రాష్ట్రీయం

ఇసుక పర్మిట్లు కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 13: ఇసుక పర్మిట్లను కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు తీసుకువచ్చి డంప్ యార్డ్‌ల్లోనే పర్మిట్లు మంజూరు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ‘స్పందన’ కార్యక్రమం అమలు తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీచ్‌లతో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో డంప్‌యార్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక కొరత ఉందని సమాచారం అందుతోందని, ఈ సమస్యను నిర్మాణాత్మకంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వంలో మాఫియా సామ్రాజ్యం శాసించిందని, ఆ పరిస్థితికి స్వస్తి పలకాలన్నారు. అప్పట్లో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మాఫియాగా మారి దోచుకున్నారని, తమ ప్రభుత్వంలో ఏ అధికారి ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గరాదని నిర్దేశించారు. ఇప్పటికే అవినీతికి తావులేకుండా మాఫియా సామ్రాజ్యానికి చెక్ పెట్టామని, ఇదే పరిస్థితి కొనసాగిస్తూ వినియోగదారులకు తగినంత అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అధికారుల సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ప్రస్తుతం 65 రీచ్‌ల ద్వారా అవసరాలకు తగిన ఇసుక ఇవ్వలేమన్నారు. కనీసం 200 రీచ్‌ల ద్వారా అయినా సరఫరా జరగాలన్నారు. వచ్చేనెల 5వ తేదీలోగా ప్రతి రీచ్‌లో వీడియో కెమెరాలు, వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ఎండీసీ సన్నద్ధమవుతోందని తెలిపారు. ఈలోగా ప్రతి రీచ్‌లో డంప్ యార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వరదల కారణంగా ఇసుక రీచ్‌లన్నీ మూతపడ్డాయని అందువల్లే కొరత ఏర్పడిందని ముఖ్యమంత్రికి కలెక్టర్లు వివరించారు. వరదలు తగ్గుముఖం పట్టాకే ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు. స్పందన కార్యక్రమం కింద ప్రజల నుంచి పెద్దఎత్తున వినతులు అందుతున్నాయని తెలిపారు. జూలై 31 నాటికి 1,08,997 రాగా ఆగస్టు మొదటి వారంలో 34,541 వచ్చాయన్నారు. సమస్యలు సత్వరమే పరిష్కారమవుతున్నందునే స్పందన పెరిగిందని అధికారులను అభినందించారు. క్రమం తప్పకుండా కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు నేరుగా ఫోన్‌చేసి వారి అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. తహశీల్దార్లు, ఎస్‌ఐలు, కలెక్టర్లు, ఎస్పీల స్పందన తెలుసుకుని అవసరమైతే సర్వేలు కూడా నిర్వహిస్తామన్నారు. దాదాపు 90 శాతం వినతులు పరిష్కారమవుతున్నాయని ఇది శుభపరిణామమన్నారు. అసంతృప్తితో ఉన్న వారిని గుర్తించి వారి నుంచి సమాచారాన్ని సేకరించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినతుల పరిష్కారంలో 9.5 శాతం కంటే తక్కువ అసంతృప్తి స్థాయి ఉందని అనంతపురంలో 13.9, చిత్తూరులో 10.3, తూర్పుగోదావరిలో 12.83, కృష్ణా జిల్లాలో 11.74 శాతం ఉందన్నారు. వినతుల పరిష్కారంలో ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సొంతింట్లో సమస్య మాదిరిగానే అధికారులు స్పందిస్తే ఒక శాతం కంటే తక్కువ అసంతృప్తి ఉంటుందని తెలిపారు. కలెక్టర్ నుంచి దిగువ స్థాయి వరకు దీన్ని లక్ష్యంగా ఎంచు కోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.5 శాతం వినతులు తిరస్కరించినట్లు వివరించారు. ప్రజలు ఏదైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

చిత్రం...వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి