రాష్ట్రీయం

ఏపీ రాజధానిలో సం‘కుల’ సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 31: రాజధాని అమరావతిలో సం‘కుల’ సమరం సాగుతోంది. మొదట్లో తుళ్లూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన అనంతరం రాజధాని వికేంద్రీకరణకు నిర్ణయించింది. రాజధాని ఏ వర్గానికో, ఏ ప్రాంతానికో పరిమితం కారాదని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో పాటు టీడీపీలో బలమైన వర్గం నేతలు రాజధాని ప్రాంతంలో పెద్దఎత్తున భూములు కొనుగోలు చేయటంతో వైకాపా వర్గ పోరును తెరపైకి తెచ్చింది. రాజధాని విషయాన్ని టీడీపీ ప్రభుత్వం గతంలో అనేక మలుపులు తిప్పి తుళ్లూరుకు మార్చిందని వైకాపా వారు ఆరోపిస్తున్నారు. ముందుగా దొనకొండ ప్రాంతాన్ని పరిశీలించిందని దీన్ని నమ్ముకున్న ఆ ప్రాంత ప్రజలు, వ్యాపారులు తరువాత తుళ్లూరును నిర్ణయించటంతో తీవ్రంగా నష్టపోయారని చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్పు అనివార్యమనే ప్రచారం జరుగుతోంది. అయితే పాలనా వ్యవస్థను ఇక్కడే ఉంచి ఇతర కార్యాలయాలను మరోచోటకు తరలిస్తారా లేక రాజధాని మారుస్తారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమరావతికి వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, రైతు కూలీలు కూడా రాజధానిని నమ్ముకుని జీవిస్తున్న నేపథ్యంలో తరలించరాదని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తుళ్లూరు మండలంలో రాజధాని ప్రాంతంలో ఓ వర్గం ఆధిపత్యం చలాయిస్తోందని అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కమ్మ వర్గాన్ని టార్గెట్‌గా చేసిన నేతలు రాజధానిపై కూడా అదే రకమైన వాదనలు తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళగిరి, దొనకొండ, రాయలసీమ, విశాఖ ప్రాంతాలకు రాజధానిని విస్తృతం చేయటం ద్వారా రెడ్డి, కాపు, ఇతర కులాలకు మేలు జరుగుతుందని వైకాపా నేతలు వాదిస్తున్నారు. రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ కుల వాదాన్ని ముందుకు తీసుకురావటంతో పాటు తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. రాజధానిపై ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా ఈ ప్రాంతంలో పర్యటించిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ బొత్సకు కౌంటర్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో మొత్తం 19 కులాలు ఉన్నాయని, బీసీ, దళిత, మైనారిటీ వర్గాలు కూడా నివసిస్తున్నారని కులం రంగు పులమటం సమంజసం కాదని ఖండించారు. మరోవైపు కాపు వర్గానికే చెందిన మరోనేత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం రాజధాని ప్రాంతంలో పర్యటించి తరలించే యోచన మానుకోవాలని డిమాండ్ చేశారు.
రాజధానిని తరలిస్తామంటే సహించేదిలేదని స్పష్టం చేశారు. మరోవైపు రెడ్డివర్గం ప్రయోజనాలకే రాజధానిని తరలించాలనే యోచనతో ఉన్నారని, దొనకొండ వద్ద వైకాపా నేతలు పెద్దఎత్తున గతంలో భూములు కొనుగోలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరిలో కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వైకాపా నేతలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ధిలో భాగంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. మంత్రి బొత్స, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇతర వైకాపా నేతలు చేస్తున్న విమర్శలపై పవన్‌కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్యాకేజీల కోసమే పవన్ రాజధానికి మద్దతిస్తున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తుంటే నోరు అదుపులో పెట్టుకోవాలని పవన్ హెచ్చరిస్తున్నారు. దీంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇలాఉంటే కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరితో కలసి రాజధాని ప్రాంతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటించటంతో పాటు రాజధాని తరలిస్తే ఉపేక్షించేదిలేదని ప్రభుత్వానికి సంకేతాలు పంపారు.
అయితే రాజధానిపై బీజేపీలో భిన్న స్వరాలు వినవస్తున్నాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో కన్నా నివాసంలో ఓ వర్గం, పార్టీ కార్యాలయంలో మరోవర్గం సమావేశాలు నిర్వహించారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేత టీజీ వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. దీంతో బీజేపీలోనే రాజధానిపై భిన్నస్వరాలు వినవస్తున్నాయి. మొత్తంగా రాజధాని చుట్టూ రాజకీయం పరిభ్రమిస్తోంది. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.