రాష్ట్రీయం

ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17 : భారత్‌తో ప్రత్యక్షంగా యుద్ధం చేసేందుకు పాకిస్తాన్‌కు సత్తాలేదని, అందువల్ల దేశంలో అంతర్గతంగా అల్లకల్లోలం లేపి, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాకిస్తాన్ కుట్రపన్నుతోందని రిటైర్డ్ మేజర్ జనరల్ జిడి బక్షి ఆరోపించారు. పౌర చైతన్య వేదిక ‘జాగృత భారత్’ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం ఇక్కడి తెలుగు లలిత కళాతోరణంలో జరిగిన ‘దేశం కోసం కదలిరండి’ బహిరంగ సభలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్‌తో జరిగిన యుద్ధాల్లో చిత్తుగా ఓడిపోయిన పాక్ గత మూడు దశాబ్దాలుగా దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందన్నారు. మానసికంగా, సామాజికంగా దెబ్బతీయడం ద్వారా దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కుట్ర రూపొందించి అమలు చేస్తోందన్నారు. భారత్‌ను విదేశాల నుండి కాపాడేందుకు మన సైనికులు నిరంతరం పనిచేస్తున్నారన్నారు. భారతదేశానికి యువత ఊపిరిగా ఉందని, దేశాన్ని రక్షించుకునేందుకు ప్రాణాలు అర్పించేందుకు కూడా వెనుకడుగు వేయవద్దని పిలుపు ఇచ్చారు.
బ్రిటన్ పాలనలో భారతీయులను కులాలవారీగా విడగొట్టి, సమాజాన్ని బలహీనపరిచి, ప్రజల మధ్య ద్వేషాలు పెంపొందించారని భక్షి గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా కులాల పేరుతో సమాజాన్ని విడగొట్టి, దేశాన్ని బలహీన పరిచేందుకు పాక్ భారీ కుట్రకు తెరలేపిందన్నారు. ఢిల్లీలోని జెఎన్‌యులో అఫ్జల్‌గురు వర్ధంతిని నిర్వహించారని, స్వచ్ఛంద సేవాసంస్థలు, మీడియాలో కొంతమంది, కొందరు రాజకీయనేతలు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం, మార్క్సిజం అడుగంటిపోయినా, మనదేశంలో మాత్రం ఈ భావజాలం ఇంకా కొనసాగుతోందని, వారే దేశాన్ని బలహీన పరిచేందుకు పాటుపడుతున్నారన్నారు. ఒక ఉగ్రవాదికి ఉరిశిక్ష వేస్తే కోర్టుపై నిందలు వేయడమా? అని ప్రశ్నించారు.
1971 లో పాక్‌ను రెండుముక్కలుగా చేయగలిగామని, భవిష్యత్తులో నాలుగుముక్కలుగా విడగొట్టేందుకు వెనుకడుగు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. లాన్స్‌నాయక్ హనుమంతప్ప తదితర వీరజవాన్లను యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఒక దీపం నుండి మరోదీపాన్ని వెలిగించినట్టు ఒక వీరుడి గాథ మరోవీరుడిని తయారు చేస్తుందన్నారు.

దేశంపై అధర్మ యుద్ధం:
ఎంవిఆర్ శాస్ర్తీ
భారతదేశంపై అధర్మ యుద్ధం జరుగుతోందని, కొన్ని వర్గాలు చేస్తున్న మాయా యుద్ధం వల్ల దేశానికి సమస్యలు వస్తున్నాయని, జాతి వ్యతిరేకులతో చేతులు కలిపిన వారందరినీ ఎదుర్కోవలసిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి లలితకళా తోరణంలో జరిగిన ‘దేశం కోసం... కదలిరండి..’ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రజలు కళ్లు తెరచి నిలబడనంత వరకే జాతి విద్రోహులు రోడ్ల మీద తిరగగలుగుతున్నారని, ప్రజలు లేచినపుడు వారి ఆటలు ఆగుతాయని పేర్కొన్నారు. అసలు మనం మన దేశంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని, మన దేశం వాళ్లు మంచిని కోరుకోకుండా క్రికెట్‌లో ఓడిపోయినందుకు ఆనందం వ్యక్తం చేయడం చూస్తుంటే ఈ అనుమానాలు వస్తున్నాయని అన్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే దేశభక్తుల మనస్సు చివుక్కుమంటోందని, ఒసామా బిన్ లాడెన్‌పై దాడి చేసి చంపిన తర్వాత అమెరికా ప్రభుత్వాన్ని అక్కడున్న ప్రతిపక్షం గానీ, మేధావులుగాని, ఇతరులు గానీ ఎవరూ ప్రశ్నించలేదని, ప్రభుత్వం వెంట నిలిచి సరైన చర్య చేశారని అన్నారని పేర్కొన్నారు. ముంబయి కాల్పులకు బాధ్యులైన నిందితులను మన దేశం 20 ఏళ్లు విచారించి యాకుబ్ మెమెన్‌ను ఉరితీస్తే భారత రాజ్యం చేసిన హత్యగా చెబుతున్నారని, ఆయననో మహానుభావిడిలా పూజించారని, భారత్‌ను ముక్కలుచేస్తామని జెఎన్‌యులో విద్యార్థులు అనడం దేశద్రోహమా కాదా..? అని నిలదీశారు. ఆ విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు కేసులు పెడితే ప్రతి రాజకీయనాయకుడు వచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడారని అన్నారు. జాతి వ్యతిరేకులను దేశద్రోహులుగానే చూడాలని చెప్పారు. దేశంలో కేరళ, బెంగాల్ తప్ప అన్ని రాష్ట్రాల్లో వామపక్షాలు తుడిచిపెట్టుకుపోయాయని, చివరికి గబ్బిలాల మాదిరి విద్యాసంస్థలను పట్టుకుని రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. కాశ్మీర్ వేర్పాటువాదులతో కలిసి కుట్రలు చేయడం దేశ ప్రజలందరి మీదా యుద్ధం చేయడం కాదా? అని ప్రశ్నించారు. జాతి వ్యతిరేక శక్తులు విద్యాసంస్థల్లో మీటింగ్‌లు పెట్టడం తప్ప ప్రజల్లోకి వచ్చి సమావేశాలు పెట్టే సత్తాలేదని, వారి పిచ్చిచేష్టలకు దేశంలో ప్రతి ఒక్కరూ భగభగలాడుతున్నారని, లావా మాదిరి లోలోపల మరిగిపోతున్నారని అన్నారు. భారత్ మాతాకీ జై అని చెప్పించేందుకే తాము ఈ సభ పెట్టామని, ధర్మం కోసం నిలబడితే దైవం కూడా మన వెంట నిలబడుతుందని నేటి సభ రుజువు చేసిందని వ్యాఖ్యానించారు.
హనుమంతప్ప తల్లికి సన్మానం
సరిహద్దుల్లో మంచుతుపానులో చిక్కుకుని ప్రాణాలు అర్పించిన లాన్స్‌నాయక్ హనుమంతప్ప తల్లిని ఈ సందర్భంగా సత్కరించారు. మేజర్ జనరల్ జి డి భక్షి , మోనికా అరోరా, ఎంవిఆర్ శాస్ర్తీ తదితరులు ఆమెను శాలువతో సత్కరించారు.

దేశం కోసం కదలిరండి కార్యక్రమంలో ప్రసంగిస్తున్న మేజర్ జనరల్ జిడి బక్షి, ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ

ఆదివారం తెలుగు లలిత కళాతోరణంలో జరిగిన ‘దేశం కోసం కదలిరండి’ కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహిని

