రాష్ట్రీయం

గోదావరిలో డ్రెడ్జింగ్‌కు టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 5: అఖండ గోదావరి నదిలో డ్రెడ్జింగ్ పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 10నుండి డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడానికి కసరత్తు జరుగుతోంది. దీంతో గోదావరి నదిలో ఇసుక మేటలు, దిబ్బలు కరుగనున్నాయి. అంతా అనుకున్నట్టు సాగితే దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించనుంది. గోదావరి నదిలో డ్రెడ్జింగ్ చేసి, ఇసుక పూడిక తీయాలని గత పుష్కరాలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో జలవనరుల శాఖ దీనిపై కసరత్తుచేసింది. ఇసుక దిబ్బలు గుర్తించి నివేదిక పంపించడంతో డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ద్వారా పనులు చేపట్టడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. గోదావరి నదిలో సుమారు కోటి క్యూబిక్ మీటర్ల వరకూ ఇసుక ఉంటుందని అంచనావేశారు. డ్రెడ్జింగ్‌కు గత నెల 16న టెండర్లు పిలవగా సింగిల్ టెండర్ దాఖలైంది. దీంతో మళ్లీ టెండర్లు పిలిచారు. ఇప్పుడు డార్జీ, ఓషన్స్ పార్క్ అనే రెండు అంతర్జాతీయ సంస్థలు టెండర్లు వేశాయి. వీటిని పరిశీలించి జలవనరుల శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపించి అక్కడ నుండి అనుమతులు వచ్చిన వెంటనే ఈ నెల 10నుండి పనులు చేపట్టేందుకు సన్నద్ధమవుతుతోంది. డ్రెడ్జింగ్ చేసేందుకు ప్రభుత్వం క్యూబిక్ మీటరుకు రూ.155 నిర్దేశించింది. అయితే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ మాత్రం రూ.240 కోట్ చేసినట్టు సమాచారం. అఖండ గోదావరి ఎడమగట్టువైపు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నాలుగుచోట్ల, అఖండ గోదావరి కుడిగట్టు వైపు పశ్చిమ గోదావరి పరిధిలో రెండు ప్రాంతాల్లోనూ ముందుగా డ్రెడ్జింగ్ పనులు చేపట్టనున్నారు. డ్రెడ్జింగ్ ద్వారా తొలగించిన ఇసుకను ఎక్కడ నిల్వచేయాలి, రవాణా తదితర అంశాలపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.