రాష్ట్రీయం

సిఎం ‘సెక్యూరిటీ’కి నరకయాతన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత కోసం నియమితులైన పోలీస్ సిబ్బంది విజయవాడలో నరకయాతన అనుభవిస్తున్నారు. సిఎం బసను విజయవాడకు మార్చిన తరువాత భద్రతకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది నియామకం జరగకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విజయవాడలో పోలీసు విధులంటే భయపడే స్థితికి సిబ్బంది వచ్చేశారంటే పరిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగిన చంద్రబాబుకు భద్రత కల్పించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆయన బయటకు వచ్చారంటే బ్లాక్ కమాండోల దగ్గర నుంచి చిన్నపాటి కానిస్టేబుల్ వరకూ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇంత భద్రతకు కావల్సిన సిబ్బందిని ప్రభుత్వం నియమించలేదు. సిఎం భద్రత కోసం విజయవాడ నగర పోలీసులతో పాటు రోజుకు 494 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది పనిచేయాల్సి వస్తోంది.
విజయవాడ కనకదుర్గమ్మ బ్యారేజ్‌ను ఆనుకుని ఉన్న ఉండవల్లి కరకట్టను ఆనుకుని సిఎం నివాసం ఉంది. ఆ రోడ్డుపై భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సిఎం నివాస భద్రతకే పెద్దఎత్తున పోలీసులను వినియోగించాల్సి వస్తోంది. సిఎం క్యాంపు కార్యాలయం ప్రధాన ద్వారం వద్దే ముగ్గురు ఎస్పీ క్యాడర్ అధికారులు పహరా కాస్తున్నారు. వీరికింద డిఎస్పీలు, ఎఎస్పీలు, కానిస్టేబుళ్లు ఎంతమంది పనిచేయాల్సి ఉంటుందో ఊహించుకోవచ్చు. దీంతోపాటు సిఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాల్లో ముమ్మర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో సిఎం ప్రయాణించే రహదారి వెంట, ఆయనతో పాటు సెక్యూరిటీగా వెళ్లడానికి పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాల్సి వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిఎం భద్రత కోసం తొలిదశలో కనీసం 583 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది కావాలని పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వీరితో విజయవాడలో ప్రత్యేకంగా సిటీ సెక్యూరిటీ వింగ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకోసం రూ. 110 కోట్ల బడ్జెట్ కేటాయించింది. దీంతో సిటీ సెక్యూరిటీ ఆఫీస్, అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే సిబ్బందిని పెంచుకోవాలన్న ఆలోచన కూడా ఉంది. విజయవాడ కమిషనరేట్‌తో సంబంధం లేకుండా ఈ సిటీ సెక్యూరిటీ వింగ్ పనిచేయనుంది. ప్రస్తుతం కొత్త రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో ఏలూరు, గుంటూరు రేంజ్‌ల నుంచి పోలీస్ సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకొస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది మొత్తం 494 మంది వివిధచోట్ల, వివిధ స్థాయిల్లో పనిచేయాల్సి వస్తోంది. కానిస్టేబుళ్ళయితే 15 నుంచి నెల రోజులు డిప్యుటేషన్‌పై ఉండిపోవలసి వస్తోంది. అదే ఎస్పీ, డిఎస్పీ క్యాడర్ అధికారులు 15 రోజుల డిప్యుటేషన్‌పై వస్తున్నారు. సిఎం క్యాంపు కార్యాలయం బయట ఇద్దరు ఎస్పీ ర్యాంక్ అధికారులు చాలాకాలంగా పనిచేస్తున్నారు. బెటాలియన్ కమాండెంట్ స్థాయి అధికారులైన వీరిని సిఎం గేటు వద్ద బందోబస్తుకు నియమించడం పట్ల చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీస సౌకర్యాలు కరవు!
డిప్యుటేషన్‌పై వస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఇక్కడ కనీస వసతులు కల్పించలేకపోయింది. పగలంతా మండుటెండలో పనిచేస్తున్న ఈ సిబ్బందికి రాత్రి తలదాచుకునేందుకు సరైన చోటు లేదు. సిఎం క్యాంపు కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద పోలీస్ అధికారులు నిలబడడానికి కనీసం నిలువ నీడ కూడా లేదు. వీరి బాధ చూడలేక స్థానిక కార్పొరేటర్ వీరికి కొన్ని గొడుగులు కొనిచ్చారు. అప్పుడప్పుడు ఆ గొడుగుల కిందే తలదాచుకోవలసి వస్తోంది. సౌకర్యాలు లేకుండా ఎంతకాలం పనిచేయాలని డిప్యుటేషన్‌పై వచ్చిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కానిస్టేబుల్‌కు రోజుకు సుమారు రూ. 194 డిఎ ఇస్తున్నారు. భోజన సదుపాయాన్ని పోలీస్ శాఖ కల్పిస్తోంది. రాత్రివేళల్లో కానిస్టేబుళ్లు ఆర్టీసీ బస్టాండ్‌లోని డార్మెటరీలో రోజుకు రూ. వంద చెల్లించి నిద్రించాల్సి వస్తోంది.
నగర పోలీసులపై ఒత్తిడి
ఇదిలావుంటే, విజయవాడ నగర పోలీసులపై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. రోజుకు నగరంలో సిఎం సహా కనీసం 50 నుంచి 100 మంది విఐపిలు, వివిఐపిలు వస్తూ, పోతున్నారు. వీరికి భద్రత, బందోబస్తు కల్పించడానికి నగరంలోని పోలీస్ స్టేషన్ల నుంచి సిబ్బందిని వినియోగించాల్సి వస్తోంది. దీనివల్ల ఆయా స్టేషన్లలో కేసుల పరిష్కారానికి అవరోధం ఏర్పడుతోంది. సిటీ సెక్యూరిటీ వింగ్ వచ్చేవరకూ పోలీస్ కమిషనరేట్‌పై ఈ భారం తప్పేట్టులేదు. సిటీ సెక్యూరిటీ వింగ్ పూర్తి స్థాయిలో రావడానికి కనీసం సంవత్సరం పడుతుందని తెలుస్తోంది.

చిత్రం విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు నిలవడానికి నీడ లేని దుస్థితి