రాష్ట్రీయం

పట్టిసంకు ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 30: గోదావరి నదిపై పట్టిసం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయంగా పెనుగొండ మండలం సిద్ధాంతం సమీపంలోని దొంగరావిపాలెం వద్ద ప్రభుత్వం ఏర్పాటుచేసిన తాత్కాలిక ఎత్తిపోతల పథకం సత్ఫలితాన్నిచ్చింది. రూ.15 కోట్ల వ్యయంతో 14 భారీ పంపుల ద్వారా సుమారు 150 క్యూసెక్కుల నీటిని తోడి, ఈ దాళ్వాలో పశ్చిమ డెల్టాలోని 30 వేల ఎకరాలకు నీరందించగలిగారు.
ఈ విజయంతో పోలవరం ప్రాజెక్టు ప్రారంభమయ్యేదాకా ఈ పథకాన్ని కొనసాగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసం వద్ద యుద్ధప్రాతిపదికన ఎత్తిపోతల పథకం నిర్మించిన సంగతి విదితమే. గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే దీనివల్ల గోదావరి జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందనే ఆందోళన రైతుల్లో నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది గోదావరిలో నీటి లభ్యత తగ్గిపోవడంతో దాళ్వా సాగుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పెనుగొండ మండలం సిద్ధాంతం సమీపంలోని దొంగరావిపాలెం వద్ద ఒక ప్రత్యామ్నాయ పథకానికి ప్రభుత్వం రూపకల్పనచేసింది. కాటన్ బ్యారేజీకి దిగువన ఉండే ఈ ప్రాంతంలో వరదల సమయంలో దిగువకు వచ్చిన నీరు సహజసిద్ధంగా నిల్వవుంటుంది. గోదావరి గట్టుకు చేర్చి డెల్టాలోని అత్యధిక భాగానికి నీరందించే బ్రాంచి కెనాల్ ఇక్కడ ఉంది. గోదావరిలో సహజసిద్ధంగా నిల్వవుండే నీటిని భారీ పంపుల ద్వారా బ్రాంచి కెనాల్‌లోకి ఎత్తిపోస్తే ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. జనవరి 5వ తేదీన కేవలం ఒక పంపును ఏర్పాటుచేసి నీటిని లిఫ్ట్ చేయడం ప్రారంభించారు. అనంతరం జనవరి 7వ తేదీన మరో పంపును ఏర్పాటుచేశారు.

మంచినీటి చెరువులకూ ఉపయోగం
ఈ ఎత్తిపోతల పథకంతో కేవలం సాగు నీరేకాక, తాగునీటి అవసరాలు కూడా తీరాయి. డెల్టాప్రాంతంలో పలు పురపాలక సంఘాలు, వందలాది పంచాయతీలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా నిరంతరాయంగా నీరు సరఫరా కావడంతో పట్టణాలు, గ్రామాల్లోని మంచినీటి చెరువులను పూర్తిగా గోదావరి జలాలతో నింపారు. దీంతో ఈ ఏడాది వేసవిలో నీటి సమస్యకు పరిష్కారం లభించినట్టయ్యింది.