రాష్ట్రీయం

రాజకీయాలకు అతీతంగా ఉద్యమానికి మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: రాజకీయాలకు అతీతంగా, తెలుగు జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమించే వారికి మద్దతు పలకాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఒక రాజకీయ పార్టీగా మాతృ భాష విషయంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో మిగిలిన పార్టీలు కూడా ఆయనను అనుసరిస్తే భాషకు మహోపకారం చేసిన వారవుతారని అన్నారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ ప్రశాసన్‌నగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో కలిసి పవన్‌కళ్యాణ్‌ను కలిశారు. తెలుగు భాష పరిరక్షణకు చేపట్టిన మన నుడి-మన నది కార్యక్రమానికి మద్దతు పలికారు. తెలుగు భాషతో పాటు నదీ పరిరక్షణకు చేపట్టాల్సిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్ తెలుగు భాష పరిరక్షణకు నడుంకట్టిన సందర్భంగా తెలుగు భాషాభిమానిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని అన్నారు. తెలుగు భాష మనుగడకు ఉద్యమించాల్సిన పరిస్థితులను ప్రభుత్వం కల్పించిందని, ఈ సవాలును మనం ధీటుగా ఎదుర్కొని జాతిని మేల్కొలిపి, భాషను సంరక్షించుకుని జాతిని నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని అన్నారు. జొన్నవిత్తుల మాట్లాడుతూ పవన్‌తో భాషాభివృద్ధికి సంబంధించి అనేక విషయాలను చర్చించామని అన్నారు. బలమైన సంకల్పంతో తెలుగు భాష పరిరక్షణ, నదుల కాలుష్యాన్ని నివారించేందుకు కంకణం కట్టుకున్నారని, అన్నివర్గాల వారూ ప్రకృతి ప్రేమికలు, భాషాప్రేమికులు, పండితులు, కవులు కలిసి రావాలని అన్నారు. ఆంగ్లమాద్యమంలో జాతి కొట్టుకుపోకుండా తెలుగు భాషతో పాటు ఆంగ్ల భాషను మన విద్యార్థులకు ఎలా అందించాలి? మన తెలుగు సంస్కృతిని సంప్రదాయాలను నిలుపుకోవడం ఎలా అనేది చర్చించామని చెప్పారు.
*చిత్రం...హైదరాబాద్‌లో శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, సినీ రచయిత జొన్నవిత్తుల