రాష్ట్రీయం

ఉద్రిక్తంగా ఖమ్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 13: ఆర్టీసీ కార్మికుల సమ్మె డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతితో మరింత ఉద్రిక్తంగా మారింది. శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన ఖమ్మం ఆర్టీసీ డిపో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆదివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఆర్టీసీ కార్మికులతో పాటు ఆయా రాజకీయ పార్టీలు, సంఘాల నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. దీనితో ఖమ్మం ఉద్రిక్తంగా మారింది. శ్రీనివాసరెడ్డి మృతదేహం ఖమ్మంకు చేరగానే ఆయన సహచరులు ఘొల్లుమన్నారు. రోధిస్తూ ఆయన త్యాగాన్ని వృధాకానీయమంటూ నినాదాలు చేశారు. కార్మికులతోపాటు రాజకీయ పార్టీల నేతలు భారీగా తరలిరావడంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా సమ్మెలో భాగంగా ఆదివారం వేకువఝామునుండే ఆర్టీసీ బస్సులను బయటకు వెళ్ళకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవడంతో బస్‌డిపో నుండి బస్సులు బయటకు వెళ్ళలేదు. ఆదివారం సాయంత్రానికి శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభ పక్షనేత మల్లు భట్టివిక్రమార్క, అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, భాగం హేమంతరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఆయా పార్టీల నాయకులు నివాళులర్పించి మాట్లాడుతూ ఆత్మబలిదానం చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి త్యాగం వృధాకాకుండా సమరశీల పోరాటాల ద్వారా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు ఉద్యమించడమే నివాళి అన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల కనీసం స్పందించకుండా నిర్భంధ ధోరణి అవలంబించడం సరైందికాదన్నారు. ఇలా ఉండగా శ్రీనివాసరెడ్డి మృతదేహం ఖమ్మం చేరుకున్న సమయంలో కార్మికులంతా ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుని, ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తమ సహచరుడి త్యాగాన్ని వృధా కానియ్యకుండా పోరాటబాట పడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం మొండివైఖరి వీడేవరకు ఉద్యమం కొనసాగిస్తామని పేర్గొన్నారు. అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగృహం రాపర్తినగర్‌కు తీసుకువెళ్ళారు. సోమవారం అంత్యక్రియలు జరపనున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకులతో పాటు ఆయా రాజకీయ పార్టీల ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జిల్లాలో హై అలర్ట్‌ను తలపించింది. నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిలిచిన ఖమ్మం జిల్లా నేడు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో మరో పోరాటానికి స్ఫూర్తిగా నిలువనుంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు అన్ని పార్టీలు, వాటి అనుబంధ, యువజన, కార్మిక, విద్యార్ధి సంఘాలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతు లభించింది. ఆర్టీసీ జెఏసీ ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, టిడిపి ఎంఎల్‌ఏ మెచ్చా నాగేశ్వరరావు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన జిల్లా బంద్‌కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్నారు. నాటి తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడి పోరాటానికే వనె్నతెచ్చిన ఆర్టీసీ కార్మికులు నేడు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే వారిని నీచంగా, వారిపట్ల వ్యంగ్యంగా వ్యవహరించడం కేసీఆర్ దొరతనానికి నిదర్శనమన్నారు. తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారు చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిపిస్తామని హెచ్చరించారు.

*ఖమ్మం ఆర్టీసీ డిపో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి (ఫైల్‌ఫొటో )