రాష్ట్రీయం

హరిచందన్ ప్రమాణ స్వీకారం నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఒకప్పటి సీఎం క్యాంప్ కార్యాలయం అయిన రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రాంగణంలో అద్భుతమైన వేదికను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజ్‌భవన్‌గా రూపుదిద్దుకున్న భవనం నాలుగు దశాబ్దాలు పైగా జలవనరుల శాఖ కార్యాలయంగా పని చేయగా రాష్ట్ర విభజన అనంతరం కోట్లాది రూపాయల ఖర్చుతో గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తుతో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం మరికొన్ని అదనపు వౌలిక సదుపాయాలతో రాజ్‌భవన్ రూపుదిద్దుకుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్యాలయం, మొదటి అంతస్తులో నివాస సౌకర్యం కల్పించారు. గవర్నర్ కార్యదర్శిగా నియమితులైన ముఖేష్ కుమార్ మీనా మూడు రోజుల్లోనే రాజ్‌భవన్‌కు సరికొత్త కళ తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కి ఘన స్వాగతం లభించింది. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, సీఆర్‌డీఏ జాయింట్ కమిషనర్ విజయ్‌కృష్ణన్, సబ్ కలెక్టర్ మిషాసింగ్, ప్రొటోకాల్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు స్వాగతం పలికారు. తొలుత సాయుధ దళాల నుంచి మర్యాదపూర్వక వందనం స్వీకరించారు. తదుపరి గవర్నర్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా రాజ్‌భవన్ అధికారులు, సిబ్బందిని పరిచయం చేశారు. ముందుగా ఆయన గవర్నర్ దంపతులను శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం రేపటి కార్యక్రమాల గురించి సమాచారాన్ని వివరించారు. తదుపరి రాష్ట్ర పరిస్థితులను గురించి ప్రాథమిక సమాచారాన్ని విశదీకరించారు. ఈ నేపథ్యంలో తనకు ఈ రూపంలో ఆంధ్రప్రదేశ్‌కు సేవచేసే అవకాశం లభించిందంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నూతనంగా కొద్ది రోజుల్లోనే రాజ్‌భవన్ వ్యవస్థ రూపుదిద్దుకున్నప్పటికీ అన్ని ఏర్పాట్లు బాగా చేసారంటూ గవర్నర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.
నూతన గవర్నర్‌కు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం సాయంత్రం 5.50 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. తిరుపతి నుండి గన్నవరం చేరుకున్న గవర్నర్, ఆయన సతీమణి సుప్రభ హరిచందన్‌లకి రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన గవర్నర్ దంపతులకు పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అధికార లాంఛనాలతో త్రివిధ దళాలు అందించిన గౌరవ వందనాన్ని నూతన గవర్నర్ స్వీకరించారు. అనంతరం రాష్ట్ర మంత్రులు, ఇతర ఉన్నత అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిచయం చేశారు. రాష్ట్ర మంత్రులు మేకతోటి సుచరిత, కొడాని నాని, మోపిదేవి వెంకటరమణ, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, తానేటి వనిత, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్. సీపీ ద్వారకా తిరుమలరావు, సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తదితరులు నూతన గవర్నర్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

చిత్రం...కొత్త గవర్నర్ హరిచందన్‌కు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి