రాష్ట్రీయం

ముద్రగడను ‘కాపు’ కాద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: కాపునేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై కాపు అగ్రనేతలు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై తొలిసారిగా సోమవారం సాయంత్రం పార్క్‌హయత్ హోటల్‌లో నిర్వహించిన కాపునేతల సమావేశంలో ముద్రగడ వ్యవహారంపై లోతుగా చర్చించారు. ప్రభుత్వానికి రెండురోజుల గడువు ఇచ్చి, అప్పటికీ స్పందించకపోతే కార్యాచరణ ప్రకటించాలని సమావేశం నిర్ణయించడంతో పాటు 17న విజయవాడలో మళ్లీ భేటీ కావాలని సంకల్పించింది. ముద్రగడ అరెస్టు అనంతర పరిణామాలపై చర్చించిన కాపు పెద్దలు చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై పరుష పదజాలంతో విరుచుకుపడినట్లు సమాచారం. ముఖ్యంగా దాసరి, సి.రామచంద్రయ్య, బొత్స, చిరంజీవి, అంబటి రాంబాబు, కన్నబాబు కాపులను సంఘ విద్రోహశక్తులుగా ముద్రవేసేందుకు బాబు చేస్తున్న ప్రయత్నాలను కలసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. తాము అనైక్యంగా లేమన్న సంకేతాలు పంపించాల్సి ఉందని, దానితోపాటు బీసీ హోదా, తదితర అంశాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని కన్నబాబు చెప్పారు. మన పిల్లాడిని (ముద్రగడ కుమారుడిని) ఆ విధంగా అమానుషంగా కొడుతుంటే రక్తం మరిగిపోతోందని, బాబును ఇలాగే వదిలేస్తే కాపులను పూర్తి స్థాయిలో అణచివేస్తారని మరికొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
‘బాబు సంగతి నాకు తెలుసు. ఎంతకయినా తెగిస్తాడు. అంతా కలసి అతని సంగతి తేలుద్దాం’ అని రామచంద్రయ్య తీవ్ర స్వరంతో అన్నట్లు తెలిసింది. చిరంజీవి కూడా తీవ్రంగానే మాట్లాడారు. ఇప్పుడు ఒక కులంపై దాడి చేస్తున్నారు. రేపు మరో కులం మీద దాడి చేస్తారు. దీన్ని ఇప్పటినుంచే ఎదుర్కోవాలని చెప్పారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కాపు ఉద్యమంపై బాబు రకరకాలుగా మాట్లాడుతున్నట్లు తెలిసిందని, ఇంకా ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉంది కాబట్టి, ఈలోగా వారిని దారికి తెచ్చుకోవచ్చన్నట్లు మాట్లాడుతున్నారని, కాపులంతా సమైక్యంగా ఉంటే బాబు ఎత్తుగడను తిప్పికొట్టవచ్చన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ అన్ని పార్టీల్లోని కాపులంతా ఏకం కాకపోతే, పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.
ముద్రగడ వైఖరిపైనా కొంతమంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన దీక్ష గురించి ఎవరితోనూ సంప్రదించలేదని, గతంలో కూడా సభ నిర్వహించి ఎవరితో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్న అసంతృప్తి వ్యక్తమయింది. దానితో కల్పించుకున్న దాసరి తదితరులు ఉద్యమంలో కొన్ని నిర్ణయాలు అక్కడికక్కడ తీసుకోవలసి ఉంటుందని, దాని గురించి ఇప్పుడు ప్రస్తావించడం అనవసరమని సర్దిచెప్పారు. ముద్రగడకు ఎవరూ లేరన్న భావనతో ప్రభుత్వం ఉందని, దానిని తిప్పికొట్టి ఆయన వెనుక కాపుజాతి అంతా ఉందన్న సంకేతాలివాల్సి ఉంది అన్నారు. కాగా ఎదురుదాడి చేస్తున్న కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో కాపు నేతలు భావించారు.
అన్ని పార్టీలకు చెందిన కాపు నేతలంతా ఒకే వేదిక మీదకు రావడం ఇదే తొలిసారి. ముఖ్యంగా రాజకీయంగా బద్ధవిరోధులైన పల్లంరాజు, వైసీపీ నేత చలమలశెట్టి సునీల్ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడాన్ని బట్టి.. ముద్రగడ విషయంలో కాపునేతలంతా ఏ స్థాయిలో పట్టుదలతో ఉన్నారో స్పష్టమవుతోంది.
మొత్తం 9 తీర్మానాలు ఆమోదిస్తూ సమావేశం నిర్ణయించింది. ముద్రగడ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా, అరెస్టు సమయంలో ముద్రగడ కుటుంబ సభ్యులపై పోలీసుల దాడిని ఖండించింది. ముద్రగడ కోరిన విధంగా చర్చలు జరిపి, దీక్ష విరమించేలా చూడాలని, బాబు ఎత్తుగడలో పాల్గొంటున్న కాపు నేతలు ముద్రగడపై దాడి చేయడం అనాగరికమని, బాబు చేస్తున్న విభజించి పాలించే సిద్ధాంతంలో భాగస్వాములు కాకుండా, అర్థం చేసుకోవాలనే తీర్మానాలను సమావేశం ఆమోదించింది.

దీక్షను విరమింపచేయండి
హైదరాబాద్/ ఖైరతాబాద్, జూన్ 13: ముద్రగడ దీక్షను విరమింప చేసేందుకు ఆయన కోరిన విధంగా జెఎసి ద్వారా చర్చలు జరపాలని కాపు నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సామాజికవర సంక్షేమంకోసం దీక్షకు దిగిన ముద్రగడను ప్రభుత్వం అప్రజాస్వామికంగా అరెస్టు చేసిందన్నారు. ముద్రగడ వెనుక తామంతా ఉన్నామని చెప్పడానికే ఈ సమావేశాన్ని నిర్వహించినట్టు చెప్పారు. ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమన్నారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమనడం తప్పా అని ప్రశ్నించారు. కాపు జాతికోసం ఉద్యమిస్తున్న వారిపై ప్రభుత్వం బురద చల్లించడం మరింత ఇబ్బంది కలిగించే అంశమన్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రెండురోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే మరో మారు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

చిత్రం సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న చిరంజీవి, దాసరి తదితరులు