రాష్ట్రీయం

పిఎస్‌యు నిల్వలు ఆంధ్రకు ఇవ్వొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 23 నెలలు గడుస్తున్నా ఇంకా 9, 10 షెడ్యూల్ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. జనాభా ప్రాతిపదికన హైదరాబాద్ పరిసరాల్లోని ప్రభుత్వ రంగ ఆస్తులు, అప్పుల విభజన జరగాలని ఆంధ్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఏపీ పునర్వ్యవస్ధీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్స్‌లోని పిఎస్‌యుల నగదు నిల్వలను ఎటువంటి పరిస్ధితిలో ఏక పక్షంగా ఆంధ్రకు పంపిణీ చేయరాదని కోరుతూ బ్యాంకులకు లేఖ రాసింది. పైగా ఈ విషయమై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని తెలంగాణ ఆర్ధిక శాఖ నిర్ణయించింది. దీంతో సమీప భవిష్యత్తులో ఆర్టీసితోపాటు పలు సంస్థల విభజన ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనపడటం లేదు. హైదరాబాద్‌లోని ఉమ్మడి సంస్థల డిపాజిట్లు దాదాపు రూ.16 వేల కోట్లు ఉన్నాయి. పైగా భవనాల విలువను ఇంకా మదింపు వేయాల్సి ఉంది. ఇటీవల సుప్రీం కోర్టు ఉన్నత విద్యా శాఖకు సంబంధించి ఇచ్చిన తీర్పులో ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో వాటా ఉందని పేర్కొంది. దీంతో మిగిలిన ఉమ్మడి సంస్థలకు సంబంధించి ఉన్న ఆస్తులు, అప్పులు, డిపాజిట్లలో తమకు న్యాయబద్ధమైన వాటా ఉందని సుప్రీం కోర్టు తీర్పును పేర్కొంటూ ఆంధ్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్‌లో ప్రభుత్వ రంగ సంస్థల డిపాజిట్లు ఉన్న బ్యాంకులకు లేఖ రాస్తూ తమకు తెలియకుండా ఆంధ్రప్రదేశ్‌కు సొమ్మును ఇస్తే బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నత విద్యా శాఖకే పరిమితమని, 9, 10 షెడ్యూల్ కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించదని తెలంగాణ ప్రభుత్వం నిశ్చితాభిప్రాయంగా ఉంది. ఈ విషయమై సుప్రీం కోర్టు వద్ద త్వరలో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయాలని తెలంగాణ నిర్ణయించింది. తమ భూభాగంలోని సంస్థల నగదు నిల్వలు, ఆస్తులు, ఇతర అంశాలపై తమకే అధికారం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ వాదిస్తోంది.
9వ షెడ్యూల్‌లో 89 సంస్థలున్నాయి. షీలాబేడీ కమిటీ ఇందులో 59 సంస్థలకు సంబంధించి మాత్రమే ఆస్తులు, అప్పుల విభజనపై సిఫార్సులు చేసింది. ఉద్యోగుల విభజనపై ఇంతవరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం స్ధానికత లేదన్న కారణంపై తొలగించిందని, 371 డి కింద నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత వస్తుందని ఆంధ్ర వాదిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధాని అయినందు వల్ల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటయ్యాయి. వాటికి సంబంధించిన నగదు నిల్వలు, ఆస్తుల్లో జనాభా ప్రాతిపదికన తమకు వాటా రావాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. అలాగే షెడ్యూల్ 10 కింద ఉన్న 142 సంస్థల్లో 123 సంస్థలు హైదరాబాద్ పరిసరాల్లోనే ఉన్నాయి. సుప్రీం కోర్టు తీర్పు స్ఫూర్తిగా తీసుకుని కేంద్రం కమిటీని వేసి రెండు నెలల్లోగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై నిర్ణయం తీసుకోవాలన్న ఏపీ ప్రభుత్వ లేఖపై కేంద్రం ఇంకా స్పందించాల్సి వుంది.