రాష్ట్రీయం

యాదాద్రి ఆలయ స్తంభాలపై వివాదాస్పద శిలా చిత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 6: యాదాద్రి ప్రధానాలయం పునర్నిర్మాణంలోని అష్ట్భుజ ప్రాకార మండప రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రం, టీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తు, కేసీఆర్ కిట్ పథకం చిహ్నం, హరితహారం చిహ్నాలు, జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ చిత్రపటాలు, అలాగే ముస్లిం సంస్కృతిలో భాగమైన పీర్లను, చార్మినార్‌ను కూడా చెక్కడం వివాదాస్పదమైంది. ప్రధానాలయం పునర్నిర్మాణ పనుల్లో రాజకీయ పార్టీల గుర్తులు, నాయకుల చిత్రాలు చెక్కడం ద్వారా ఆలయాల సంస్కృతిని సీఎం కేసీఆర్ అపహాస్యం చేశారంటూ బీజేపీ, వీహెచ్‌పీ నిరసనలకు దిగాయి. ఆలయాల్లో నిర్మాణ కాలానికి ఉండే చరిత్ర, సంస్కృతి, సామాజిక జీవన స్థితిగతులు పురాణ ఇతిహాస ఘట్టాలు చెక్కడం వరకు రాజుల కాలం నుంచి కొనసాగుతోంది. అయితే అందుకు విరుద్ధంగా పాలకుల, నాయకుల బొమ్మలను, ఇతర మతాల చిహ్నాలను, ఎన్నికల గుర్తులను చెక్కడం ఇప్పుడు యాదాద్రిలో వివాదాస్పదంగా మారింది. యాదాద్రి ప్రధానాలయం ప్రాకార మండపాలపై తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రజల జీవన రీతులను చెక్కాలని గతంలో సీఎం కేసీఆర్ సూచించారు. అంతవరకు బాగానే ఉన్నా శిల్పులు మాత్రం కేసీఆర్ బొమ్మను, కారు గుర్తును, మహాత్మాగాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ చిత్రాలను రాతి స్తంభాలపై చెక్కడం ద్వారా ఆలయ సంస్కృతిని అడ్డదారులు తొక్కించారంటూ హిందూ సంస్థలు, ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. ఈ పరిణామాలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ తక్షణం వాటిని తొలగించేలా ఆదేశించాలని, లేదంటే తామే వెళ్లి వాటిని తొలగిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. ప్రజాధనంతో కడుతున్న గుడి నిర్మాణంలో రాజకీయ చిత్రాలు చెక్కించి సీఎం కేసీఆర్ హిందూ ఆలయ సంస్కృతిని అగౌరవపరిచారని విమర్శించారు. శనివారం తాను యాదాద్రి ప్రధానాలయం సందర్శిస్తానని రాజాసింగ్ ప్రకటించారు. ఈ పరిణామాలతో యాదాద్రి ఆలయం వద్ద పోలీస్ బందోబస్తు భారీగా పెంచారు. అటు ఆలేరు నియోజకవర్గం బీజేపీ విభాగం నేత బండ్రు శోభారాణి పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం కొండపైకి చేరుకుని ప్రధానాలయం పరిశీలనకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోగా కొండపై బైఠాయించి నిరసన తెలిపారు. అటు ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ కార్యకర్తలు సైతం కొండపై నిరసనకు దిగారు. ఆలయంలోకి వారిని అనుమతించకుండా రాచకొండ డీసీపీ ఆధ్వర్యంలోని పోలీస్ బలగాలు అడ్డుకోవడంతో ఆలయ గోపురాలపైకి ఎక్కి నిరసనకు దిగగా ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వారందరినీ అక్కడి నుండి పంపించే క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బండ్రు శోభారాణి మాట్లాడుతు భక్తుల మనోభావాలను, ఆలయ సంస్కృతిని దెబ్బతీసేలా ప్రధానాలయం ప్రాకార స్తంభాలపై చెక్కిన కేసీఆర్, కారు గుర్తు, ప్రభుత్వ పథకాల చిత్రాలను, మాజీ ప్రధానుల చిత్రాలను, అన్యమత చిహ్నాలను, అభ్యంతర చిత్ర శిల్పాలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళన ఉద్ధతం చేస్తామని హెచ్చరించారు.