రాష్ట్రీయం

విశిష్ట వ్యక్తిత్వం ఉన్న గొప్ప మేధావి రాఘవాచారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: గొప్ప మానవతావాది, విశిష్ట వ్యక్తిత్వం ఉన్న కమ్యూనిస్టు మేధావి సీ రాఘవాచారి అని పలువురు వక్తలు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రముఖ పాత్రికేయుడు సీ రాఘవాచారి సంస్మరణ సభ మఖ్దూం భవన్‌లో జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని రాఘవాచారికి నివాళులు అర్పించారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి , జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, ప్రజాపక్షం సంపాదకుడు కే శ్రీనివాసరెడ్డి, ఏపీ జాతీయ మీడియా సలహాదారుడు దేవులపల్లి అమర్, నవతెలంగాణ ఎడిటర్ ఎస్ వీరయ్య, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యదర్శి కే ప్రతాప్‌రెడ్డి, సీపీఐఎంఎల్ సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ప్రముఖ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టు సీహెచ్ రాజేశ్వరరావు, తెల్కపల్లి రవి, ఎఐబీఈఏ నాయకుడు రాంబాబు, రాఘవాచారి సతీమణి జ్యోత్న్స, కుమార్తె డాక్టర్ అనుపమ తదితరులు పాల్గొని రాఘవాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు రాఘవాచారితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు జరిగిన నిజాం వ్యతిరేక పోరాటానికి వరంగల్‌లో రాఘవాచారి కుటుంబం పూర్తి సహాయ సహకారాలు అందించిందని సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అనేక ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు కుటుంబం నుండి వచ్చిన రాఘవాచారి అన్ని బంధనాలు తెంచుకుని సంపూర్ణ కమ్యూనిస్టుగా పరివర్తన పొందారని, గొప్ప మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఆయన సంపాదకీయాలు లోతైన విశే్లషణలతో కూడి ఉండేవని చెప్పారు. కే నారాయణ మాట్లాడుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప వ్యక్తి రాఘవాచారి అన్నారు. కే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు, అవాంతరరాలు వచ్చినా ప్రజల పక్షాన నిలబడి సంపాదకీయాలు రాసేవారని అన్నారు. వీరయ్య మాట్లాడుతూ కొత్తతరం రాఘవాచారిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ఎన్నో అవకాశాలు వచ్చినా, విశాలాంధ్ర పత్రిక సంపాదకుడిగానే పనిచేస్తూ కమ్యూనిస్టుగానే ఉండిపోయారని అన్నారు. తెల్కపల్లి రవి మాట్లాడుతూ రాఘవాచారి అందరి హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోతారని అన్నారు.
కమ్యూనిస్టు కనుకనే గుర్తింపు
చాలా మంది రాఘవాచారి కమ్యూనిస్టు పత్రికలో కాకుండా ఏ ఇతర పత్రికలో పనిచేసినా బాగా గుర్తింపు వచ్చేదని, న్యాయవాద వృత్తిలో వెళ్లినా జడ్జి అయ్యేవారని అనేవారని రాఘవాచారి సతీమణి జ్యోత్న్స గుర్తుచేసుకున్నారు. వాస్తవానికి ఆయన కమ్యూనిస్టుగా ఉండి, విశాలాంధ్రలో పనిచేసినందునే ఇంత గుర్తింపు వచ్చిందని, అనేక మంది అభిమానాన్ని ఆయన చూరగొన్నారని అన్నారు. అంతకు ముందు ప్రజానాట్య మండలి కళాకారుడు పల్లె నర్సింహ బృందం పాటలతో జోహార్లు అర్పించారు.
*చిత్రం...సీ రాఘవాచారి సంస్మరణ సభలో నివాళులు అర్పిస్తున్న వామపక్ష, జర్నలిస్టు సంఘాల నేతలు