రాష్ట్రీయం

ఆ ఫర్నిచర్ నా దగ్గరే ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 20: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఫర్నిచర్, ఏసీల మాయం వెనుక తన హస్తం ఉందన్న ఆరోపణలపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. హైదరాబాద్ నుంచి వెలగపూడికి అసెంబ్లీ ఫర్నిచర్ తరలిస్తుండగా సర్దుబాటు చేసుకునే క్రమంలో కొంత ఫర్నిచర్‌ను తాను వినియోగించుకున్నది వాస్తవమేనని అంగీకరించారు. మంగళవారం నర్సరావుపేటలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో డాక్టర్ కోడెల మాట్లాడారు. ఈ విషయమై గతంలో అసెంబ్లీ అధికారులకు పలుమార్లు లిఖితపూర్వకంగా లేఖలు రాసానన్నారు. తనవద్ద ఉన్న ఫర్నిచర్‌ను తీసుకువెళ్లాలని చెప్పినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని తెలిపారు. అధికారులు వస్తే ఫర్నిచర్ అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని, లేనిపక్షంలో తాను వినియోగించుకున్న ఫర్నిచర్‌కు ఖర్చు ఎంతైందో చెబితే ఆ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించారు.
అసెంబ్లీ ఫర్నిచర్ వినియోగంపై విమర్శలు
ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అధికారులకు తెలియజేయకుండా అసెంబ్లీకి చెందిన ఫర్నిచర్‌ను సొంతానికి వినియోగించుకోవడంపై మాజీ స్పీకర్ కోడెలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. 2017 మార్చి నెలలో ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్‌ను హైదరాబాద్ నుంచి
వెలగపూడి తరలిస్తున్న సమయంలో టేబుల్స్, కుర్చీలు, కంప్యూటర్‌లు, ఏసీలు లెక్కల్లో కనిపించక పోవడంపై ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసెంబ్లీకి చేరుకున్న పోలీసులు సామగ్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫర్నిచర్ తరలించే సమయంలో రికార్డుల్లో నమోదైన దానికి, వెలగపూడిలోని అసెంబ్లీకి చేరుకున్న దానికి వ్యత్యాసం ఉండటాన్ని పోలీసులు, అసెంబ్లీ అధికారులు గుర్తించారు. దీంతో స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు ఉన్నప్పుడే ఫర్నిచర్ గల్లంతైన విషయంపై అటు పోలీసులు, ఇటు అసెంబ్లీ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ ఫర్నిచర్‌ను సత్తెనపల్లి, నర్సరావుపేట, గుంటూరులోని కోడెల కార్యాలయాల్లో వినియోగించి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలా ఉండగా ఇప్పటికే కోడెల కుటుంబం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను సైతం చెప్పాపెట్టకుండా వినియోగించుకోవడం అత్యంత శోచనీయమని అధికారులు, ప్రజాప్రతినిధులు గళమెత్తుతున్నారు.
కోడెల చరిత్ర తెలియనిదెవరికి: ఎమ్మెల్యే గోపిరెడ్డి
రాష్ట్రప్రజలకు కోడెలతో పాటు ఆయన కుటుంబ సభ్యుల చరిత్ర మొత్తం తెలుసని నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో గోపిరెడ్డి మాట్లాడారు. నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కే ట్యాక్స్ పేరిట ప్రజల నుండి కోట్లాది రూపాయలు మాజీ స్పీకర్ కోడెల, ఆయన కుటుంబ సభ్యులు లూటీ చేశారని ఆరోపించారు. అసెంబ్లీ ఫర్నిచర్ అసెంబ్లీలో కాకుండా కోడెల ఇంట్లో ఎందుకుందని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌లు రాష్ట్రానికి కన్నం వేస్తే కోడెల అసెంబ్లీకే కన్నం వేశారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఇచ్చే మందులతో పాటు సెల్‌ఫోన్లను కూడా కోడెల విక్రయించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సిగ్గుచేటన్నారు. కోడెలను పార్టీలో ఎందుకు కొనసాగిస్తున్నారో టీడీపీ నాయకులే ఆలోచించుకోవాలన్నారు. కోడెల, ఆయన కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు సమాధానం చెప్పాలని గోపిరెడ్డి డిమాండ్ చేశారు.

చిత్రం...మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు