రాష్ట్రీయం

సస్పెన్షన్లు మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: నూతన శాసనసభ సమావేశాల తొమ్మిదో రోజైన మంగళవారం తొలిసారి సస్పెన్షన్లు చోటు చేసుకున్నాయి. వాగ్వాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ అట్టుడికిన అనంతరం చివరకు టీడీపీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులను ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. ఉదయం 9 గంటలకు శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అధ్యక్షతన ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగా తొలి ప్రశ్నగా 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ, అల్ప సంఖ్యాక వర్గాల మహిళలకు పింఛన్లు మంజూరు విషయం చర్చకు రాగా అధికార విపక్షాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ విధంగా దాదాపు గంటన్నర సేపు సభలో ప్రశ్నోత్తరాలు పూర్తిగా స్తంభించాయి. 45 ఏళ్లకు పెన్షన్‌లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వమే ఆ దిశగా అడుగులు వేయకుండా మాట తప్పిందంటూ ప్రతిపక్షం ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో అధికార పక్షం తమ పార్టీ మేనిఫెస్టోతో పాటు గతంలో పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కే కోటపాడులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి ఈ పెన్షన్‌లకు సంబంధించి ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోలను సభలో ప్రదర్శించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు వీడియో ప్రదర్శన సమయంలో అడుగడుగునా అడ్డుతగులుతూ నినాదాలు చేస్తూ సభకు అంతరాయం కల్పించారు. తొలిసారిగా పలువురు ఏకంగా స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు ఇవ్వటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లేచి ప్రతి అంశానికి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు ప్రతిపక్షం అడ్డుపడటం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. ప్రతి రోజూ ఇదే వైఖరి అయితే ఎలా అన్నారు. సభ సాఫీగా జరిగేందుకై 341 సెక్షన్ కింద అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు టీడీపీ సభ్యులు కింజరపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడిని సస్పెండ్ చేయాలంటూ ప్రతిపాదించారు. సభా ప్రారంభం నుంచి కూడా వీరు సభా సమయాన్ని వృథా చేస్తూ సభకు అంతరాయం కల్గిస్తున్నారని, స్పీకర్ సూచనలను కూడా పట్టించుకోకుండా పోడియం వద్దకు దూసుకువచ్చారని పైగా స్పీకర్ మైకులు లాగేందుకు యత్నించారని ఫిర్యాదు చేయటంతో సభా స్థానంలోఉన్న రఘుపతి ఆ ముగ్గురిని సస్పెండ్ చేరారు. ఈ సమావేశాలు ముగిసే వరకు వారి సస్పెన్షన్ కొనసాగుతుందని కూడా వెల్లడించారు. అయినప్పటికీ ఆ ముగ్గురు సభ్యులు సభలోనే ఉంటూ నినాదాలు చేస్తుండటంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేసి బయటకు తీసుకెళ్లారు. తొలుత రామానాయుడిని బలవంతంగా ఎత్తుకుని తీసుకెళ్లగా ఆపై మిగిలిన ఇద్దరు తామంతట తాముగా వెలుపలకు వెళ్లారు. ఈ సమయంలో చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి అచ్నెన్న... బుచ్నెన్న గుడ్‌బై అంటూ చేతులూపగా అంతటి సీరియస్ వాతావరణంలో కూడా నవ్వులు వెల్లివిరిసాయి. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా ఈ ముగ్గురి ప్రవర్తన వింతగా ఉందని, సభకు అడ్డుతగులుతున్నందున ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు కాకుండా సభ సాంప్రదాయాలు పాటించని వీరిని శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో హాజరైన టీడీపీ సభ్యులందరూ స్పీకర్ వైఖరిని, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేస్తూ వాకౌట్ చేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద బిగ్గరగా నినాదాలు చేశారు. అప్పటి వరకు సభలో లేని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సస్పెన్షన్ల సమాచారం అందుకుని హడావుడిగా సభలోకి ప్రవేశించి ఉద్వేగంతో ఏదో మాట్లాడబోతుండగా అధికారపక్ష సభ్యులు అడ్డుకున్నారు. మళ్లీ పెన్షన్‌ల వ్యవహారాన్ని ప్రస్తావించబోగా సీఎం జగన్ కల్పించుకుంటూ ఈ వ్యవహారంపై ఒకసారి తాను పూర్తి వివరణ ఇచ్చిన తరువాత మళ్లీ ఏమిటని ప్రశ్నిస్తూ బాబు కోసం ముచ్చటగా మూడోసారి సభలో మాడుగుల సభలో తాను మాట్లాడిన ప్రసంగంలో ఇచ్చిన హామీలను వీడియో ప్రసారం చేయించారు. మోసం చేయడం... అబద్ధాలు ఆడటం తమ ఇంటా వంటా లేవని జగన్ స్పష్టం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కల్పించుకుని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళకు నాలుగేళ్లలో నాలుగు విడతలుగా రూ. 75వేలు ఇస్తామని చెప్పాం.. మేనిఫెస్టోలో చేర్చామని, చంద్రబాబులా మోసం చేసే అలవాటు తమకు లేదన్నారు. ఆయా వర్గాలపై చంద్రబాబుది కపట ప్రేమ అన్నారు. ఏవో పాత పేపర్లు చూపి రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో టీడీపీ ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీలా వక్రబుద్ధి తమకు లేదని, మేనిఫెస్టో తమకు భగవద్గీతతో సమానమని అన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ఆవేశంగా మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా... ఖబడ్దార్.. ఖబడ్దార్ బాబూ.. మీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో అంటూ పదేపదే హెచ్చరించారు. సభలో పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అధ్యక్ష స్థానంలో ఉన్న రఘుపతి సభను వాయిదా వేశారు.

చిత్రం...టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడిని సభ నుంచి బయటకు తీసుకొస్తున్న మార్షల్స్