రాష్ట్రీయం

గొల్లపూడి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నటుడు, రచయిత గొల్లపూడి మారుతిరావు (80) కన్నుమూశారు. వయోధికులై కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మారుతిరావు, చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. నటుడిగా తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన మారుతిరావు, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో తొలిసారి స్క్రీన్‌కొచ్చారు. దాదాపు 250 సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, సహాయ నటుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. వినూత్నమైన
విలనిజాన్ని పరిచయం చేసింది గొల్లపూడి మారుతీరావే. అందుకు స్వాతిముత్యం లాంటి చిత్రాలు అద్దంపడతాయి. ఇండస్ట్రీకి రాకముందే -రచయితగా ఎన్నో నాటకాలు, నవలలు, కథలు రాసిన అనుభవం ఆయనది. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో రేడియో వ్యాఖ్యాతగా ఆయన కెరీర్ మొదలైంది. తెలుగు సినీ పరిశ్రమలోనూ కథా రచయితగా, సంభాషణల రచయితగా ఎన్నో చిత్రాలకు పని చేశారాయన. సినీరంగంలో ఆయన మొదటి రచన ‘డాక్టర్ చక్రవర్తి’. తొలి సినిమాతోనే ఉత్తమ కథా రచయితగా గొల్లపూడికి నంది పురస్కారం దక్కింది. గొల్లపూడి కలంనుంచి జాలువారిన కొన్ని రచనలు -వర్శిటీ పాఠ్యాంశాలయ్యాయి. తెలుగు నాటక రంగంపై ఆయన రాసిన పరిశోధనా వ్యాసాలు ఆంధ్ర వర్శిటీలోని థియేటర్ ఆర్ట్స్ విభాగానికి పాఠ్య పుస్తకమైంది. నాటికలు, నాటకాలు, కథానికలు, సినిమా కథలు, పత్రికా వ్యాసాలు.. ఇలా ఏ రచనలోనైనా తనదైన ప్రత్యేక ముద్ర చూపించారు గొల్లపూడి. వర్తమాన రాజకీయాలు, బతుకు ఘటనలపై తనదైన శైలిలో రాసిన ‘జీవనకాలమ్’ -గొల్లపూడికి ప్రత్యేక గుర్తింపునిచ్చిందనే చెప్పాలి. ఆసక్తికరంగా రచనను సాగిస్తూ -చురుక్కుమనే చతురతను ముగింపులో ప్రస్తావించటం మారుతీరావు ప్రత్యేక శైలి. గొల్లపూడి భార్య శివకామసుందరి. ముగ్గురు కుమారులు సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. దర్శకుడైన శ్రీనివాస్ ఓ చిత్రాన్ని షూట్ చేస్తూ ప్రమాదంలో మరణించటంతో -ఆయన పేరుతో కొత్త దర్శకులకు విశిష్ట ప్రోత్సాహకాలు, అవార్డులు అందించారు గొల్లపూడి.
ఉప రాష్టప్రతి సంతాపం
విలక్షణ రచయిత, విమర్శకుడు, జాతీయ భావాలు కలిగిన మానవతావాది, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు మరణం పట్ల ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. రేడియో నాటకాలు, కథల రచయితగా ఎప్పటికీ తెలుగు ప్రజల మనస్సుల్లో గొల్లపూడికి ప్రత్యేక స్థానం ఉంటుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో చెన్నై వెళ్లినప్పుడు మారూతీరావుఅస్వస్థత విషయం తెలియగానే ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇంతలోనే ఆయన లేరనే వార్త బాధాకరం ఉందని ఉప రాష్టప్రతి పేర్కొన్నారు. మారుతీరావు కుటుంబానికి ఆయన సానుభూతిని తెలిపారు. గొల్లపూడిది విలక్షణమైన వ్యక్తిత్వమని వెంకయ్యనాయుడు కొనియాడారు. తెలుగుసాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయని ఆయన చెప్పారు.

కేసీఆర్ దిగ్బ్రాంతి
నటుడు గొల్లపూడి మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీరంగానికి ఆయనెంతో సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయన్నారు. గొల్లపూడి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి దూరమయ్యాడని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ -నటుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సంపాదకుడిగా గొల్లపూడి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. గొల్లపూడి మృతికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేస్తూ -తెలుగు చిత్ర పరిశ్రమ, సాహితీ లోకానికి ఆయన మృతి తీరని లోటని వ్యాఖ్యానించారు. గొల్లపూడి మృతిపట్ల చిత్ర పరిశ్రమలోని దర్శక నిర్మాతలు, కథానాయకా నాయికలు, ప్రముఖులు, సాంకేతిక విభాగ నిపుణులు సంతాపం తెలుపుతూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
*.నటుడు, రచయిత గొల్లపూడి మారుతిరావు (ఫైల్‌ఫొటో )