రాష్ట్రీయం

ఒడ్డుకు చేరిన గ్రిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 17: ఆశలు చిగురిస్తున్నాయి..బోటు వెలికితీత ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిన పర్యాటక బోటును వెలికితీయడానికి ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బుధవారం లంగరుకు చిక్కినట్టే చిక్కి జారిపోయిన నేపథ్యంలో గురువారం మరింత పగడ్బందీ ఏర్పాట్లుచేశారు. దీనితో బోటు లంగరుకు చిక్కింది. అయితే లాగే ప్రయత్నంలో బోటు టాపు పైన ఉండే ఇనుప గ్రిల్ ముక్క బయటపడింది. దీన్నిబట్టి బోటు ఇక్కడే ఉందనే విషయం ఖరారయ్యింది. నదిలో 150 మీటర్ల లోతులో ఇసుకలో కూరుకు పోయిన స్థితిలో బోటు ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం మూడు లంగర్లు వేసి గాలిస్తున్నారు. గజ ఈతగాళ్లను పంపి లంగరు వేయిస్తే ఫలితం ఉంటుందనే విధానంలో ప్రయత్నిస్తున్నారు. ఆక్సిజన్ మాస్క్‌లతో నదిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో భారీ లంగరుతో పాటు మూడు వేల అడుగుల ఇనుప తాడును, వెయ్యి మీటర్ల నైలాన్ తాడును కూడా ఇందు కోసం వాడుతున్నారు. అఖండ గోదావరి నది ఎడమ గట్టువైపు తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం గిరిజన ప్రాంతం కచ్చులూరు ఆదివాసీ గ్రామం వద్ద రాయల్ వశిష్ఠ పున్నమి ప్రైవేటు టూరిజం బోటు సిబ్బందితో కలిపి 77 మందితో ప్రయాణిస్తుండగా బోల్తాపడి గురువారం నాటికి సరిగ్గా 33 రోజులైంది. పది రోజుల క్రితం గోదావరి నది ఉద్ధృతి అధికంగా ఉండటంతోనూ, బోటు బోల్తాపడిన కచ్చులూరు వర్షాలు పడుతుండటం తదితర ప్రతికూల పరిస్థితుల వల్ల మూడు రోజుల పాటు బోటు వెలికితీత పనులు చేసిన అనంతరం అధికారుల ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాయిదా వేశారు. అనంతరం 16వ తేదీ నుంచి బోటు వెలికితీతకు మళ్ళీ రంగంలోకి దిగారు. రెండో ప్రయత్నంలో బోటు ఎక్కడ ఉందనే విషయాన్ని గుర్తించగలిగారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సుమారు 100 మీటర్ల దిగువన అంటే మరింత పల్లంలోని మంటూరు దిశగా మూలగా బోటు ఉన్నట్టుగా గుర్తించారు. గురువారం ఉదయం కొక్కెం బలంగా తగిలినట్టు గుర్తించారు. అయితే మెరైన్ అధికారుల పర్యవేక్షణలో వెలికితీత పనులు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో గురువారం ఉదయం నుంచి లంగర్లు వేసి తాడును బలంగా పట్టుకుని మెరైన్ అధికారులు బృందం కోసం ఎదురుచూశారు. కాకినాడ నుండి పోర్టు అధికారితో పాటు కొందరు రావడంతో ధర్మాడ సత్యం బృందం వ్యూహం ప్రకారం వలయాకారంలో వేసి లంగర్ల ద్వారా బయటకు లాగేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ సందర్భంగానే బోటు పైభాగంలో ఉండే ఇనుప గ్రిల్ కొంత భాగం బయటపడింది. వీలైతే మరో 48 గంటల్లో బోటును వెలికితీసే అవకాశముందని భావిస్తున్నారు.
మరోవైపు గల్లంతైన వారిలో ఇంకా 12 మంది జాడ తెలియాల్సివుంది. బుధవారం కచ్చులూరు ప్రాంతంలోనే ఒక మృతదేహం లభించడంతో గల్లంతైన జాబితాలోని బంధువులకు అధికారులు సమాచారాన్ని తెలియజేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం వరంగల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించడంతో వారి కుటుంబానికి అప్పగించారు. దీంతో ఇంకా 12 మంది ఆచూకీ తెలియాల్సివుంది. ప్రస్తుతం బోటు ఎక్కడుందో గుర్తించడంతో గల్లంతైన తమ వారి ఆచూకీ కూడా లభిస్తుందని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం బోటు ప్రమాద స్ధలంలో గోదావరి నీటి మట్టం చాలా తగ్గు ముఖంలో వుంది. ప్రమాదం జరిగిన రోజు అంటే సెప్టెంబర్ 15న కచ్చులూరుకు అతి సమీపంలోని పోలవరం వద్ద ఉదయం ఆరు గంటలకు 10.80 మీటర్ల వరద నీటి ప్రవాహ మట్టంలో గోదావరి ప్రవాహం కొనసాగింది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద 10.70 అడుగుల మట్టంలో కేవలం 96వేల 862 క్యూసెక్కులు మాత్రమే సముద్రంలోకి వెళ్తున్నాయి. కచ్చులూరుకు సమీపంలోని పోలవరం వద్ద కేవలం 5.49 మీటర్ల మట్టం నమోదైంది. గురువారం 7.56 మీటర్లకు పడిపోయింది. అంటే గోదావరి ఉద్ధృతి దాదాపు పూర్తిగా నీరసించిపోయింది. దాదాపు 10 మీటర్ల మట్టం తగ్గిపోయింది. కొయిదా, కచ్చులూరు వద్ద భౌగోళిక పరిస్థితులు ఒకేలా వుంటాయి. ఈ రెండు ప్రాంతాల వద్ద గోదావరి వెడల్పు తక్కువ, లోతు ఎక్కువగా వుంటుంది. ప్రధానంగా మన్యంలో కురిసిన వర్షాల స్థాయి కొయిదా వద్ద మట్టాన్ని బట్టి అంచనావేస్తారు. కొయిదా వద్ద ఎగువ కుంట నుంచి వచ్చే ప్రవాహ ప్రభావం, ఉపనది శబరి వరద ఉద్ధృతి ప్రభావం, భద్రాచలం వరద ప్రవాహ ప్రవాహం ఇక్కడే కలుస్తాయి. అందుచేత లోతు అధికంగా వున్న కచ్చులూరు ప్రాంతంలో గోదావరి వరద ఉద్ధృతి మహోగ్రంగా రెండు కొండల మధ్య మలుపులో సుడులు తిరుగుతుంటుంది. అటువంటి ప్రదేశంలో జరిగిన ప్రమాదంలో బోటు చిక్కుకుంది. అయితే ప్రస్తుతం గోదావరి నదిలో వరద నీటి ప్రభావం లేదు. ఇదే అనువైన సమయంగా బోటు వెలికి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేపట్టారు.
*చిత్రం...భారీ లంగరుకు తగిలిన బోటు పైభాగంలోని గ్రిల్‌ను బయటకు తీస్తున్న ధర్మాడ సత్యం బృందం