రాష్ట్రీయం

సాదా బైనామాలకు ఇక రిజిస్ట్రేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: తెల్లకాగితాలపై రాసుకుని క్రయవిక్రయాలు జరిపే భూముల వివాదాలకు మోక్షం లభించనుంది. జూన్ 2నుంచి 10వరకు ఇలాంటి ఒప్పందాలతో కొన్న భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేకంగా అనుమతిస్తారు. సోమవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పల్లెల్లో తెల్ల కాగితాలపై రాసుకుని భూములను అమ్మకాలు కొనుగోలు చేయడం సర్వసాధారణం. కొన్ని దశాబ్దాల పాటు అలా తెల్లకాగితాలపై జరిగే ఒప్పందాలతోనే భూములు ఒకరి చేతిలో నుంచి మరొకరి చేతిలోకి వెళ్తుంటాయి. కొన్ని దశాబ్దాలు గడిచిన తరువాత వారి వారసులు ఆ భూమి మాదేనంటూ న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు, వివాదాస్పదం అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ చార్జీలు భారం అనుకోవడం, తెలిసిన వారే కదా అన్న నమ్మకాలు.. ఇలా తెల్లకాగితాలపై రాసుకొని అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి. ఈ వివాదాలకు చరమగీతం పాడి తెల్లకాగితాలపై ఒప్పందాలు చేసుకునే సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సోమవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భూవివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో భూవివాదాలన్నీ పరిష్కరించి, భూమి రికార్డులను సరిచేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. అసైన్డ్ భూములు చాలావరకు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని మళ్లీ అసైన్డ్ దారులకు అప్పగించడమో, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమో జరగాలని సిఎం చెప్పారు. ‘తెలంగాణలోని భూముల క్రయ విక్రయాలు ఎక్కువగా సాదా బైనామాల మీదనే (తెల్లకాగితంపై ఒప్పందం రాసుకోవడం) జరుగుతాయి. డబ్బులులేకో, అవగాహన కొరవడో పట్టా చేయించుకోవడం లేదు. 20-30 ఏళ్ల కాగితాల మీదనే ఉన్న భూములు రిజిస్ట్రేషన్ కోసం వస్తే అనవసర ఇబ్బందులు తలెత్తుతున్నాయి’ అని సిఎం అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కావాలని జూన్ 2 నుండి 10 వరకు సాదా బైనామాల మీద జరిగిన లావాదేవీల ప్రకారం భూములన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయాలని సిఎం ఆదేశించారు. 2014 జూన్ రెండునాటికి సాదా బైనామాల మీద ఉన్న ఐదు ఎకరాల లోపు భూమిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పేరు మార్పిడి చేయాలని సిఎం ఆదేశించారు. ఎనిమిది రోజులపాటు రిజిస్ట్రేషన్ చేసి తర్వాత వివరాలన్నింటినీ కంప్యూటర్‌లో అప్‌గ్రేడ్ చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
వారసత్వంగా సంక్రమించిన భూములకు సంబంధించి మ్యుటేషన్ (పేరు మార్పిడి) చేయడానికి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, డబ్బులు ఇవ్వనిదే పని జరగడం లేదని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వ హక్కుల ప్రకారం పేరు మార్పిడి చేసే విషయంలోనూ 10 రోజుల వ్యవధి పెట్టుకోవాలని, దరఖాస్తు వచ్చిన పది రోజుల్లో పేరు మార్పిడి చేసి 11వ రోజు కలెక్టరేట్‌కు వివరాలు పంపించాలని సిఎం అన్నారు. దరఖాస్తు చేసినప్పుడే ఏదైనా అభ్యంతరాలుంటే చెప్పాలని, తెలవని వారికి, నిరక్ష్యరాస్యులకు అవగాహన కలిగించాలన్నారు. డబ్బులు తీసుకోకుండా మ్యుటేషన్ చేయలాని సిఎం స్పష్టం చేశారు. ఎలాంటి ప్రాంతంలోనైనా సరే భూమి క్రయ విక్రయం జరిగి రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లో పేరు మార్పిడి జరగాలని, 16వ రోజు వివరాలు కలెక్టరేట్‌కు అప్‌లోడ్ చేయాలని, ఈ వ్యవహారాలు చూసేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వం ఇప్పటి వరకు 25లక్షల ఎకరాలు ప్రభుత్వం పేదలకు అసైన్డ్ చేసిందని, కానీ చాలావరకు సదరు భూమిలో అసైన్డ్‌దారులు కాస్తులో లేరని, చాలా భూములు వేరే వారి చేతుల్లో ఉన్నాయన్నారు. అసైన్డ్ భూమి చాలావరకు ఉపయోగంలో లేదని, గతంలో ఇచ్చిన భూమి కూడా శాస్ర్తియంగా పంపిణీ కాలేదని చెప్పారు. కనీసం మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే ఆర్థికంగా ఉపయోగపడుతుందని తెలిపారు. గతంలో ఉపయోగం లేని భూమిని, రాళ్లు రప్పలతో కూడిన భూమిని పంపిణీ చేశారని, ఫలితంగా లక్ష్యం నెరవేరలేదని తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాతైనా పరిస్థితి మారలేదని చెప్పారు. అసైన్డ్ భూముల వివరాలు సేకరించి, అసైన్డ్ దారుల వద్ద ఉందా? ఆ భూమిలో ఎవరు వ్యవసాయం చేస్తున్నారు? భూమి ఎక్కడుంది? అనే వివరాలు జూన్ 30లోగా సేకరించాలని తెలిపారు. అసైన్డ్ భూముల వివరాలు అందుబాటులోకి వస్తే ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ఇతరుల చేతుల్లోకి వెళ్లిన భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు కేటాయిస్తామని చెప్పారు. అసైన్డ్ దారుల కాస్తులో ఉంటే వారు వ్యవసాయం చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సాయం అందిస్తామని సిఎం వివరించారు. సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ చేయించే విషయంలో వారసత్వ హక్కుగా పేరు మార్పిడి విషయంలో అన్ని వివరాలు నమోదు చేయాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ తర్వాత పేరు మార్పిడి సందర్భాల్లో దరఖాస్తు వచ్చిన నాటి నుంచి పని పూర్తి అయ్యే వరకు అన్ని వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేయాలన్నారు. జూన్ 2 నుండి 10 వరకు సాదా బైనామాల రిజిస్ట్రేషన్ హెచ్‌ఎండిఏ, కుడా, ఇతర మున్సిపాలిటీల పరిధిలో వినా మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాలని సిఎం ఆదేశించారు. భూముల వ్యవహారంలో అవినీతికి, నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం ఆదేశించారు.