రాష్ట్రీయం

అనుమతులు వచ్చేశాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 21: గోదావరి నదీ జలాల చారిత్రక ఒప్పందంలో భాగంగా పెన్‌గంగా నదిపై నిర్మించతలపెట్టిన చెనాక కొరాట బ్యారేజీ నిర్మాణ పనులకు మహారాష్ట్ర నుంచి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. తెలంగాణ, మహారాష్ట్ర సిఎంల మధ్య గతంలో కుదిరిన ఒప్పందంలో భాగంగా ముందుగా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలలో 56వేల ఎకరాలకు సాగునీరందించే పెన్‌గంగా బ్యారేజీ నిర్మాణ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇరు రాష్ట్రాలు నదీ జలాలు వినియోగించుకునేలా ఒప్పంద పత్రంపై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి రావాల్సిన అటవీ, మైనింగ్, వన్యప్రాణి విభాగాల అనుమతులకు ఎదురుచూస్తున్న నేపథ్యంలో శనివారం మహారాష్ట్ర ప్రభుత్వం మూడు అనుమతులు జారీ చేస్తూ నిరభ్యంతర ధృవీకరణ పత్రాన్ని (ఎన్‌వోసి) విడుదల చేసింది. దీంతో గోదావరి నదీ జలాలపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించే చెనాక కోర్ట బ్యారేజీ నిర్మాణానికి తొలి అడుగుగా అంకురార్పణ జరగనుంది. ఇటీవలే రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, జిల్లా మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలు కోర్టలో బస చేసి బ్యారేజీ పనులపై సమీక్షించిన వారం రోజులకే మహారాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆమోద ముద్ర వేయడం గమనార్హం. ఈ బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం గత ఫిబ్రవరిలోనే 368 కోట్లు నిధులను మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులనూ జారీ చేసింది. చెనాక కోర్ట వద్ద బ్యారేజీ పనులను తెలంగాణ ప్రభుత్వమే నిర్మిస్తుండగా, పెన్‌గంగా నదిపై రాజంపేట్, పింపర్‌వాడ వద్ద మరో రెండు ఆనకట్టల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించనుంది. పెన్‌గంగా నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి 1227 కోట్లు మంజూరు కాగా, వీటిలో ఇరు రాష్ట్రాల ఒప్పందాల మేరకు 12 శాతం నదీ జలాలను తెలంగాణ ప్రభుత్వం, మిగితా వాటాను మహారాష్ట్ర రైతులకు లబ్దిచేకూరేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. గత ఫిబ్రవరి నెలలో సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం అక్కడి సిఎంతో ముంబయిలో జరిపిన చర్చల ప్రక్రియలో భాగంగా పెన్‌గంగా నదిపై తొలి బీజం పడటం గమనార్హం. దీంతో రెండేళ్ళలో చెనాక కోర్ట బ్యారేజీ నిర్మాణ పనులు చేపట్టేలా తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్‌వోసి జారీ చేయడంతోపాటు నాగ్‌పూర్‌కు చెందిన పర్యావరణ, అటవీ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ క్లియరెన్స్‌కు అంగీకారం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. 37,300 ఎకరాల ఆయకట్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా పర్యావరణ అనుమతులు జారీకాగా, మరో 13,500 ఎకరాల ఆయకట్టు పరిధిలో కేంద్రం పర్యావరణ అనుమతులు జారీ చేయాల్సి ఉంది. ఈ బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగా క్లియరెన్స్ ఇవ్వడం పట్ల రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ మంత్రి జోగురామన్న హర్షం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ కలలుగన్న గోదావరి నదీ జలాల వినియోగంతో తెలంగాణ బీడు భూములు సస్యశామలం కానున్నాయని, రెండేళ్ళలో పనులు పూర్తిచేసి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి సాగుజలాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలాఉంటే మహారాష్ట్ర ప్రభుత్వం మూడు శాఖల ద్వారా అనుమతులు జారీ చేయడంతో చెనాక -కొరాట బ్యారేజీపై పంప్‌హౌస్, పైపులైన్ డిస్ట్రిబ్యూషన్, కెనాల్ సిస్టం పనులు వేగవంతంకానున్నాయి.

చిత్రం చెనాక -కొరాట వద్ద జరుగుతున్న బ్యారేజీ లెవలింగ్ పనులు