రాష్ట్రీయం

కేసులు సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి. ఈశ్వర రెడ్డి
హైదరాబాద్, మే 21: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే ప్రతిపక్ష నేతలపై పరువు నష్టం కేసు దాఖలు చేస్తామంటూ సిఎం కె చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనానే్న రేపుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు హెచ్చరికగా తీసుకోవాలా? లేక సూచనగానా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నిర్మాణాత్మకంగా విమర్శలు చేయడం ప్రతిపక్షాల బాధ్యత అంటూనే, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో, ప్రతిపక్షాలకూ అంతే బాధ్యత ఉంటుందన్న అంశంపై వివిధ పార్టీల నేతల్లో చర్చ సాగుతోంది. విమర్శలు, ఆరోపణలు చేసినంత మాత్రాన పరువు నష్టం దాఖలు చేస్తారా? రాజకీయంలో ఇదొక కొత్త ధోరణా? అంటూ అని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు లేదా? తెలంగాణలో ఏమైనా నియంత పాలన సాగుతోందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకుల పరువు నష్టం దాఖలు చేసే కేసులను లోతుగా పరిశీలిస్తే, చాలావరకు మాటలే తప్ప కోర్టుకు వెళ్లిన దాఖలాలు తక్కువనే చెప్పాలి. రాజకీయ పార్టీల నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయాల్లో మరీ ఎక్కువగా ఆరోపణలు, దూషణలు వినిపిస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మనసుకు గాయమై, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారన్న ఆవేదనతో పరువు నష్టం దావా వేస్తున్న సందర్భాలు బహుతక్కువ. పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడిన సదరు నాయకునిపై ఇన్ని కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్టు నేతలు ఆవేశంగా ప్రకటించడమే తప్ప, తర్వాత ఆ విషయాన్ని మర్చిపోతున్న సందర్భాలే రాజకీయంలో మనకు ఎక్కువ కనిపిస్తుంటాయి. అసలు రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేసుకున్నప్పుడు అవి కోర్టు వరకు వెళ్తున్నాయా? ఎన్ని కేసుల్లో గట్టిగా నిలబడుతున్నారు? ఎంతమంది కేసులు దాఖలు చేసి విజయం సాధించారు? అంటే అలాంటి సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి.
2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞం పథకాన్ని చేపట్టారు. కాగా జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందంటూ అప్పటి సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బివి రాఘవులు ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో రాఘవులు ప్రసంగిస్తూ వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రజలకు మంచి నీరు, పంటలకు సాగు నీరు అందించేందుకు తాను ఒక యజ్ఞంలా జలయజ్ఞం చేపడితే, రాఘవులు ఇలా ఆరోపించి పరువుకు నష్టం కలిగించారని అప్పటి సిఎం వైఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు రాఘవులుపై 10 కోట్ల రూపాయల నష్టపరిహారం దావా వేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, రాఘవులకు న్యాయవాది ద్వారా నోటీసు పంపించారే తప్ప కోర్టులో దాఖలు చేయలేదు. కోర్టు నియామవళి ప్రకారం ఎవరైనా పరువు నష్టం దావా వేయాలనుకుంటే ముందుగా పరువు నష్టం కోరుతూ వేసిన మొత్తంలో కోర్టుకు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం న్యాయవాది ద్వారా నోటీసు పంపించారు కాబట్టి కొంత కాలానికి వైఎస్ ఆ కేసును ఉపసంహరించుకున్నారు.
మరో కేసును పరిశీలిస్తే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ జి చిన్నారెడ్డికి ఉన్నది నకిలీ డాక్టర్ పట్టా అంటూ అప్పట్లో తెదేపాలో ఉన్న మాజీ మంత్రి, ప్రస్తుత బిజెపి నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి పలు పర్యాయాలు ఆరోపించారు. దీంతో డాక్టర్ చిన్నారెడ్డికి కోపం వచ్చి నాగంపై క్రిమినల్ కోర్టులో పరువు నష్టం దావా కింద లీగల్ నోటీసు పంపించారు. కాగా చిన్నారెడ్డి తనకు పరువు నష్టం కలిగించిన డాక్టర్ నాగంను శిక్షించాలని కోరారే తప్ప డబ్బులు ఆశించలేదు. ఈ కేసుపై కొన్ని రోజులపాటు విచారణ జరిగింది. చివరకు ఒక దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని రాజకీయ ప్రముఖులైన మీరిద్దరూ ఉన్నత విద్యావంతులు, డాక్టర్లు ఇలా కోర్టుకు వచ్చి నిలబడటం బాగాలేదంటూ నచ్చజెప్పారు. నాగం ఆరోపణల్లో వాస్తవం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దాంతో చిన్నారెడ్డి ఆ కేసును ఉపసంహరించుకున్నారు.
ఇలాఉండగా తాజాగా తమిళనాడు గవర్నర్ కె రోశయ్య ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవిఎస్‌కె ఎరగోవన్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. వైస్ ఛాన్సలర్ల నియామకాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ కేసు దాఖలు చేసినట్టు సమాచారం. ఈ కేసు ఎంతవరకూ వెళ్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి కెసిఆర్ విపక్షాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల హెచ్చరికలు ఎంతవరకూ వెళ్తాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కెసిఆర్ హెచ్చరికలకు విపక్షాలు వెనక్కి తగ్గుతాయా? ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఆరోపణలు, విమర్శల మోతాదు పెంచుతాయా? అన్నది వేచి చూడాలి.