రాష్ట్రీయం

శ్రీవారి సేవలో రాష్ట్రపతి కోవింద్ దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 14: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దర్శించుకున్నారు. రాష్టప్రతి వెంట ఆయన సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు ఉన్నారు. ఉదయం 5.30 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలుదేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ జెట్టి సాదరంగా ఆహ్వానించగా అర్చక బృందం ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో ఆగమోక్తంగా స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్టప్రతి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల పెద్ద జీయంగార్ స్వామి, చిన్న జీయంగార్ స్వామి ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల్ దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని, సన్నిధిలోని ఇతర ఆలయాల గురించి వివరించారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్టప్రతికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం చైర్మన్, ఈఓలు కలిసి శ్రీవారి శేషవస్త్రాన్ని, తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు. అంతకుముందు శ్రీవారి ఆలయంలో పడికావలి నుంచి ధ్వజస్తంభం మధ్య ఏర్పాటు చేసిన ముడుచుకునే పైకప్పు పనితీరును రాష్ట్రపతి పరిశీలించారు. ఎండకు, వర్షానికి భక్తులు ఇబ్బంది పడకుండా ఈమేరకు ఏర్పాట్లు చేసినట్లు ఈఓ వివరించారు.
రాష్టప్రతికి ఘనంగా వీడ్కోలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనంగా వీడ్కోలు లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.10 గంటలకు ఆయన రేణిగుంట విమానాశ్రయానికి రోడ్డు మార్గాన బయలుదేరారు. ఈసందర్భంగా పోలీసుల గౌరవవందనం తీసుకున్న రాష్టప్రతికి, తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, ప్రత్యేకాధికారి ఏవి ధర్మారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, టీటీడీ సీవీఎస్వో గోపీనాథ జెట్టి, ఎస్పీ అన్బురాజన్ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటకు బయలుదేరి వెళ్లారు.

చిత్రం...ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు. చిత్రంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.