రాష్ట్రీయం

పైరవీలకు సై! అంతర్ జిల్లాలకు నై!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : కొత్త టీచర్ల నియామకాలు జరుగుతున్నాయని, పాత టీచర్లకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని చాలా కాలంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నా వౌనంగా ఉన్న ప్రభుత్వం దొడ్డిదారిన మాత్రం టీచర్ల బదిలీలు చేస్తోంది. టీచర్ల బదిలీలకు స్పష్టమైన కౌనె్సలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం, పాలనాపరమైన చర్యలు పేరుతో అడ్డదారిలో బదిలీలు చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరవీ బదిలీలకు సై అంటున్న ప్రభుత్వం అంతర్‌జిల్లా బదిలీలకు మాత్రం నై అంటోందని ఆరోపించారు. దొడ్డి దారిన ఇచ్చిన జీవోలను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి టీచర్ల బదిలీలకు ముందు ఖాళీగా ఉన్న పోస్టులను, ఊళ్లను ఆయా జిల్లాల్లో నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత టీచర్ల నుండి దరఖాస్తులను ఆహ్వానించి, వారు పనిచేస్తున్న ప్రదేశం, వారి ప్రతిభా పాటవాలు, ఆయా సంవత్సరాల్లో వారి వారి సబ్జెక్టుల్లో విద్యార్థులు సాధించిన మార్కులు, పాఠశాల ప్రగతి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వారికి వెయిటేజీ ప్రకటించి మెరిట్ లిస్టు ఆధారంగా బదిలీలను పారదర్శకంగా చేపట్టాల్సి ఉంటుంది. కౌనె్సలింగ్ విధానం ప్రకారం ఒక్కరిని కూడా ఎలాంటి ప్రాతిపదిక లేకుండా బదిలీ చేయడానికి వీలు లేదు. ఎవరైనా టీచర్‌పై ఫిర్యాదులు అందితే, వారిపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బదిలీ చేయడం పరిపాటి. కానీ, ప్రభుత్వం ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే సిఫార్సుల ప్రాతిపదికపై బదిలీలు చేయడం కౌనె్సలింగ్ విధానానికి తూట్లు పొడవడమేనని టీచర్లు వాపోతున్నారు. కొంత మంది అధికారం, రాజకీయం, ఇతర పలుకుబడి ఉపయోగించుకుని, కావల్సిన చోటుకు బదిలీ అయితే మిగిలిన వారి సంగతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. సోమవారం నాడు 15 మందికి సీఎం కార్యాలయం సిఫార్సు మేరకు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధనరెడ్డి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా లోపల, బయట జిల్లాలకూ ఈ బదిలీలు జరగడం గమనార్హం. నిర్మల్ నుండి ఆదిలాబాద్‌కు, కొత్తగూడెం నుండి రంగారెడ్డికి, జగిత్యాల నుండి కరీంనగర్‌కు, సిరిసిల్ల జిల్లాల్లో ఒక మండలం నుండి వేరొక చోటుకు ఈ బదిలీలు జరిగాయి. అభ్యర్ధులు పాఠశాలల్లో చేరే వరకూ ఎవరికీ సమాచారం లేకుండా రహస్యంగా ఈ ఉత్తర్వులను జారీ చేయడం ఒక అంశమైతే, అన్ని బదిలీల ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వమే పారదర్శక కౌనె్సలింగ్ విధానానికి తూట్లు పొడుస్తుంటే ఎవరికి చెప్పుకుంటామని వారు ప్రశ్నిస్తున్నారు. సుమారు నాలుగైదు వందల ఉపాధ్యాయులు అంతర్ జిల్లా బదిలీలు కోరుతూ ఐదేళ్లుగా మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా, ఉపాద్యాయ సంఘాలు ప్రాతినిధ్యం చేస్తున్నా పట్టించుకోకుండా పలుకుబడితో పైరవీలు చేసుకోగలిగిన వారికి మాత్రం కోరుకున్న చోటుకు ప్రభుత్వం రహస్యంగా బదిలీలు చేయడం ఏం న్యాయమని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రశ్నిస్తోంది. అర్హత ఉన్న ఉపాధ్యాయులు అందరికీ అంతర్‌జిల్లా బదిలీలు చేయడానికి వీలుగా నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని పోరాట కమిటీ నేతలు సీహెచ్ రవి (యూటీఎఫ్), వై. అశోక్ కుమార్, మైన శ్రీనివాసులు (టీపీటీఎఫ్), ఎం. రఘుశంకర్ రెడ్డి, టీ లింగారెడ్డి (డీటీఎఫ్) తదితరులు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డిని కలిసి నిరసన తెలిపారు. పైరవీ బదిలీలను రద్దు చేసి అంతర్‌జిల్లా బదిలీలకు షెడ్యూలు జారీ చేయాలని వారు కోరారు. కాగా, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఎస్జీటీలుగా, భాషా పండితులుగా పనిచేస్తూ టీఆర్టీలో స్కూల్ అసిస్టెంట్లుగా ఎంపికైన ఉపాధ్యాయులకు వేతన రక్షణ కల్పిస్తామని ఈ సందర్భంగా కార్యదర్శి జనార్ధనరెడ్డి ఉపాధ్యాయ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.