రాష్ట్రీయం

సినీ రచయిత రామజోగయ్యకు గురజాడ విశిష్ట పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: ప్రముఖ సినీ గేయ రచయిత, సాహితీవేత్త రామజోగయ్యకు ఈనెల 30వతేదీన గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేయనున్నట్టు గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ వెల్లడించారు. బుధవారం గురజాడ గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీయేటా సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రముఖులకు గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేస్తున్నామని, ఇప్పటివరకు 18 మందికి ఈ పురస్కారాన్ని అందజేసినట్టు చెప్పారు. సినీ గేయ రచయిత రామజోగయ్యకు సాయి ఫౌండేషన్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్, ప్రధాన వక్తగా సినీనటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి పాల్గొంటారన్నారు. మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి రోజున ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆ రోజున మహాకవి గురజాడ ఉపయోగించిన కళ్లద్దాలు, ఇతర వస్తువులను తీసుకొని పట్టణంలో ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆనందగజపతి ఆడిటోరియంలో పురస్కార ప్రదానం ఉంటుందన్నారు. కాగా, ఇప్పటివరకు ఈ పురస్కారంతో ప్రముఖులు జెవి సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు, సి.నారాయణరెడ్డి, కె.విశ్వనాథ్, గుమ్మడి, షావుకారు జానకి, మల్లెమాల, అంజలిదేవి, రావికొండలరావు, యార్లగడ్డ లక్ష్మిప్రసాద్, గరికపాటి నరసింహారావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితరులను సత్కరించినట్టు గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు పివి నరసింహరాజు తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ సభ్యులు లక్ష్మణరావు, సూర్యలక్ష్మి, గురజాడ ఇందిర పాల్గొన్నారు.
*చిత్రం... ఆహ్వాన పత్రికను విడుదల చేస్తున్న గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు పీవీ నరసింహరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కే ప్రకాష్
*సినీ రచయిత రామజోగయ్య (ఇన్‌సెట్‌లో )