రాష్ట్రీయం

రివర్స్ టెండర్లకు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండర్లకు ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, కాంట్రాక్టర్లకు దొడ్దిదారిన దోచిపెట్టిందని ఆరోపిస్తూ ప్రస్తుతం పనిచేస్తున్న నవయుగ సంస్థ కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. గత కొద్ది రోజులుగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు కసరత్తు జరిపింది. పోలవరం అథారిటీ వారిస్తున్నా ప్రభుత్వం లెక్క చేయకుండా రివర్స్ టెండరింగ్‌కు మొగ్గు చూపడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రివర్స్ టెండరింగ్‌ను అటు పోలవరం అథారిటీ, ఇటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ప్రాజెక్ట్ నిర్మాణం ముందుకు సాగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్ట్ సహా ఇతర ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులను రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా నిర్వహిస్తామని, దీనిపై పర్యవేక్షణకు జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవినీతికి తావులేకుండా పారదర్శకంగా తక్కువ బిడ్‌లను కోట్ చేసిన సంస్థలకు పనులు అప్పగించటం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయచ్చనేదని ప్రభుత్వ భావన. కాగా ప్రస్తుతం పోలవరం నిర్మాణ పనులు 71 శాతం మేర పూర్తయ్యాయి. వరదలు తగ్గుముఖం పట్టిన అనంతరం మరో నెల రోజుల తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో అర్ధంతరంగా పనులు నిర్వహిస్తున్న నవయుగ సంస్థ కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అభ్యంతరాలను సైతం పక్కనపెట్టి రూ. 4900 కోట్లకు సంబంధించిన పనులు చేపట్టేందుకు రివర్స్
టెండరింగ్ నోటిఫికేషన్‌ను జలవనరులశాఖ వెబ్‌సైట్‌లో పెట్టింది. హెడ్ వర్క్స్‌లో మిగిలిన పనులకు రూ. 1800 కోట్లు, హైడల్ ప్రాజెక్ట్‌కు రూ. 3100 కోట్ల అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2015-16 ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారం కాంక్రాక్ట్ సంస్థలకు ఆహ్వానం పలికింది. ఈ ప్రకారం గడువులోగా కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసిన అనంతరం జ్యుడీషియల్ కమిషన్ అందరి అభ్యంతరాలు, సూచనలు, సలహాలను స్వీకరించి తక్కువ ధరకు కోట్‌చేసే వారికి పనులు అప్పగించనుంది. రివర్స్ టెండరింగ్‌లో నవయుగ సంస్థ కూడా పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. అయితే 2015-16 ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారం పనులు చేపట్టేందుకు కాంట్రాక్ట్ సంస్థలు ఆసక్తి చూపటంలేదని చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు జ్యుడీషియల్ కమిషన్ అనేది ఇంకా ఏర్పాటు కాలేదు. ఈ పరిస్థితుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఏ రకంగా నిర్వహిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరిగే కొద్దీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈనెల 13వ తేదీన జరిగిన పోలవరం అథారిటీ సమావేశంలో సీఈఒ ఆర్‌కె జైన్ రివర్స్ టెండరింగ్‌ను ప్రస్తావిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నిర్మాణ వ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రస్తుత కాంట్రాక్ట్ కంపెనీల పనితీరు బాగానే ఉందని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిర్ధారించటానికి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన నిపుణుల కమిటీని నియమించిందని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ విధానంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని దీనివల్ల నష్టం తప్ప లాభంలేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించని పోలవరం అథారిటీ సీఈఒ ఏకే జైన్ రివర్స్ టెండరింగ్‌ను నిలిపివేయాలంటూ ఈనెల 16న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు రాసినలేఖ శనివారం వెలుగులోకి వచ్చింది. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయాలంటే రివర్స్ టెండరింగ్‌కు స్వస్తి చెప్పాలని ఆ లేఖలో స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ విస్తృత ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని, వాటిని త్వరలోనే రాష్ట్రానికి పంపుతామని ఆ లేఖలో వివరించారు. దీంతో రివర్స్ టెండరింగ్‌పై అధికారులు సందిగ్ధంలో పడ్డారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పీపీఏ సీఈఒ రాసిన లేఖ సారాంశాన్ని వివరించారు. అయితే రివర్స్ టెండరింగ్ విషయంలో వెనక్కు తగ్గవద్దని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో పీపీఏ సీఈఒ లేఖను పక్కనపెట్టి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని, ఈ ప్రభావం ప్రాజెక్ట్ నిర్మాణంపై పడుతుందనే వాదనలు వినవస్తున్నాయి. దీనిపై కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే.