రాష్ట్రీయం

మళ్లీ ‘తారక’ తంత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్తి సుబ్రహ్మణ్యం
హైదరాబాద్, మే 28:చంద్రన్న పథకాలతో ఎన్టీఆర్ పేరును తెరమరుగు చేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో తెలుగుదేశం నాయకత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రెండవ రోజు మహానాడులో ఎన్టీఆర్ అభిమానులను మెప్పించే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారికి చేరువయ్యే ప్రయత్నం చేశారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. అక్కడే 35 మీటర్ల పొడవులో ఎన్టీఆర్ విగ్రహం కూడా ఏర్పాటుచేయాలని తాజా మహానాడులో నిర్ణయించింది. బాబు ఈ విషయం ప్రకటించిన సందర్భంలో వేదిక కింద ఉన్న వేలాదిమంది కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు మూకుమ్మడిగా లేచి హర్షధ్వానాలు చేశారు. రెండురోజుల మహానాడులో ఆ స్థాయి హర్షధ్వానాలు వినిపించడం ఇదే తొలిసారి.
చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పేరుతో కేవలం ఒకటి రెండు పథకాలే పెట్టారు. మిగిలిన పథకాలన్నీ తన పేరు మీద పెట్టుకోవడం ఎన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలకు రుచించలేదు. పార్టీ మూలవిరాట్టయిన దివంగత తారకరాముడి స్మృతి చిహ్నంగా పథకాలు పెట్టకుండా..చంద్రబాబు పేర్లు తగిలించడం వల్ల, పార్టీలో ఎన్టీఆర్ పేరును క్రమంగా పక్కకుపెట్టి, ఆన్న స్థానాన్ని చంద్రన్న భర్తీ చేయనున్నారన్న చర్చ జరిగింది. కాపు భవనాలకు సైతం చంద్రన్న పేరు పెట్టడంపై ఆ సామాజికవర్గంలో పెల్లుబికిన నిరసనపై ఆంధ్రభూమిలో వార్తాకథనం వెలువడిన విషయం తెలిసిందే. దానితో దిద్దుబాబుకు దిగిన బాబు, వాటికి తన పేరు పెట్టవద్దని, ఇకపై తన అనుమతి లేకుండా పథకాలకు పేర్లు పెట్టవద్దని ఆదేశించారు. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ పేరు పక్కకు జరిపి, బాబు తన పేరు పెట్టుకుంటున్నారన్న విమర్శలు వినిపించాయి. దాంతో మహానాడును వేదికగా చేసుకున్న చంద్రబాబు, మళ్లీ రాష్ట్రంలో ఎన్టీఆర్ స్మృతి చిరకాలం ఉండే చర్యలకు శ్రీకారం చుట్టారు. మోత్కుపల్లి నర్సింహులు సూచనతో అమరావతిలో అంబేద్కర్ విగ్రహంతోపాటు, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుచేస్తామని దానికి ‘తెలుగుజాతి ఆత్మగౌరవ స్మృతి’ అన్న పేరు అక్కడికక్కడే ప్రకటించారు. కార్యకర్తల ఉత్సాహం గమనించిన బాబు, ఎన్టీఆర్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ లేనిదే పార్టీ లేదని, ఆయన నుంచి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపి మురళీమోహన్ కూడా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తూ తీర్మానం చేస్తే బాగుంటుందని సూచించగా, వెంటనే ఆ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. ఇది ఎన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలను మరింత సంతోషపరిచింది. అన్నకు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తూ స్వయంగా బాబు తీర్మానం చదివారు. ఆయన తీర్మానం చదువుతున్నంత సేపు కార్యకర్తలు హర్వధ్వానాలు చేస్తూనే ఉన్నారు. దీన్నిబట్టి, పార్టీపై ఎన్టీఆర్ ముద్ర, ప్రభావం ఇంకా ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. ‘టిడిపి ఉన్నంతవరకూ ఎన్టీఆర్ పేరు ఉండాలి. ఎన్టీఆర్ పేరుతో పధకాలు కొనసాగితేనే గ్రామీణ ప్రాంతాల్లో మా పార్టీకి బలం. ఆస్థానంలో సార్ సహా ఇంకెవరి పేర్లు పెట్టినా ప్రజలు గుర్తించర’ని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇక తన ప్రభుత్వం తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తుందన్న విషయాన్ని బలంగా చాటుకునే ప్రయత్నం చేశారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పరంగా నిర్వహించిన సంక్రాతి, దసరా సంబరాలు, లేపాక్షి, విశాఖ ఉత్సవాలతోపాటు గోదావరి పుష్కరాల నిర్వహణను గుర్తుచేశారు. తెలుగుదనాన్ని నిరంతరం కాపాడుతున్న ప్రభుత్వం తనదొక్కటేనన్న సంకేతాలిచ్చారు. అమరావతిలో అన్న విగ్రహం ఏర్పాటుతో బాబు తనపై ఉన్న అపవాదును చెరిపివేసుకోవటంతోపాటు, అన్న అభిమానులను మెప్పించారని పార్టీ నేతలు చెబుతున్నారు. నిజానికి, బాబు హయాంలో ఎన్టీఆర్ అభిమాన నేతలకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. పిన్నమనేని సాయిబాబా, మాజీ ఎమ్మెల్యే తాళ్లపాక రమేష్‌రెడ్డి వంటి అభిమానసంఘ నేతలకు ఇప్పటివరకూ మొండిచేయి ఎదురయింది. వారితోపాటు పార్టీలో కొనసాగుతున్న ఇతర నేతలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. తాజా పరిణామాలతో బాబు వారిని కూడా మెప్పించినట్లు కనిపిస్తోంది.

చిత్రం మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న చంద్రబాబు