రాష్ట్రీయం

పెల్లుబికిన ప్రజాగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్/హైదరాబాద్, నవంబర్ 30: ప్రజాస్వామ్యాన్ని అపహస్యంపాలు చేస్తూ..సభ్య సమాజం తలదించుకునేలా..మానవత్వం మరిచి వెటర్నరీ డాక్టరు ప్రియాంకరెడ్డిపై అత్యాచారం, హత్య సంఘటనపై ప్రజానీకం భగ్గుమంది. శనివారం షాద్‌నగర్ అట్టుడికిపోయింది. ఒక దశలో పరిస్థితులు అదుపు తప్పి ఆందోళనకారులు పోలీసులపైకి చెప్పులు విసిరారు. అడుగడుగునా టెన్షన్..టెన్షన్..నర రూప రాక్షసులను బహిరంగంగా ఉరితీయాలంటూ జనం ఆగ్రహం. పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఠాణా గేటును ధ్వంసం చేసేందుకు ఆందోళనకారుల యత్నం..నిందితులను తమకు అప్పగిస్తే వారి అంతుచూస్తామంటూ డిమాండ్ చేయడంతో అక్కడి వాతావరణం ఏకంగా రణరంగానే్న తలపించింది. ఒక దశలో నలుగురు ముష్కరులను తొలుత మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జైలుకు తరలిస్తారని ప్రచారం జరగడంతో అక్కడకు మీడియాతోపాటు జనం తండోపతండాలుగా చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో షాద్‌నగర్‌లోనే తహశీల్దార్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి రిమాండ్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత నిందితులను ఏ జైలుకు తరలించాలనే అంశంపై తర్జనభర్జన చేశారు. జనం ఆగ్రహోదగ్రులవుతున్న నేపథ్యంలో నిందితులను పలు వాహనాల్లో పకడ్బందీ పోలీస్ బందోబస్తు మధ్య చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే...శనివారం ఉదయం పది గంటల నుండి షాద్‌నగర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున జనం, వివిధ సంఘాల నాయకులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు
నెలకొన్నాయి. పోలీస్ స్టేషన్‌లో ఉన్న నలుగురు నిందితులను తమకు అప్పగించాలని..వారి అంతు చూస్తామంటూ ఆందోళనకారులు ఒక దశలో గేటును దాటుకుని ముందుకు సాగే క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. నిందితులను ఇక్కడే బహిరంగంగా ఉరి తీయాలంటూ ఆందోళన కారులు భీష్మించుకు కూర్చోవడంతో శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి హుటాహుటిన అక్కడకు చేరుకుని సంయమనం పాటించాలని సూచించారు. పశువైద్యురాలు డాక్టర్ ప్రియాంకరెడ్డిని హత్య చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతోపాటు ప్రజలు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు గేటుకు తాళం వేసి లాఠీచార్జికి దిగారు. ఠాణాలోనే ప్రియాంక నిందితులకు స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌తోపాటు డాక్టర్ సురేందర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ దశలో ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ గేటు ఎక్కి ధ్వంసం చేసేందుకు యత్నించారు. నిందితులను తమకు అప్పగిస్తే వారి అంతుచూస్తాం అంటూ ఠాణా గేటు ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఆందోళనకారులకు ఎంత నచ్చజెప్పిన వినకపోవడంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీచార్జికి దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పశువైద్యురాలు డాక్టర్ ప్రియాంకను పక్కా పథకం ప్రకారమే నిందితులు హత్య చేశారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రయాంక హత్య కేసు నిందితులను స్టేషన్‌లో పెట్టి మర్యాదలు చేయడం ఏమిటని ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు. ఆ నరరూప రాక్షసులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. అన్నివర్గాల ప్రజలు, సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో రణరంగంగా మారిపోయింది. స్థానిక ఏసీపీ సురేందర్, టౌన్ సీఐ శ్రీ్ధర్‌కుమార్ ఆందోళన కారులకు ఎంత నచ్చజెప్పినా వినకుండా కొనసాగిస్తుండడంతో పోలీసులు లాఠీచార్జికి దిగారు. ఆందోళనకారులను స్టేషన్ గేటు నుండి చెదరగొట్టారు. అదే క్రమంలో శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆందోళనకారులను సముదాయిస్తూనే సంయమనం పాటించాలని సూచించారు. చట్టపరిధిలో నిర్ణయాలు జరుగుతాయని, నిందితులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చివరలో పరిస్థితులు అదుపు తప్పుతున్నట్లు కనిపించడంతో ఈకేసును ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ షాద్‌నగర్‌కు అదనపు బలగాలను, అధికారులను పంపించారు. ఆ తరువాత షాద్‌నగర్ మెజిస్ట్రేటు అందుబాటులో లేకపోవడం..పైగా బయటకు తీసుకువెళ్లే పరిస్థితులు లేకపోవడంతో షాద్‌నగర్ తహశీల్దారు, మెజిస్ట్రేటు పాండునాయక్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. రానురాను ఆందోళన పెరుగుతుండటంతో అదనపు బలగాలు హెల్మెట్లు పెట్టుకుని ఆందోళన కారులను చెదరగొట్టేందుకు రంగంలోకి దిగాయి. దీంతో ఎటుచూసినా షాద్‌నగర్ పట్టణం ఈరోజు టెన్షన్..టెన్షన్‌లో మునిగిపోయింది. ఎపుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్య పోలీస్ స్టేషన్ ఉన్న ప్రధాన వీధి ప్రజలు వణికిపోయారు.
*చిత్రం... ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులు