రాష్ట్రీయం

ఎండ ప్రచండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో నిప్పుల కొలిమిలా మారాయి. ప్రచండ భానుడు కురిపిస్తున్న నిప్పుల వర్షానికి జనం అల్లాడి పోతున్నారు. ఒక వైపు ఎండ తీవ్రత, మరో వైపు వడగాడ్పుల విభృంభించడంతో వృద్ధులు, చిన్న పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. కర్మాగారాల్లో పని చేసే కార్మికులు, నిత్యం రోడ్లపై తిరిగే ఆర్టీసి బస్ డ్రైవర్, కండక్టర్లు వంటి వారు వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలతో విధి నిర్వహణ ప్రాణాంతకంగా మారింది. కర్మాగారాల్లో పని చేసే వారు తీవ్ర అలసటకు గురవుతున్నారు. యంత్రాల వేడికి తోడు మండుతున్న ఎండలు సగటు కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. తెలంగాణలో గతంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను అధిగమిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం పతాక స్థాయికి చేరడంతో 20 ఏళ్లలో లేని విధంగా గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లోనే నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణ శాఖ అధికారిక సమాచారం మేరకు శనివారం తెలంగాణ రాష్ట్రంలో సగం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45, 44 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరాయి. భద్రాచలం, ఖమ్మం, నల్గొండలో అధికంగా 45 డిగ్రీలకు చేరితే, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రామగుండంలో 44 డిగ్రీలకు చేరుకుంది. మిగిలిన ప్రాంతాల్లో హకీంపేట 42 తప్ప అన్ని చోట్ల 43 డిగ్రీలకు చేరుకుంది. అయితే ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో స్థానిక వర్గాల సమాచారం మేరకు 47 డిగ్రీలు నమోదైనట్లు చెబుతున్నారు. ఉష్ణోగ్రతల తీవ్రతను లెక్కించే వాతావరణ శాఖ అబ్జర్వేటరీలు అన్నిచోట్ల లేక పోవడంతో మణుగూరు, సత్తుపల్లి, కొత్తగూడెంలో అధికంగా ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరినా లెక్కలోకి రావడం లేదని తెలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి ఆయా ప్రాంతాలు అగ్నిగుండంగా మారడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావంతో రెక్కాడితే గానీ డొక్కాడని కూలీల నిత్య జీవనం నరక ప్రాయంగా మారింది. వ్యవసాయ కార్మికులు వ్యవసాయ క్షేత్రాల్లో పని చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక శనివారం ఆంధ్రప్రదేశ్‌లోనూ నాలుగు చోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత జంగమేశ్వరంలో నమోదైంది. ఎండాకాలంలో ఎండలు తీవ్రంగా ఉండే మాట వాస్తవమే అయినా, ఏప్రిల్ నెలలోనే ఈ స్థాయిలో ఎండలు ముదిరిపోవడం పట్ల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఎండల తీవ్రత మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్‌లో రాష్ట్రంలో ప్రవేశించే వరకు కొంచెం ఎక్కువ, తక్కువగా ఉన్నప్పటికీ ఇదేస్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకునే అవకాశం ఎల్‌నినో ప్రభావం వల్ల ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న నాలుగైదు రోజుల పాటు పశ్చిమ, వాయువ్య వేడిగాలుల ప్రభావంతో వడగాడ్పుల తీవ్రత మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు వడగాల్పుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

చిత్రం ఎండదెబ్బకు విశాఖలో జనం ముసుగు ప్రయాణాలు