వరద ప్రవాహం అంతంతమాత్రమే. వరుణ దేవుడు ముఖం చాటేయడంతో దండకారణ్యంలో కూడా వర్షాలు అంతంతమాత్రమే కురుస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా సగటున లక్ష క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. డెల్టా అవసరాలకు పోను ఇంత పెద్ద మొత్తంలో ప్రస్తుతం నెలకొన్న కరవు పరిస్థితుల్లో నీరు సముద్రంలోకి పోతోందంటే మెట్ట ప్రాంత రైతులకు బాధగానే ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు వరప్రదాయినిగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు పూర్తిగా ఎండిపోయాయి. శ్రీశైలం జలాశయంలోకి శుక్రవారం కేవలం 216 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చిందంటే ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. శ్రీశైలం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. కానీ ఈ ఏడాది కేవలం 0.22 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. ప్రస్తుతం కేవలం 31 టీఎంసీల నీరు మాత్రమే లభ్యతలో ఉంది. అంటే మరో 185 టీఎంసీల నీరు రావాలంటే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి ఆల్మట్టి నిండాలి. ఈ ఏడాది కరవువికటాట్టహాసం చేస్తుంటే, ఇక వర్షాలు కురుస్తాయనే నమ్మకం సన్నగిల్లుతున్న సమయంలో పైనుంచి
దిగువకు నీటి ప్రవాహం కష్టమేనని సాగునీటి నిపుణులంటున్నారు. నాగార్జునసాగర్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. ఈ జలాశయంలోకి ఇన్‌ఫ్లోలు లేవు. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. అయితే కేవలం 128 టీఎంసీల నీటి లభ్యత ఉంది. పులిచింతల కెపాసిటీ 45.77 టీఎంసీలు అయితే, 0.79 టీఎంసీల నీటి లభ్యత ఉంది.
కాగా, తెలంగాణ ప్రాంతంలోనే గోదావరి నదీ పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైలంలోకి నీటి మళ్లింపుపై స్కీం నిర్మించాలన్న ప్రతిపాదనపై చర్చలు తారస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహించనున్న బడ్జెట్ సమావేశాల్లో పద్దుల్లో సర్వేకు నిధులు కేటాయించవచ్చునని సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారంనాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాయలసీమను ఆదుకునేందుకు గోదావరి జలాలను శ్రీశైలంకు మళ్లిస్తామని ప్రకటించారు. దీంతో ఈ స్కీం పట్ల కేసీఆర్ మాదిరిగానే జగన్ కూడా పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నెలాఖరు లోపల ఇరువురు సీఎంలు భేటీ అయి గోదావరి నుంచి శ్రీశైలంకు నీటి మళ్లింపుపై ఒక స్కీంను ఖరారు చేసే అవకాశం ఉంది.
పాతాళంలోకి భూగర్భ జలాలు
పాతాళంలోకి భూగర్భ జలాలు చేరుకున్నాయి. తెలంగాణలో వర్షపాతం లోటు 33 శాతానికి చేరుకుంది. మొత్తం 589 మండలాల్లో 271 మండలాల్లో -20 నుంచి -59 శాతం వరకు వర్షపాతం లోటు నమోదైంది. 122 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో కుడబక్షపల్లి గ్రామంలో భూగర్భ జలాలు 66.91 మీటర్ల దిగువకు చేరుకున్నాయి. గత ఏడాదితో పోల్చితే 151 మండలాల్లో భూగర్భ జలాలు మరింత లోతుకు జారుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 12.27 మీటర్లకు భూగర్భ జల లభ్యత ఉంటే, ఈ ఏడాది 14.40 మీటర్ల దిగువకు పడిపోయింది. రాష్ట్రంలో 21 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి, జయశంకర్, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, జనగాం, మేడ్చల్ మల్కాజగిరి, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, నిర్మల్, వరంగల్ రూరల్, యాదగిరి జిల్లాల్లో వర్షపాతం లోటు నమోదైంది. రాష్ట్రం మొత్తం మీద నాగర్‌కర్నూలు జిల్లాలో ఒకటే 20 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఇదిలావుండగా, వచ్చే ఐదు రోజుల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 16 వరకు భారీ వర్షాలపై ఎటువంటి హెచ్చరికలు జారీచేయడం లేదని ఆ శాఖ తెలిపింది.