ఆంధ్రప్రదేశ్‌

తొమ్మిదేళ్ల తరువాత విడుదలైన అండర్ ట్రయల్ మహిళా ఖైదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 24: దాదాపు తొమ్మిదేళ్లపాటు అండర్ ట్రయర్ ఖైదీగా జైలు జీవితం గడిపిన ఆదివాసీ గిరిజన మహిళ మంగళవారం విడుదల అయ్యారు. పిటి వారెంట్‌తో 46 కేసుల్లో విచారణ నిమిత్తం జైలుకే పరిమితమైన విశాఖ జిల్లా కొయ్యూరు మండలం వాడరేవులకోట గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ టి.కమలకు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు విడుదలకు ఆదేశం ఇవ్వడంతో ఆమె స్వేచ్ఛ లభించింది. నగరంలోని అడవివరంలోని జిల్లా కేంద్ర కారాగారం నుంచి విడుదలైన ఆమెను విశాఖ జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు అక్బర్, సభ్యులు ప్రకాశరావు, పద్మ తదితరులు స్వాగతించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 2007లో ఆమె తన అనారోగ్య పరిస్థితి కారణంగా తల్లితండ్రుల వద్ద ఉన్నారని, ఆ సమయంలో ఆమెను చింతపల్లి పోలీసులు నక్సల్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న అభియోగంపై అరెస్టు చేశారన్నారు. మందుపాతర్లను అమర్చేందుకు వీలుగా వైర్లు తదితర సామగ్రిని అమె నక్సలైట్లు ధరించే గ్రీన్ చీర కట్టుకుని తరలిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారన్నారు. ఆ తరువాత ఆమె పిటి వారెంట్‌పై మరో 46 కేసుల్లో విచారణ నిమిత్తం అండర్ ట్రయల్ ఖైదీగా ఉంచేశారని తెలిపారు. 47వ కేసును విచారణ చేసిన ఇక్కడి ఎంఎస్‌జె కోర్టు అమెను బేషరతుగా విడుదల చేస్తూ మంగళవారం తీర్పు ఇచ్చిందని తెలిపారు.
శ్రీవారి పథకాలకు రూ. 20 లక్షల విరాళం
తిరుమల,మే 24: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి టిటిడి నిర్వహిస్తున్న వివిధ పథకాలకు హైకోర్టు సీనియర్ న్యాయవాది వి.వి రావు25 లక్షలు రూపాయలు విరాళంగా అందజేశారు. మంగళవారం ఉదయం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల చెక్కునుప్రాణదాన పథకానికి,రూ.15 లక్షల చెక్కును అన్నధానం పథకానికి రావు తిరుమల జె ఇ ఓ కె.శ్రీనివాసరాజుకు అందజేశారు.
నేటి నుండి ఈ-సెట్ ర్యాంకు కార్డులు
అనంతపురం సిటీ, మే 24: ఏపి ఈ-సెట్ 2016 పరీక్షకు సంబంధించిన ర్యాంకు కార్డులను ఈ నెల 25వ తేదీ నుండి అభ్యర్థులు తీసుకోవచ్చునని ఏపి ఈ-సెట్ కన్వీనర్ ఆచార్య పిఆర్ భానుమూర్తి తెలిపారు. మంగళవారం అనంతపురంలోని ఈ-సెట్ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ-సెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను ఏపిఈసిఈటి. ఓఆర్‌జి అనే వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులకు త్వరలోనే కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.
ఇవీ మహానాడు తీర్మానాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 24: తిరుపతిలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకూ జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో చేయనున్న తీర్మానాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు మంగళవారం ప్రకటించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానాడులో 27 తీర్మానాలను ఆమోదించనున్నామని తెలిపారు. ఎపికి సంబంధించి 14, తెలంగాణకు సంబంధించి ఎనిమిది, ఐదు ఉమ్మడి తీర్మానాలు ఉంటాయని ఆయన తెలిపారు. విభజన చట్టంలో హామీలు - ప్రత్యేక హోదా, ఆర్థిక అసమానతలు - పేదరిక నిర్మూలన, నీరు - ప్రగతి, కరవు రహిత రాష్ట్రం, అమరావతి నిర్మాణం, వ్యవసాయం దాని అనుబంధ రంగాలు, సాగునీటి ప్రాజెక్టులు, వౌలిక రంగాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం - స్మార్ట్ విలేజ్‌లు, మానవ వనరుల అభివృద్ధి, విద్య - వైద్య రంగాలకు పెద్దపీట, శాంతి భద్రతలు, పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణ, అవినీతి రహిత రాష్ట్రం, పారదర్శక పాలన, ప్రతిపక్ష అభివృద్ధి నిరోధక చర్యలు - కుట్రలు, రాజకీయ తీర్మానాలు ఉన్నాయి. అలాగే రెండు రాష్ట్రాలకు కలిపి ఎన్టీఆర్‌కు నివాళి, 35 ఏళ్ల పార్టీ ప్రస్థానం, కార్యకర్తల సంక్షేమం - శిక్షణ, జాతీయ స్థాయిలో టిడిపి పాత్ర, కృష్ణా పుష్కరాలకు సంబంధించి తీర్మానాలు ఉన్నాయని కళా వెంకటరావు వివరించారు కాగా కాపుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని కళా వెంకటరావు వివరించారు. కాపులను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూడడం లేదని అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కాపులకు ఏం చేశారని కళా వెంకటరావు ప్రశ్నించారు.
వచ్చే మూడేళ్లలో 5 లక్షల ఉద్యోగాల భర్తీ
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, మే 24: ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధ్యేయమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. మంగళవారం అనంతపురం నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై ఉపాధి కల్పన కార్యాలయాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తామని అన్నారు. ఏపిలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వచ్చే మూడేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దశల వారీగా ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వ చర్యలు తీసుకుంటోందన్నారు. వెనుకబడిన అనంతపురం జిల్లాలో కొడికొండ వద్దరూ.2 వేల కోట్లతో రాగమయూరి ఎల్సినా ఎలక్ట్రానిక్స్ ఐటి కంపెనీ స్థాపించి సుమారు 10వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే అనంతపురం జిల్లాలో బెల్, ఎయిర్ బస్, నేషనల్ సెంట్రల్ ఎక్సైజ్ అకాడమీ,బయోటెక్ వంటి పరిశ్రమలు అతి త్వరలో ఏర్పాటు కాబోతున్నాయన్నారు.