రాష్ట్రీయం

రగులుతున్న రాజోలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఏలూరు, మే 18: ఆర్డీఎస్ వివాదం మరింత ముదిరింది. ఆధునీకరణ పనులు అడ్డుకుంటుందంటూ తెలంగాణ, అలాం టి ఆధారాలు మీదగ్గరుంటే బయటపెట్టమంటూ ఆంధ్ర.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో దుమారం రేగుతోంది. మీవి అబద్ధాలంటే మీవి అబద్ధాలంటూ తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రు లు చేసుకుంటున్న దూషణలు సమస్యను మరింత జఠిలం చేస్తోంది. పనులు ఆపాలంటూ మేం రాసిన లేఖలు మీదగ్గరుంటే బహిర్గతం చేయండంటూ ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సవాల్ చేసిన గంటల్లోనే, తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలను బహిర్గతం చేసింది. ఆంధ్ర సర్కారు ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని మంత్రి దేవినేని చేస్తున్న వాదనే పచ్చి అబద్ధమంటూ సాక్ష్యాధారాలను మీడియాకు అందించింది. దీంతో ఆర్డీఎస్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతుంటే, లేఖల వ్యవహారం ఇరిగేషన్ మంత్రుల మధ్య సవాళ్లకు దారితీసింది. ఆర్డీఎస్ పనులను అడ్డుకునేందుకు కర్నూలు కలెక్టర్‌తో లేఖలు రాయించారన్న అభియోగాలపై ఆంధ్ర మంత్రి దేవినేని బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రి ఆరోపిస్తున్నట్టు ఎలాంటి లేఖలూ ఆంధ్ర సర్కారు రాయలేదన్నారు. కర్నాటకకు లేఖలే రాయనపుడు, ఉపసంహరణకు తావెక్కడిదని తెలంగాణను నిలదీశారు. రెండు రోజుల్లో లేఖను ఉపసంహరించుకోకుంటే సహాయ నిరాకరణ తప్పదన్న మంత్రి హరీశ్ హెచ్చరికను మంత్రి దేవినేని ఎద్దేవా చేశారు. రెండు రోజులు కాదు, రెండేళ్లు టైమిస్తామని, వాళ్లు చెప్తున్నట్టు లేఖలేమైనా ఉంటే బహిర్గతం చేయాలని సవాల్ చేశారు. వాస్తవానికి ఈ అంశం మూడు రాష్ట్రాల మధ్య సమస్యగా ఉందని, చర్చల ద్వారా ముందుకెళ్లాలి తప్ప, ఏదేదో మాట్లాడటం సరికాదన్నారు. ఉమా చర్చలకు రావటం లేదన్న హరీశ్ ఆరోపణలపై స్పందిస్తూ, ఇదేమీ మంత్రుల పంచాయితీ కాదన్నారు. బాధ్యత గల మంత్రిగా మాట్లాడితే మంచిదని హరీశ్‌కు దేవినేని హితవు పలికారు. అయితే మంత్రి సవాల్‌పై స్పందించిన తెలంగాణ సర్కారు, కర్నాటకలోని రాయచూర్ కలెక్టర్‌తో కర్నూలు కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడినట్టు ఆర్డీఎస్ ఇఇ (సింధనూర్) పంపిన వాట్సాప్ మేసేజ్‌ను మీడియాకు బహిర్గతం చేసింది. అలాగే ఆదోని ఆర్డీవో ఓబులేష్, ఆర్డీఎస్ ఇఇ (సింధనూర్)కి రాసిన లేఖనూ బహిర్గతం చేసింది. కర్నూలు కలెక్టర్‌కు ఆర్డీఎస్ ఇఇ సాయిప్రకాశ్ పంపిన వాట్సాప్ మేసేజ్‌లో ‘రెండు రాష్ట్రాల నీటిపారుదల మంత్రుల ఆదేశాల మేరకు రాజోలిబండ పనులు 16న ప్రారంభించినట్టు మా కలెక్టర్ దృష్టికి తెస్తే, ఆయన మీతో మాట్లాడినట్టు చెప్పారు’ అని ఉంది. ఈ మెసేజ్‌కు కర్నూలు కలెక్టర్ రిప్లై ఇస్తూ ‘ఆంధ్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే వరకూ పనులు ప్రారంభించకండి. పనులను మా జిల్లా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది’ అని పేర్కొన్నారు. దీనికి ఆర్డీఎస్ ఇఇ స్పందిస్తూ ‘మీవైపు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే పనులు ప్రారంభిస్తాం’ అని స్పష్టం చేసినట్టు మెసేజ్‌లో ఉంది. ఇదిలావుంటే, ఇదే అంశంపై మే 16న ఆదోని ఆర్డీవో సిహెచ్ ఓబులేష్ ఆర్డీఎస్ ఇఇ (సింధనూర్), రాయిచూర్ జిల్లాకు రాసిన లేఖనూ తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టింది. ఈ లేఖలోనూ ఆర్డీఎస్ పనులు నిలిపివేయాలని, లేనిపక్షంలో రైతులు ఆందోళనకు దిగితే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నట్టు హెచ్చరించారు. ఆర్డీఎస్ పనులు జరుగుతున్న ప్రదేశానికి తాము స్వయంగా వెళ్లి చూసినట్టు లేఖలో ఆర్డీవో పేర్కొనడం గమనార్హం. దీంతో ఆర్డీఎస్ వివాదం రెండు రాష్ట్రాలు, ఇద్దరు నీటిపారుదల మంత్రుల మధ్య అగ్గి రాజేసినట్టయ్యింది.