రాష్ట్రీయం

తెలంగాణలోనూ బీజేపీ జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: దక్షిణభారతానికి ముఖద్వారమైన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబపాలనకు చరమగీతం పాడుతామని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఆరోగ్యశ్రీని నిలిపివేశారని, పేదలకు వైద్య సేవలు అందడం లేదని, అవినీతి పెచ్చుమీరిందని ఆయన ఆరోపణలు చేశారు. ఆదివారం హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీయేతర పార్టీలన్నీ కుటుంబాల ఆధిపత్యంలో ఉన్నాయని, ఈ పార్టీలో ప్రజాస్వామ్యం ఉండదని, సామాన్య కార్యకర్తలు ఉన్నత స్థానాలకు రాలేరని చెప్పారు. ఈ సభలో టీడీపీకి చెందిన ఎంపీ గరికపాటి రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కోనేరు సత్యనారాయణ, బోట్ల శ్రీనివాస్, మువ్వా సత్యనారాయణ, నందీశ్వర్ గౌడ్, సామ రంగారెడ్డి, జగన్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, సాదినేని శ్రీనివాసరావు, శోభారాణి, పాల్వాయి రజనికుమారి, శ్రీకాంత్ గౌడ్, శ్రీలతిత రెడ్డి, లంకల దీపక్ రెడ్డి, బేగ్, అంజయ్య యాదవౌ, బాబూరావు నాయక్, ఊకే అబ్బయ్య, ఈగ మల్లేశం, వెంకటేశ్వరరావు, కోనేరు చిన్ని, ఎర్ర శేఖర్, శ్రీకళ రెడ్డి, విజయపాల్ రెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన చాలా మంది నేతలు బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా ముందుకు రావడాన్ని స్వాగతించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలనను అంతమొందించాలంటే
బీజేపీ నాయకత్వంలో పోరాడాలన్నారు. టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపిస్తామన్నారు. దేశంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ ఇంకా ఎన్నో పార్టీలు ఉన్నాయి. వీటిల్లో కుటుంబ పెత్తనం నడుస్తోంది. సామాన్య నేతలు, కార్యకర్తలకు సరైన అవకాశాలు ఉండవు అని ఆయన అన్నారు. తాను కేసీఆర్ గురించి వ్యక్తిగత ఆరోపణలు చేయదలుచుకోలేదన్నారు. తెలంగాణలో మాత్రం టీఆర్‌ఎస్ పరిపాలన అధ్వాన్నస్థితికి చేరుకుందన్నారు. సచివాలయం కూల్చడమేంటని ఆయన ప్రశ్నించారు. ఒక వైపు ఆరోగ్యశ్రీకి నిధులు బకాయిలు ఉండడమేంటన్నారు. లక్షలాది మంది పేదలు బాధపడుతుంటే, కేసీఆర్ ఏమి చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ఒక పవిత్ర క్షేత్రమని, ప్రాజెక్టు మాత్రం అంతా అవినీతి మయమని ఆయన చెప్పారు. సచివాలయానికి వాస్తుదోషమేంటని ఆయన ప్రశ్నించారు. వాస్తు దోషముంటే కూల్చేయడమేనా అని ఆయన అన్నారు. దుర్మార్గమైన పరిపాలనను సహించే ప్రసక్తిలేదన్నారు. మంత్రివర్గంలో ఒక మహిళ ఉన్నారా అని అడిగారు. అలాగే గిరిజన వర్గాలకు సరైన ప్రాతినిథ్యం ఉందా? అని ప్రశ్నించారు. కేంద్రం కోట్లాది ఇండ్లను మంజూరు చేస్తే, ఇక్కడ గృహ నిర్మాణం చతికిలపడిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ స్కీంలన్నీ అవినీతిమయమన్నారు. కేసీఆర్ చెప్పేదొకటి, చేసేదొకటి అన్నారు. చివరకు పచ్చదనం కోసం చేపట్టిన హరితహారంలో కూడా నిధుల దుర్వినియోగం జరుగుతోందన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ఒక దేశం, ఒక జెండా, ఒక రాజ్యాంగం కల సాకారమైందన్నారు. కశ్మీర్ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నా 370వ అధికరణను రద్దు చేశామన్నారు. ఆయుష్మాన్‌భవ స్కీంకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ రోజు 12కోట్ల మంది ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయన్నారు. కుహనాలౌకికవాదుల ఆగడాలకు బీజేపీ సర్కార్ చెక్ పెట్టినట్లు చెప్పారు. బీజేపీ భావజాలాన్ని చూసి దేశంలోని అనేక రాష్ట్రాల్లో యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారన్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ 60 రోజుల్లో అద్భుతమైన సంక్షేమ స్కీంలను అమలు చేస్తోందన్నారు. ఈ సమావేశంలో జేపీ నడ్డాను బీజేపీ నేతలు గజమాలతో సత్కరించారు.
సమష్టిగా పనిచేయండి, జనంలోకి వెళ్లండి: నడ్డా
అంతకుముందు పార్టీ పదాధికారుల సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడుతూ పార్టీ విస్తరణ, అభివృద్ధికి మార్గదర్శనం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో సమష్టిగా పనిచేయాలన్నారు. అన్ని పార్టీల నేతలను పార్టీలోకి ఆహ్వానించాలన్నారు. క్రమశిక్షణతో పనిచేసి ప్రజల అభిమానాలను చూరగొనాలన్నారు. కేసీఆర్ అప్రజాస్వామిక పాలనపై పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా బలహీనపడిందన్నారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలన్నారు. పార్టీ నేతలు జనంలోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని మమేకం కావాలన్నారు. బీజేపీలో ప్రజాస్వామ్యం దిగువ స్థాయి నుంచి పై స్థాయివరకు ఉందని, పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని ఆయన చెప్పారు. పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, డీకే అరుణ, నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలో ఆదివారం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా