రాష్ట్రీయం

వైభవంగా శబరి స్మృతియాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, అక్టోబర్ 13: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన శబరి స్మృతియాత్ర వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో కోలాటాలు.. రేలా నృత్యాలతో గిరిజనులు రాములోరి చెంత ఉత్సవం జరిపారు. అపర భక్తురాలైన శబరి వంశస్తులుగా.. సంప్రదాయబద్ధంగా తీరొక్క పూలు, పండ్లు సమర్పించి భక్తితో కొలిచారు. కొండాకోనల నుంచి పిల్లాపాపలతో కదిలొచ్చి.. దక్షిణ అయోధ్యలో మేళతాళాల నడుమ ఊరేగింపు తీసి తరించారు. శ్రీరామచంద్రుడిని దర్శించి.. నిత్యకల్యాణాన్ని కనులారా తిలకించి పులకించిపోయారు. పూర్వకాలంలో రామలక్ష్మణులకు సపర్యలు చేసిన శబరి స్మృత్యర్థం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులు 7వ సారి స్మృతి యాత్ర నిర్వహించారు. ఆద్యంతం కన్నుల పండువగా ఈ వేడుక జరిగింది. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ ఉత్సవంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన గిరిజనులు వైకుంఠ రామునికి భక్తిపారవశ్యంతో పూజలు చేశారు. సంప్రదాయ కొమ్ము, కోయ నృత్యాలు చేస్తూ స్వామివారి ముందు మూడుసార్లు గిరి ప్రదక్షిణ చేశారు. తొలుత శబరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ధ్వజస్తంభం వద్ద ఉన్న బలిపీఠాన్ని గిరిజన మహిళలు పసుపు, కుంకుమలు చల్లి ముగ్గులు వేసి అలంకరించారు. వివిధ రకాల పండ్లు, పుష్పాలను గిరిజనులు తీసుకురాగా దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మరికొన్ని పండ్లు, పుష్పాలు సమకూర్చారు. శబరి నది నుంచి కలశాల్లో జలాలు తీసుకొచ్చి మేళతాళాలు, వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ ప్రదక్షిణ జరిపారు. అనంతరం మహిళలు వాటిని చిత్రకూట మంటపానికి తీసుకొచ్చి స్వామివారికి పుష్పార్చన చేశారు. వివిధ రకాల పుష్పాలు, ఫలాలను భక్తశబరి, రామలక్ష్మణులకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామికి భక్తరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించారు. ‘శ్రీరామ సంపుటి’ గావించారు. ధూప, దీప నైవేద్యాలను సమర్పించిన అనంతరం గిరిజనుల సమక్షంలోనే చిత్రకూట మంటపంలో స్వామివారికి నిత్యకల్యాణ వేడుకను ఘనంగా జరిపారు. అంతకుముందు వాల్మీకి జయంతిని పురస్కరించుకొని విగ్రహం వద్ద విశ్వక్సేనపూజ, పుణ్యాహావచనం చేసి రామాయణ గ్రంథాన్ని షోడశోపచారాలలతో పూజించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో తాళ్ళూరి రమేష్‌బాబు తదితరులు గిరిజనులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.
*చిత్రాలు.. భక్త శబరి చిత్రపటంతో ప్రదక్షిణ చేస్తున్న గిరిజనులు

*భద్రాద్రి రామయ్య సన్నిధిలో కొమ్ము డ్యాన్సు చేస్తున్న గిరిజనులు