రాష్ట్రీయం

ఇక భూముల రీ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం : రాష్ట్రంలో భూముల రీ సర్వేకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. ఉపగ్రహాల ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సర్వే ఐదేళ్లలో పూర్తవుతుందని సమాచారం. దశాబ్దాలుగా రీ సర్వే జరగకపోవడంవల్ల సర్వే విధులు నేల విడిచి సాము చేస్తున్నట్టుగావుంది. భూ సమస్యలతో మానవ వనరులు వృథా అవుతుండటంతో దేశ జీడీపీ కూడా తగ్గుతోంది. ప్రస్తుతం రోజువారీ విధులకే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలో సిబ్బంది, సర్వేయర్ల కొరత పట్టి పీడిస్తోంది. ప్రజల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో భూ వివాదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వాస్తవానికి ప్రతి 30 ఏళ్లకోసారి భూముల రీ సర్వే చేయాలనేది నిబంధన. కానీ 1928 నుంచి భూముల రీ సర్వే జరగలేదు. క్షేత్ర స్థాయిలో భూమిని కొలుచుకుంటూ వెళ్తే కొన్ని దశబ్ధాలు పడుతుంది. అయితే ఇపుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక విధానం ద్వారా భూముల రీ సర్వే చేయాల్సివుంది. ఈ విధానాన్ని మాత్రం శాస్ర్తియబద్ధంగా అనుసరించాల్సివుంది. ఈ నేపథ్యంలో ఉపగ్రహ సాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఒక లక్షా 60వేల 200 చదరపు కిలో మీటర్లు. జనాభా పెరగడంతో భూమి పంపకాలు జరిగాయి. భాగాలుగా విడిపోయిన భూమిని సబ్-డివిజన్ చేయాలంటే రీ సర్వే తక్షణం జరగాలి. అపుడే కోర్టు వివాదాలు తగ్గి, ఇబ్బందులు ఉండవు. పెద్ద నగరాల్లో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. ఎంజాయిమెంట్ సర్వేచేసి రుసుం కట్టిస్తే మున్సిపాలిటీలకు రూ.కోట్ల ఆదాయం లభిస్తుంది. అలాగే భూ ఆక్రమణలు జరగకుండా చూసుకోవచ్చు.
అయితే రాష్ట్రంలో భూముల రీ సమగ్ర సర్వేకు సుమారు రూ.2000 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనావేశారు. రాష్ట్రంలో చాలాచోట్ల భూములు నిషేధిత జాబితాలో ఉండటంవల్ల క్రయ విక్రయ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్‌ఎస్ నెంబర్లకు, రికార్డులో ఉన్న భూములకు పొంతన లేకుండావుంది. ఒకే భూమి ఒకే సర్వే నెంబర్‌లో ఇద్దరికి పాస్‌బుక్‌లు ఉన్న సందర్భాలు కూడా వున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్‌ఎంబీ రికార్డుల్లో భూమికి, వాస్తవ భూమికి పొంతనలేదు. సర్వే నెంబర్‌లోని భూమికి, అనుభవిస్తున్న భూమికి పొంతన లేకుండావున్న కేసులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. భూమి యాజమాన్య హక్కులు లేకుండా వంశపారంపర్యంగా అనుభవిస్తున్న సమస్యలు కూడా ఉన్నాయి.
భూముల రీ సర్వేకు సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. రీ సర్వేకు ఆధునిక పరికరాలతో పాటు అధిక సిబ్బందిని నియమించుకోవాల్సివుంది. క్షేత్ర స్థాయిలో సంప్రదాయ విధానంలో అయితే రీ సర్వేకు దశాబ్ధాలు పడుతుంది. కానీ ఐదేళ్ల కాలంలో రీ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్టు తెలుస్తోంది. భూముల రీ సర్వేకు అవసరమైన ఆధునిక పరికరాల కొనుగోలుకు, అవసరమైన సిబ్బంది శాశ్వత, అవుట్ సోర్సింగ్ విధానం ప్రాతిపదికన భర్తీ చేసుకోవడానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది.
ఒకపుడు సంప్రదాయ పద్ధతిలో గొలుసులతో భూమిని కొలిచే విధానం అనంతరం డీజీపీఎస్ విధానం (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కోర్స్) అనే అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం శాటిలైట్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ శాటిలైట్ ఆధారిత భూ రీ సర్వేకు రంగం సిద్ధంచేస్తున్నారు. ఈకోర్స్ విధానంలో బేస్ స్టేషన్, రోవర్ అనే రెండు పరికరాల వ్యవస్థలు వుంటాయి. బేస్ స్టేషన్ శాటిలైట్‌తో అనుసంధానంచేసి, సర్వే సెటిల్‌మెంట్ కమిషనరేట్‌లో ఉంచుతారు. రోవర్ అనే పరికరాన్ని ఎక్కడికి కావాల్సి వస్తే అక్కడకు తీసుకెళ్లి అమర్చుతారు. శాటిలైట్ ద్వారా అనుసంధానించిన కంప్యూటర్లకు ఆయా భూముల గ్రాఫ్‌ల రూపంలో కోణాలతో నమోదవుతాయి. ఈ విధానంలో ఆఖరికి చెరువు గట్లు కూడా తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఎపుడో బ్రిటీష్ కాలంలో జరిగిన భూముల రీ సర్వే ఇపుడు రీ సర్వేకు నోచుకోనుండటంతో భూ వివాదాలు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా దక్కనుంది. భూమి రికార్డులన్నీ అప్‌డేట్ అయి బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి.