రాష్ట్రీయం

మీరే నా బలం.. నమ్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పట్ల విశ్వసనీయత పెంపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతివారం నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమం అమలు తీరుతెన్నులపై మంగళవారం సచివాలయం నుంచి సమీక్షించారు. ఇందులో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల ఒకటి నుంచి 12వ తేదీ వరకు 45వేల 496 వినతులు వచ్చాయని అందులో 1904 ఆర్థికేతరమైనవి కాగా మరో 1116 ఫిర్యాదులను వారం రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉందన్నారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకపోతే కుప్పలు తెప్పలుగా పేరుకుపోతాయని దీనివల్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. అధికారులు ఈ విషయంలో శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ఎమ్మార్వోలు తీసుకునే అర్జీలను ఆన్‌లైన్‌లో కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని సూచించారు. దీనివల్ల అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని చెప్పారు. వారంలో ఒక రోజు స్పందనపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఆదేశించారు. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షిస్తారన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలన్నారు. తహశీల్దారు కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో ఎక్కడా అవినీతి లేదని అనుకోవచ్చా.. అవినీతి నిర్మూలనకు ఇచ్చిన సందేశం బలంగా ఉందా..లేదా అనే విషయాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. కూకటి వేళ్లతో సహా అవినీతిని పెకలించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయాలకు ప్రజలు సంతోషంగా వచ్చి పనులు పూర్తి చేయించుకోగలమనే నమ్మకం ఏర్పడాలని అభిలషించారు. గుంటూరు, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ మలేరియా కేసులు అధికంగా ఉన్నాయని అప్రమత్తం కావాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ కంటింజెన్సీ ప్లాన్‌ను జిల్లాలకు పంపుతున్నామని విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. విత్తన సేకరణలో ఇప్పటికే కొన్ని తప్పులు జరిగాయని అయితే అధికారులను తాను తప్పుపట్టటంలేదని స్పష్టం చేశారు. అధికారులు ప్రతిపాదించినా గత ప్రభుత్వం స్పందించనందునే కొరత ఏర్పడిందన్నారు. తాము అధికారంలోకి వచ్చి 45 రోజులు మాత్రమే అయిందన్నారు. అధికారులు, ప్రభుత్వం సమష్టిగా ముందుకు సాగాలని ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందేలా చర్యలు చేపట్టామని ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు. ఇందుకోసం బడ్జెట్‌లో కేటాయింపులు జరిపామని గుర్తుచేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులపై కలెక్టర్లు నిఘా తీవ్రతరం చేయాలన్నారు. గ్రామ స్థాయి నుంచి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించే వ్యాపారులకే అవకాశం ఉంటుందన్నారు. నకిలీలను నియంత్రించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
గ్రామ సచివాలయాల్లో ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితా
గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఎంత ప్రభుత్వ భూమి ఉందో గుర్తించాలని వచ్చే ఉగాది నాటికి ఇళ్లులేని నిరుపేదలకు సొంత స్థలం మంజూరు చేయాల్సి ఉందన్నారు. దీనిపై కలెక్టర్లు శ్రద్ధ వహించాలని కోరారు. గృహనిర్మాణానికి బడ్జెట్‌లో రూ. 8600 కోట్లు కేటాయించామని అవసరమైతే ప్రైవేట్ భూములు కొనుగోలు చేయాలని ఆదేశించారు. త్వరలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు కానుందని గ్రామంలో ఇళ్లు ఎవరికి అవసరమో వారి ద్వారా వివరాలు సేకరించ వచ్చన్నారు. కలెక్టర్లమీద తనకు విశ్వాసం, నమ్మకం ఉందని తన బలం కూడా అదే అన్నారు. చిత్తశుద్ధితో ఈ విషయంలో స్పందిస్తే తరతరాలుగా మీ పేరును చెప్పుకునే అవకాశం ఉంటుందన్నారు. లబ్ధి దారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలన్నారు. అవినీతికి తావులేకుండా ఇసుక లభ్యతను పెంచాలని ఆదేశించారు. సెప్టెంబర్ ఒకటి నుంచి నూతన ఇసుక విధానం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయానికి వెళితేకానీ అనుమతి రావటంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, మండల స్థాయిలోనే ఒకరికి బాధ్యత అప్పగించి పర్యవేక్షించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వౌలిక సదుపాయాలపై దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. ఈ ఏడాది నుంచి పాఠ్య ప్రణాళికల్లో మార్పులు తీసుకొస్తామని దీనిపై నిపుణుల కమిటీ ఆధ్యయనం చేస్తోందని వివరించారు. ప్రతి పాఠశాలను ఇంగ్లీష్ మీడియంగా మార్చి తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేస్తామన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పరిశీలించాలని నిర్వాహకులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరపాలని నిర్దేశించారు. యూనిఫారాలు, పుస్తకాల పంపిణీ పూర్తి కావాలన్నారు. ఇకపై జూన్ నాటికే టైలరింగ్ చార్జీలతో సహా ఏ సమయానికి ఏది అవసరమో వాటిని విద్యార్థులకు మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రులను కూడా పరిశీలించాలన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్‌లో రిసెప్షనిస్ట్
రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో రిసెప్షనిస్ట్‌ను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు ఉపశమనం కలిగేలా వ్యవస్థలో మార్పు రావాలన్నారు. చిరునవ్వుతో బాధితులను పలుకరించి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కోరారు. పంచగ్రామాల సమస్య తీర్చాలని విశాఖపట్టణం కలెక్టర్ వినయ్‌ను ఆదేశించారు.
కర్నూలు కలెక్టర్‌కు అభినందనలు
కర్నూలు జిల్లా పాణ్యంలో పాఠశాల హాస్టల్ స్థితిగతులను తనిఖీచేసి అక్కడున్న పరిస్థితులను వెలుగులోకి తెచ్చిన కలెక్టర్ వీరపాండ్యన్‌ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ వీడియోను తాను కూడా తిలకించానని ఇదే తరహాలో కలెక్టర్లంతా స్పందిస్తే వ్యవస్థలో కచ్చితంగా మార్పు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.