రాష్ట్రీయం

ఆకాశంలో అద్భుత విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఇండో-పాక్ యుద్ధంలో భారత్ విజయాన్ని పురస్కరించుకుని ప్రతియేటా డిసెంబర్ 4వతేదీన జరుపుకొనే తూర్పునౌకాదళ దినోత్సవం విశాఖ సాగరతీరంలో బుధవారం అద్భుత రీతిలో సాగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విన్యాసాలను ఆద్యంతం తిలకించారు. తూర్పునౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ పలువురు నౌకాదళం, ఆర్మీ, వాయుసేన అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో త్రివిధ దళాల అద్భుత పోరాట విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఒళ్లు గగుర్పొడిచేలా ఆకాశంలో యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు చేసిన విన్యాసాలు, త్రివిధ దళాలకు చెందిన సైనికులు తీరంలో సాగించిన భీకర పోరాటాలను సందర్శకులు వీక్షించారు. శత్రు మూకలను మెరైన్ కమెండోలతోపాటు మార్కోస్ కమాండోలు ఎంతో సాహసంగా మట్టుబెట్టే తీరు ఆకట్టుకుంది. భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ శివాలిక్, ఐఎన్‌ఎస్ రణవీర్, ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్, ఐఎన్‌ఎస్ జలాశ్వ తీరంలో తమ పాటవాలను ప్రదర్శించాయి. రక్షణ రంగానికి చెందిన యుద్ధ విమానాలు సూర్యకిరణ్, హాక్స్, మిగ్-29, డార్నియర్, పీ-8ఐ యుద్ధ విమానాలు ఆకాశంలో అద్భుత విన్యాసాలు చేశాయి. అదేవిధంగా చేతక్ హెలికాఫ్టర్లు, కామోవ్ హెలికాఫ్టర్లు, యుఎస్‌వీహెచ్ హెలికాఫ్టర్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా ‘సూర్యకిరణ్’
ఈసారి నౌకాదళ విన్యాసాల్లో రక్షణ రంగంలో చేరిన సూర్యకిరణ్ యుద్ధ విమానాల ప్రదర్శనలు అద్భుతంగా చెప్పాలి. తొమ్మిది విమానాలు గగనతలంలో వివిధ రూపాల్లో చక్కర్లు కొడుతూ చేసిన ప్రదర్శన అబ్బురపరచింది. ఎరుపుతో కూడిన రంగుతో ఈ విమానాలు ఆకాశంలో తూనీగల్లా ఎగురుతుంటే సందర్శకులు కళ్లప్పగించి వీక్షించారు. పారా గ్లైడింగ్‌కు చెందిన స్కై డైవర్స్ సుమారు 6000 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగి ముఖ్యఅతిథికి జ్ఞాపిక బహుకరించడం సూపర్. ఎనిమిది మంది స్కై డైవర్స్ బృందం భారత జాతీయ పతాకంతోపాటు నౌకాదళ పతాకంతో వినువీధి నుంచి కిందకు దిగి, ముఖ్యఅతిథికి జ్ఞాపికను బహుకరించారు. తీరంలో శత్రు దేశానికి చెందిన ఆయిల్ రిగ్‌ను పేల్చివేసి, వారిని కట్టడి చేసే సాహస విన్యాసం ఒళ్లు గగుర్పొడిచింది. భారత నౌకాదళంలో కీలకమైన శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే జలాంతర్గామి ఐఎన్‌ఎస్ సింధుఘోష్ తీరంలో సందర్శకులకు కనువిందు చేసింది. చివరగా తీరంలో కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పులతో విన్యాసాలకు ముగింపు పలికారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, టీటీడీ పాలకమండలి సభ్యుడు కన్నబాబు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, టీ నాగిరెడ్డి, పీ.ఉమాశంకర్ గణేష్, కలెక్టర్ వినయ్‌చంద్, జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎట్‌హోంకు ఏపీ సీఎం జగన్
నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేవీ హౌస్‌లో ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ ఆధ్వర్యంలో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఆయనతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
*చిత్రాలు.. విశాఖ ఆర్కే బీచ్‌లో బుధవారం జరిగిన నేవీ డే విన్యాసాలు తిలకిస్తున్న ఏపీ సీఎం జగన్, పక్కన ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ ఉన్నారు.
* ఆకాశంలో సూర్యకిరణ్ యుద్ధ విమానాల విన్యాసాలు