రాష్ట్రీయం

కన్యాశుల్కం ఓ అద్భుత కావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 21: మహాకవి గురజాడ అప్పారావు రాసిన ‘కన్యాశుల్కం’ ఓ అద్భుత కావ్యమని ప్రముఖ సాహితీవేత్త, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. తాను ఇప్పటి వరకు గురజాడ రాసిన మాదిరి సాహిత్యాన్ని ఇంకెక్కడ చూడలేదన్నారు.కన్యాశుల్కాన్ని మించిన శైలిలో ఏ ఒక్కరూ రచనలు చేయలేకపోవడమే ఆ మహాకవి ప్రజ్ఞకు, మేథాసంపత్తికి తార్కాణమని అన్నారు. శనివారం పట్టణంలోని గురజాడ అప్పారావు 157వ జయంతిని తొలిసారిగా ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించారు. ముందుగా ఆయన స్వగృహంలో గురజాడ చిత్రపటానికి నివాళులర్పించి గురజాడ జయంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం సత్యలాడ్జి వద్ద గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత స్ధానిక ఆనందగజపతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి ప్రధానవక్తగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, విశిష్ట అతిథిగా పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జొన్నవిత్తుల మాట్లాడుతూ ఆయన రాసిన కన్యాశుల్కం నాటకం ద్వారా ఆనాటి సామాజిక దురాచారాలు, రుగ్మతలను ఎండగడుతూ కన్యాశుల్కం నాటకం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారన్నారు. కన్యాశుల్కం నాటకం కరుణారసం అయినప్పటికీ అందులో ప్రతి సన్నివేశంలోను హాస్యం స్ఫురించేలా రచన సాగించారని కొనియాడారు. పాశ్చాత్యుల సంస్కృతి, సంప్రదాయాలు తెలుగు భాషపై ఏవిధంగా ఉంటాయో వందేళ్ల క్రితమే తన రచనల ద్వారా కళ్లకు కట్టినట్టు గురజాడ రచనలు చేశారన్నారు. కన్యాశుల్కంలో మూడేళ్ల ముక్కుపచ్చలారని చిన్నారికి ముదుసలితో పెళ్లిచేస్తే పదేళ్లకే ఆ బాలిక వితంతువుగా మారడం, జీవితం భయానకంగా మారడం వంటి సన్నివేశాలు ఆనాటి సాంఘీక వ్యవస్ధకు అద్దం పడుతున్నాయన్నారు. శృంగారం కోసం మధురవాణి పాత్రను సృష్టించడం, పూటకూళ్లమ్మ వితంతువు కాదని గిరీశం ద్వారా చెప్పించడాని వివరించారు. పెళ్లి జరగకపోవడంతో పిల్ల తండ్రి తానిచ్చిన శుల్కం తిరిగి వెనక్కి ఇచ్చేయమని వారసుల మీద దావా వేస్తే పురోహితుడు లంచం తీసుకొని అబద్ధం సాక్షి చెప్పడం చూస్తుంటే ఆనాటి సంఘంలో ఎలాంటి పరిస్ధితులు ఉండేవో అద్ధం పడుతుందన్నారు. ఆయన రాసిన ‘సత్యం వ్రతి శతకం’ వంద పద్యాలలో 25 మాత్రమే అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఆయన రాసిన శతకం పద్యాలను పరిశీలిస్తే వాటిలో సత్యనిష్ట ఎక్కువగా గోచరిస్తుందన్నారు. గురజాడ రచనలను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ఆధునిక కవులు ఆయన అడుగుజాడల్లో నడవగలిగారన్నారు. శ్రీశ్రీ, ఆరుద్ర, దేవుపల్లి కృష్ణశాస్ర్తీతోపాటు ముళ్లపూడి వెంకటరమణ, ఆత్రేయ, వేటూరి వంటి ఎందరో రచనల్లో గురజాడ ప్రభావం కన్పించిందన్నారు. తెలుగుసాహిత్యానికి, అభ్యుదయ కవిత్వానికి పునాదులు, మూలాలు గురజాడ రచనల్లో కన్పిస్తున్నాయన్నారు. మహాత్మాగాంధీ ప్రభావం లేకుండా స్వాతంత్య్ర సమరాన్ని ఎలా చూడలేమో, అలాగే గురజాడ ప్రభావం లేకుండా ఆధునిక నాటకం, సాహిత్యాన్ని విడదీయలేమన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న అధికార భాషా సంఘం అధ్యక్షులు, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గురజాడ పేరిట విశ్వవిద్యాలయాన్ని ప్రకటించినప్పటికీ దానిపై జీవో రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష ప్రాచీన కేంద్రాన్ని ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు ప్రోత్సాహంతో కర్ణాటక నుంచి ఇటీవల నెల్లూరుకు తీసుకువచ్చామని వివరించారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆలయ పాలక మండళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలకు సముచిత స్ధానం కల్పించడం వల్ల సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి కలెక్టర్ హరి జవహర్‌లాల్ అధ్యక్షత వహించగా, వ్యాఖ్యాతగా డాక్టర్ ఎ.గోపాలరావు వ్యవహరించారు. ఏపీ సృజనాత్మకత, సంస్కృతి సమితి సీఈవో ఎ.లక్ష్మికుమారి, ఎస్పీ రాజకుమారి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, గురజాడ మనుమడు ప్రసాద్, మనుమరాలు ఇందిర, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రముఖ సాహితీవేత్త, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల