రాష్ట్రీయం

శ్రీశైలానికి భారీ వరద 10న గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 8: కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పొంగిపొర్లుతోంది. ఆల్మట్టి, నారాయణాపూర్, ప్రియదర్శిని జూరాల జలాశయాలు నిండిపోవడంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని వచ్చినట్టు దిగువకు వదిలేస్తున్నారు. ముందుజాగ్రత్త కోసం గురువారం ఉదయం నుంచి వస్తున్న ప్రవాహానికి మరో 50 వేల క్యూసెక్కులు అదనంగా దిగువకు విడుదల చేస్తుండడంతో కృష్ణవేణి ఉగ్రరూపం దాల్చింది. శ్రీశైలం జలాశయానికి గురువారం రాత్రి సమయానికి 3,71,014 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 877.20 అడుగులకు చేరుకోగా, నీటి నిల్వ 173 టీఎంసీలకు చేరింది. వరద పోటెత్తుతుండడంతో ఏ క్షణాన్నయినా శ్రీశైలం క్రస్ట్‌గేట్లను ఎత్తివేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజాము సమయానికి వరద ప్రవాహం 4 లక్షల క్యూసెక్కులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్ర పరిధిలోని కుడి విద్యుత్ కేంద్రం ద్వారా 31,350, ఎడమ విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు కలిపి సుమారు 73,728 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు విడుదల
చేస్తున్నారు. ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుండి శ్రీశైలం కుడి ప్రధాన కాల్వకు 20 వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 338 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 735 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, తెలంగాణ పరిధిలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుండి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని ఈనెల 10వ తేదీ తెల్లవారుజామున లేదా మధ్యాహ్న సమయంలో క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే అంచనాలకు మించి వరద వచ్చే అవకాశం ఉందన్న సమాచారం ఉండడంతో ఏ క్షణాన్నయినా గేట్లను ఎత్తాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. నిరంతర పర్యవేక్షణలో అధికారులు నిమగ్నమైనా హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు నీటి తరలింపును తగ్గించడంతో పరిస్థితి రైతులకు అర్థంకాని విధంగా తయారైంది. వరద వస్తున్న సమయంలో అత్యధికంగా నీటిని విడుదల చేయాల్సి ఉన్నా తగ్గించడం ఎందుకంటున్న రైతుల ప్రశ్నకు అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.