రాష్ట్రీయం

సుజనకు డౌటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఏపి నుంచి ఎన్నికయ్యే నలుగురు సభ్యులు ఎవరన్న ఉత్కంఠ మొదలయింది. సాంకేతికంగా టిడిపికి 3, వైసీపీకి ఒక సీటు దక్కనుంది. అయితే, వైసీపీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడంతో నాలుగవ సీటుకు పోటీపై సస్పెన్స్ నెలకొంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడయిన ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడుకు ఈసారి రాజ్యసభ సీటు ఖాయమంటున్నారు. ఆయన చాలాకాలం నుంచి ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు. అప్పట్లో సీఎం రమేష్‌ను ఎంపిక చేసే సమయంలోనే యనమల పేరు ప్రముఖంగా వినిపించింది. ఈసారి సుజనాచౌదరికి పొడిగింపు ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మారిషస్ బ్యాంకు అప్పుల వ్యవహారంలో పీకల్లోతు వివాదంలో కూరుకుపోయిన ఆయనకు పొడిగింపు ఇస్తే, పార్టీ అప్రతిష్ఠ పాలవుతుందన్న విమర్శలు పార్టీవర్గాల్లోనే వినిపిస్తున్నాయి. దీనిపై ప్రధాని కార్యాలయం నుంచి ఇప్పటికే సీఎంఓకు స్పష్టమైన సంకేతాలున్నాయంటున్నారు. అయితే, బాబుతో సుజనాకు ఉన్న సంబంధాల దృష్ట్యా, ఆయనకు పొడిగింపు ఇచ్చినా ఆశ్చర్యపోవలసిన పనిలేదని మరో వర్గం వాదిస్తోంది. ఈసారి కాంగ్రెస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేనందున, రాజ్యసభకు తొలిసారి ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం కనిపించడం లేదు. టిడిపికి అధికారికంగా దక్కే మూడు స్థానాల్లో ఒకటి బిజెపికి ఇవ్వనున్నారు. ఆ మేరకు నిర్మలా సీతారామన్‌కు మరోసారి పొడిగింపు ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఇక ఢిల్లీలో ఏపి ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వైశ్య వర్గానికి చెందిన మాజీ మంత్రి టిజి వెంకటేష్, దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత జెఆర్ పుష్పరాజ్, తెలంగాణకు చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఆదాలకు మూడవ సీటు దక్కవచ్చంటున్నారు. యువనేత లోకేష్ ఆయనకు ఇప్పటికే హామీ కూడా ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టిజి కూడా లోకేష్‌ను కలసి తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు.
ఇక నాలుగో సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. నాలుగో సీటుకు పోటీ చేయాలన్న కోరికను రెండువారాల క్రితం జరిగిన సమావేశంలో బాబు సూచనప్రాయంగా వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న విజయసాయిరెడ్డిని, రాజ్యసభలో అడుగుపెట్టకుండా చేయాలన్న పట్టుదల పార్టీ నాయకత్వంలో కనిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిన మేరకు తనకు గవర్నర్ పదవి వచ్చే అవకాశాలు లేనందున, రాజ్యసభకు పంపించాలని బాబును మోత్కుపల్లి కోరుతున్నారు. అదీగాక, ఆయనకు రాజ్యసభ ఇస్తే, ఏపిలో మాదిగ వర్గాన్ని కూడా సంతృప్తి పరిచినట్లు ఉంటుందన్న భావన లేకపోలేదు. అయితే, నాలుగవ సీటుపై పోటీ అంశం నామినేషన్‌కు ఒకరోజు ముందు నిర్ణయించే అవకాశం ఉంది. ఎందుకంటే వైకాపానుంచి మరో 17 మంది వస్తేనే టిడిపి విజయావకాశాలు మెరుగవుతాయి.
ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలోని 175 మంది సభ్యుల్లో సాంకేతికంగా టిడిపి-బిజెపికి 108, వైఎస్సార్‌సీపీకి 67 ఓట్లు ఉన్నాయి. ఆ ప్రకారంగా ఒక రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే 43.8 ఓట్లు అవసరం అవుతుందని శాసనసభ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వైసీపీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. అలా చూస్తే టిడిపి బలం 125కు పెరుగుతుంది. మరో 17 మంది చేరితే అప్పుడు టిడిపి బలం 142కు పెరుగుతుంది. అప్పుడు వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఏ మాత్రం ఉండవు. రాజ్యసభ ఎన్నికల నాటికి మరో 17 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్పించే పనిలో టిడిపి నాయకత్వం బిజీగా ఉంది. ఆ నాలుగవ సీటును తెలంగాణ నేతతో పోటీ చేయిస్తారా? లేక ఆంధ్ర నేతతో చేయిస్తారా? అన్నదానిపై టిడిపి వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

chitram యనమల రామకృష్ణుడు

మార్తి సుబ్రహ్మణ్యం