జెఎన్‌యులో దేశద్రోహులు
ఢిల్లీలోని జెఎన్‌యులో కొం దరు దేశద్రోహులున్నారని సుప్రీంకోర్టు న్యాయవాది, సామాజికవేత్త మోనికా అరోరా పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో టీచర్లు, విద్యార్థుల్లో కొంతమంది భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. రామాయణంతో పాటు, దేశ స్వాతంత్య్ర సమరం గురించి తప్పుల తడకగా సిలబస్ రూపొందిస్తే, తాము చేసిన పోరాటం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో జెఎన్‌యులో భారత వ్యతిరేక శక్తులు విజృంభించాయని, ఇప్పుడు కూడా అదే ఒరవడిలో కార్యక్రమాలు కొనసాగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఎన్డీఎ ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ప్రస్తుతం మీడియా కూడా రెండుగా విడిపోయిందని, ఒక విభాగం దేశం కోసం పనిచేస్తుండగా, మరో విభాగం దేశవిచ్ఛిత్తికి ఊతమిస్తోందన్నారు. దేశద్రోహం, రాజద్రోహం అన్న పదాలను న్యాయపరంగా ఏ విధంగా నిర్వచించాలో కోర్టులు చూస్తాయన్నారు.
దళితులూ హిందువులేనని, తాను దళితుడిని అయినందుకు, హిందువు అయినందుకు గర్విస్తున్నానని సమరసత వేదిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ వంశతిలక్ పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు మాజీ మంత్రి సదాలక్ష్మి, నారాయణలు తనకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. అంబేద్కర్ గొప్పజాతీయవాదని, ఆయనను అడ్డుపెట్టుకుని కొందరు దళిత సమాజానికి మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దళితులు కాని వారికి దళితుల సమస్యలు అర్థం కావన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకున్న వారిలో దళితులే ప్రముఖంగా ఉన్నారన్నారు. విశ్వవిద్యాలయాల్లో ముద్దులపండగలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు.

జాతి చైతన్యానికి మరో దండియాత్ర

సిరివెనె్నల సీతారామ శాస్ర్తీ

హైదరాబాద్, ఏప్రిల్ 17: అన్యాయాన్ని గురించి ఆవేదన పడుతున్న సమయంలో మన మీద జరుగుతున్న యుద్ధాన్ని ఎదిరించే దండియాత్ర మాదిరి దేశం కోసం ...అంతా కదిలిరావాలని ప్రఖ్యాత కవి సిరివెనె్నల సీతారామా శాస్ర్తీ పేర్కొన్నారు. జాగృత భారత్ ఆదివారం రాత్రి తెలుగు లలిత కళాతోరణంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ జలియన్‌వాలాబాగ్‌లో మన వాళ్లను చంపడానికి మన వాళ్లనే బ్రిటిష్ వారు ఉపయోగించుకున్నారని, అలాంటి ప్రయత్నం నేడు కూడా జరుగుతోందని సిరివెనె్నల పేర్కొన్నారు. జాగృతాత్మలన్నీ నిద్రావస్థలో ఉన్న వారిని మేల్కొలపాలని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం అంటూ ఎన్ని మాటలు చెప్పుకుంటున్నా చివరికి భిన్నత్వమే కనిపిస్తోంది తప్ప ఏకత్వం కనిపించడం లేదని, ప్రస్తుత పరిస్థితులపై సీరియస్‌గా ఆలోచించాలని సూచించారు. ఇపుడు కావల్సింది ఆవేశం కాదని, ఆరాటం కావాలని, ఆర్తి కావాలని అన్నారు. అన్ని రంగాల్లో జాతీయ స్పృహను నిరూపించుకోవాలని చెప్పారు. జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ మార్పు అనేది అనివార్యమని, చావు కాలానికి చీమలకు సైతం రెక్కలు వస్తాయని చెప్పినట్టు కొన్ని వర్గాలకు రెక్కలు వస్తున్నాయని అది చావుకేనని అన్నారు. కార్యక్రమం చివరిలో ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడుతూ దేశం కోసం కార్యక్రమం బహిరంగ సభ ప్రారంభం మాత్రమేనని, ఇలాంటి సభలు జిల్లాల్లో జరగాల్సి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మేజర్ జనరల్ ఎ బి గోర్తి, దాసరి శ్రీనివాసులు, చామర్తి ఉమా మహేశ్వరరావు, ఆర్ ప్రభాకరరావు, కె అరవిందరావు, ఎస్‌ఆర్ తివారి, ఎస్ ఆర్ రామానుజం, ప్రొఫెసర్ టి తిరుపతిరావు, ప్రొఫెసర్ బి సత్యనారాయణ, డాక్టర్ వంశ తిలక్, సామాజిక కార్యకర్త సోమరాజు సుశీల పాల్గొన్నారు.