రాష్ట్రీయం

ఆక్రమణలను ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: జిల్లాలవారీగా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై జాబితాలు సిద్ధమవుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారమే కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణల్లో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి కూడా. ఆక్రమణలో ఉన్న వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను తిరిగి పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించాలంటే స్థలాలు లభించని పరిస్థితి ఒకవైపు ఉంటే మరోవైపు విలువైన వేలాది ఎకరాల భూమి ఆక్రమణల్లో ఉంది. భూముల ఆక్రమణదారులకే ఉపయోగపడే విధంగా కేసులను వాదించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పెద్దగా శ్రద్ధ చూపకపోవడం, మరోవైపు కేసులకు హాజరు కాకపోవడం ద్వారా ప్రత్యర్థికి ఉపయోగపడే చర్యలు అనేకం జరుగుతున్నాయి. విలువైన భూములు కావడంతో ఎక్కడికక్కడ ఇలాంటి మిలాఖత్‌లు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. న్యాయస్థానాల్లో ఉన్న భూ ఆక్రమణ కేసులపై ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం సమీక్ష జరిపారు. గత పాలకులు ఉద్దేశపూర్వకంగానే భూ ఆక్రమణదారులకు అండగా ఉండడం వల్లనే ఇలా జరిగిందని, ప్రభుత్వ భూమలను వదిలే ప్రసక్తి లేదని దీనిపై ఒక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భూములు కేసుల్లో ఇరుక్కోవడం వల్ల ప్రజోపయోగ పనులకు ఉపయోగించలేకపోతున్నట్టు ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి న్యాయవాదులను పెట్టుకోవడం ద్వారా ఈ భూములను రక్షించుకోవచ్చునని అధికారులకు సూచించారు.
న్యాయస్థానాల్లో కేసులను సత్వరం పరిష్కరించాలని సుప్రీంకోర్టు భావిస్తున్న తరుణంలో భూముల కేసులకు సైతం సత్వరం న్యాయం జరిగే విధంగా రాష్ట్రం నుంచి తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కేసులు సత్వరం పరిష్కారం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి గురువారం ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సంతోష్‌రెడ్డి, సిఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, టిఎస్‌ఐఐసి ఎండి ఎంవి నర్సింహ్మారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ ఉదాసీనత వల్లనే హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల ఎంతో విలువైన భూములు కబ్జాదారులు ఆక్రమించుకున్నారని, వివాదాస్పదంగా మార్చారని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వ భూములను కాపాడేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇఎన్‌టి ఆస్పత్రి భూ కబ్జాను అడ్డుకోగలిగినట్టు, ప్రైవేటుపరం అయిన బొటానికల్ గార్డెన్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోగలిగినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. మిగతా అన్ని కేసుల్లో కూడా ఇదే చిత్తశుద్ధి ప్రదర్శించి, కేసులను సత్వరం పరిష్కరించడానికి చొరవ చూపాలని అన్నారు. భూముల అన్యాక్రాంతానికి ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఒక కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

చిత్రం గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న సిఎం కేసీఆర్