రాష్ట్రీయం

భక్త జనసంద్రం శ్రీగిరి క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, నవంబర్ 11: కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో సోమవారం రాత్రి లక్ష దీపోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ పుష్కరిణి వద్ద కార్తీక సోమవారాల్లో దేవస్థానం ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులను ఆశీనులను జేయించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పుష్కరిణికి దశ హారతులను సమర్పించారు. కాగా రెండో సోమవారం భక్తుల రద్దీతో క్షేత్రవీధులు నిండిపోయాయి. పవిత్ర పాతాళగంగలో వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. దీంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. సాయంత్రం నాగులకట్ట, గంగాధర మంటపం వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్‌లో వేచివుండే భక్తులకు పాలు, తాగునీరు, బిస్కట్లు, అల్పాహారంతో పాటు అన్నదాన మందిరంలో అన్నప్రసాద వితరణ, శివదీక్ష శిబిరాల వద్ద గల ఉద్యానవనంలో కార్తీక వనభోజనాలు ఏర్పాటుచేశారు. భక్తులందరికీ స్వామి అమ్మవార్ల దర్శనభాగ్యం కలిగేలా సోమవారం, మంగళవారం ఆర్జిత, అభిషేక, బ్రేక్ దర్శనాలను అధికారులు నిలిపివేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మంగళవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పుణ్యనది హారతి, జ్వాలాతోరణం, పుష్కరహారతి, లక్ష దీపార్చన నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

*చిత్రం...కార్తిక మాసం రెండో సోమవారం లక్ష దీపోత్సవంతో కాంతులీనుతున్న శ్రీశైల గిరులు...