రాష్ట్రీయం

గాలివాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ / ఖమ్మం / వరంగల్, మే 28: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. నల్లగొండ జిల్లాలో గాలివాన బీభత్సానికి ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్‌లో ముగ్గురు గల్లంతయ్యారు. వరంగల్‌లో భారీ వృక్షాలు నేలమట్టం కాగా.. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయ. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌లో శనివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన మత్సకారులకు చెందిన మూడు పడవలు ఈదురుగాలుల ధాటికి పల్టీ కొట్టాయి. వాటిలో ప్రయాణిస్తున్న అంబటి వెంకన్న (50), వట్టి సోమయ్య (52), కొప్పు నాగయ్య(20)లు చెరువులో పడి మృతి చెందారు. పెద్దవూర మండలం పిన్నవూరా గ్రామంలో ఈదురుగాలులకు రేకుల షెడ్డు పైకప్పు కూలి మీదపడటంతో తండ్రి కొడుకులు జోగు రాంబాబు (42), జోగు రాకేష్ (9)లు మృతిచెందారు. జోగు రాంబాబు తన భార్య శంకరమ్మతో కలిసి బత్తాయి తోటలో మొక్కలకు పశువుల పేడ పోసే సమయంలో ఆకస్మికంగా ఈదురుగాలులు వీచాయి. రాంబాబు, శంకరమ్మలతో పాటు వెంట ఉన్న పిల్లలు రాకేష్, అతని చెల్లి ఆరేళ్ల కల్యాణీలు తలదాచుకునేందుకు అక్కడే ఉన్న పట్టుపురుగుల పెంపకం రేకుల షెడ్డులోకి వెళ్లారు. ఈదురుగాలుల ధాటికి షెడ్డు పైకప్పు కూలి వారందరి మీద పడింది. రాకేష్ అక్కడికక్కడే చనిపోగా తల్లిదండ్రులకు, చెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు తండ్రి జోగు రాంబాబు సైతం మృతి చెందాడు. ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వైరా ప్రధాన రహదారిపై ఉన్న పెద్ద చెట్లు సైతం వేళ్ళతో సహా కిందపడిపోయాయి. వైరా రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్ళిన కొణిజర్ల మండలం లాలాపురానికి చెందిన అక్బర్ (20), వైరాకు చెందిన సైదులు (35)తో పాటు మరో వ్యక్తి గల్లంతయ్యారు. కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద భారీ చెట్లు రోడ్లపై పడటంతో దాదాపు 2గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. వరంగల్, కాజీపేట, హన్మకొండ ప్రాంతాల్లో తెల్లవారుఝామున గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. సిపి కార్యాలయ ఎదుట హైవే రోడ్డుపై ఉన్న భారీ వటవృక్షం గాలిదుమారానికి నేలకొరిగింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయ. నగరంలోని హయాగ్రీవాచారి గ్రౌండ్‌లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న ఎగ్జిబిషన్ గాలిదుమార బీభత్సానికి నేలమట్టమైంది. రేకులు కొట్టుకుపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్‌సరఫరా నిలిచిపోయింది.

chitram గాలిదుమారానికి వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్ వద్ద కూలిపోయిన వృక్షం