రాష్ట్రీయం

కన్నుల పండువగా పంచమీ తీర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 1: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని పట్టపుదేవేరి అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచానూరులో టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం పద్మసరోవరంలో ముక్కోటి పంచమి శాస్త్రోక్తంగా, అంగరంగ వైభవంగా సాగింది. ఓవైపు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షం కురుస్తున్నా పద్మసరోవరంలో ముక్కోటి స్నానాలను ఆచరించడానికి గంటల తరబడి భక్తులు పుష్కరిణిలో కొలువుదీరారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కుంభ లగ్నంలో చక్రత్తాళ్వార్ (సుదర్శన చక్రం)కు పద్మసరోవరంలో పుణ్యస్నానాల్లో భాగంగా మూడు మునకలు వేయించారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన స్వామి అమ్మవార్ల గోవిందనామ స్మరణలతో తిరుచానూరు మారుమోగింది. కాగా పద్మసరోవరంలో భక్తులు స్నానమాచరించడానికి వీలుగా పరిశుభ్రమైన నీటితో నింపారు. అయితే వరుణుడు కూడా అమ్మవారి పంచమీతీర్థంలో తన వంతు సేవ చేస్తానంటూ జోరుగా వర్షం కురిపించాడు. ఇక పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులతో పుష్కరిణి పూర్తిగా నిండిపోయింది. అసలు నీరు ఉందా, లేదా అన్న అనుభూతిని కల్పించింది. కాగా పుష్కరిణిలో స్నానమాచరించడానికి భక్తులు ఆదివారం ఉదయం నుండే పోటెత్తారు. అయితే మధ్యాహ్నం 12.15 గంటలకు శుభముహూర్తంలో పుణ్యస్నానాలకు సమయం నిర్ణయించడంతో తిరుచానూరుకు చేరుకున్న భక్తులను వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చోబెట్టారు. అయితే అటు తరువాత పుణ్యస్నానాల సమయం ఆసన్నమయ్యే సమయానికి కొన్ని గంటల ముందు గ్యాలరీల్లో ఉన్న భక్తులను పుష్కరిణిలోనికి అనుమతించారు. ఈ సందర్భంగా భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. కొంతమంది మహిళలు కిందపడి స్పృహ తప్పారు. వెంటనే వారిని పోలీసులు, టీటీడీ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఇదిలావుండగా పంచమీతీర్థంలో భాగంగా ఉదయం 6.30 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవరులను ఊరేగింపుగా పంచమీతీర్థ మండపానికి వేంచేపు చేశారు. కాగా పంచమీతీర్థం సందర్భంగా స్వామివారు అమ్మవారికి సారె పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. పంచమీతీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కిలో 300 గ్రాములు బరువు గల వజ్రాలు పొదిగిన అష్టలక్ష్మీ స్వర్ణ వడ్డాణాన్ని సారెతో పాటు తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి అలంకరించారు.
శోభాయమానంగా స్నపన తిరుమంజనం
పంచమీతీర్థ మండపంలో అమ్మవారికి, చక్రతాళ్వార్‌కు ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులను కనువిందు చేశాయి. ఎండుద్రాక్ష, కొబ్బరిపూలు, ఎండు ఫలాలు, పవిత్రాలతో మాలలు రూపొందించారు. తులసీ గింజలు, పవిత్రాలతో చేసిన మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమిళనాడులోని తిరువూర్‌కు చెందిన రాజేంద్ర, షణ్ముగ సుందరం, సుబ్రహ్మణ్యం, నెల్లూరుకు చెందిన నరహరి ఈ మాలల తయారీకి విరాళం అందించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కుంభలగ్నంలో పంచమీతీర్థం (చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్దసంఖ్యలో వచ్చిన భక్తజనం పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవరులను భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ఊరేగించారు. అనంతరం రాత్రి 9.30 నుండి 10.30 గంటల మధ్య శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం నిర్వహించారు. ధ్వజారోహణంతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసినట్లు అయ్యింది. ఈ కార్యక్రమాల్లో పెద్దజీయ్యంగార్, చిన్నజీయ్యంగార్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బోర్డు సభ్యులు ప్రశాంతి, శివకుమార్, అనదపు ఈవో ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో బసంత్‌కుమార్, సీవీఎస్‌వో గోపీనాథ్‌జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావ్ భూపాల్, అదనపు సీవీఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
*చిత్రం..పద్మసరోవరంలో చక్రతళ్వార్‌కు పుణ్యస్నానాలు