రాష్ట్రీయం

పీపీఏల రద్దు చట్ట వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) కథ మొదటికొచ్చింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం విచ్చలవిడిగా ధరలు చెల్లించి అక్రమాలకు పాల్పడిందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. మరో అడుగు ముందుకేసి నిపుణుల కమిటీని నియమించి విచారణ జరిపిస్తున్నారు. పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన లావాదేవీలను వెలికితీసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించింది. ఒక్కో యూనిట్‌కు అధిక మొత్తంలో ధరలు చెల్లించటం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయనేది ముఖ్యమంత్రి అభిప్రాయం. దీనిపై లోతుగా ఆధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని మంత్రి వర్గ ఉపసంఘంతో పాటు అధికారులకు సూచించారు. కొద్దిరోజులుగా ఈ విషయమై అధికారులు లెక్కలు తీస్తున్నారు. అవినీతి జరిగినట్లు గుర్తిస్తే అందుకు బాధ్యులైన విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత మంత్రితో పాటు అవసరమైతే నాటి ముఖ్యమంత్రిపై కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రం ఒక విడత జోక్యం చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి జరిగిందనే ప్రచారం చేయటం ద్వారా పెట్టుబడులు వెనక్కుపోతాయని, దీనిపై సమగ్ర సమాచారాన్ని ముఖ్యమంత్రికి అందించాల్సిందిగా కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి గత నెల రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. విచారణ పేరుతో ఒప్పందాలను సమీక్షిస్తే మొత్తంగా కాంట్రాక్ట్‌లను ఆహ్వానించటం లేదనే భావన కలుగుతుందని దీనివల్ల జాతీయ స్థాయిలో నష్టం జరుగుతుందని ఆ లేఖలో స్పష్టం చేశారు. దీంతో ఈ విషయంలో కేంద్రంతో అమీ తుమీ తేల్చుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి రాసిన లేఖ గురించి అప్పట్లో తిరుమల పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తెచ్చారు. అవినీతి జరిగి ఉంటే సమీక్షించటంలో తప్పులేదని కచ్చితంగా విచారించేల్సిందే అని అప్పట్లో ప్రధానమంత్రి సైతం సమర్థించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే రాష్ట్రంలో గతంలో జరిగిన ఒప్పందాలపై ఆధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించారు. నివేదిక అందిన వెంటనే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ ఈనెల 9వ తేదీన రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పీపీఎలను రద్దుచేయటం చట్టవిరుద్దమని చెప్తూ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటనే ప్రాసిక్యూట్ చేసి సంబంధిత కాంట్రాక్ట్‌ను మాత్రమే రద్దు చేయాల్సి ఉందని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే టారిఫ్‌ను నిర్ణయిస్తారని, గతంలో ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకున్న ఒప్పందాలు సరైనవో కావో తేల్చుకోవాల్సిందిగా వివిధ రాష్ట్రాల టారిఫ్‌లతో కూడిన వివరాలను లేఖతో జతచేసి పంపారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో లోపభూయిష్టమైన విధానాల వల్ల గత ప్రభుత్వం రూ. 2వేల కోట్లకు పైగా అధికంగా చెల్లించిందని శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సైతం ప్రభుత్వం ఉదహరించింది. థర్మల్ విద్యుత్‌ను యూనిట్‌కు రూ. 4.2 ధర నిర్ణయించగా (యూనిట్ ఒక్కింటికి అస్థిర ధర రూ. 3.1, నిర్ణీత ధర రూ. 1.1గా), పవన్ విద్యుత్ యూనిట్ ఒక్కింటికి రూ. 5.9 (అస్థిర ధర రూ. 4.8 కాగా నిర్ణీత ధర రూ. 1.1గా) చెల్లించారని, అదే విధంగా సౌర విద్యుత్ యూనిట్‌కు రూ. 7.1 (అస్థిర ధర రూ. 6 కాగా నిర్ణీత ధర రూ. 1.1గా) నిర్ణయించారని బడ్జెట్‌లో ప్రస్తావించారు. అయితే రాష్ట్రాల వారీగా కేంద్ర మంత్రి పంపిన వివరాలు మరో రకంగా ఉన్నాయి. కేంద్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్‌సీ) నిర్దేశించిన టారిఫ్ వివరాలిలా ఉన్నాయి. 2014-15 సంవత్సరానికి పవన విద్యుత్ యూనిట్‌కు రూ. 5.76 కాపిటల్ కాస్ట్ రూ. 6.04గా నిర్ణయించింది. ఈ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్ ధర రూ. 4.7, కాపిటల్ కాస్ట్ రూ. 5.75 కాగా తమిళనాడులో రూ. 3.51, 5.75, రాజస్థాన్‌లో రూ. 5.64, 5.65, మహారాష్టల్రో రూ. 5.7, 5.85, గుజరాత్‌లో రూ. 4.61, 6.06, కర్ణాటకలో రూ. 4.5, రూ.6, మధ్యప్రదేశ్‌లో రూ. 5.92, 5.96గా ఒప్పందాలు చేసుకున్నాయి. సౌర విద్యుత్ యూనిట్ ధర యూనిట్‌కు రూ. 7.72, కాపిటల్ కాస్ట్ రూ. 6.91గా 2014-15 సంవత్సరానికి సీఈఆర్‌సీ నిర్దేశించింది. 2015-16, 2016-17, 2017-18 ధరలకు సంబంధించి కూడా సీఈఆర్‌సీ టారిఫ్‌లు నిర్ణయించింది. బహిరంగ విచారణలతో పాటు ప్రజాభిప్రాయాన్ని సేకరించిన మీదటే టారిఫ్‌లు ఖరారయ్యాయని కేంద్ర మంత్రి తన లేఖలో స్పష్టం చేశారు. పునరుత్పాదక ఇంధన వనరులకు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని దేశ ఆర్థికాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ఇది తోడ్పడుతుందని లేఖలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక చర్యలకు తమ పూర్తి సహకారం అందిస్తామని, అయితే పూర్తి స్థాయిలో విచారణ జరపటం వల్ల పెట్టుబడులకు విఘాతం కలిగే అవకాశం లేకపోలేదని చెప్తూ ఏవైనా అక్రమాలు జరిగిన కాంట్రాక్ట్ సంస్థలను ఆధారాలతో సహా గుర్తిస్తే సంబంధిత కాంట్రాక్ట్‌ను మాత్రమే రద్దు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ సుపరిపాలన అందించగలరనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.