తెలంగాణ

అయుత చండీ యాగానికి విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, డిసెంబర్ 13: రాష్ట్ర సంక్షేమం కోసం ఈ నెల 23 నుంచి 27 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించే అయుత చండీ మహాయాగానికి ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. ఈ యాగం శృంగేరి పీఠాధిపతులుల సమక్షంలో నిర్వహించనున్న దృష్ట్యా అన్ని వసతి సౌకర్యాలతో ఈ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యాగశాల ఏర్పాట్లలో 500 మంది కార్మికులు పనుల్లో నిమగ్నం కాగా ఇప్పటికే మఠాధిపతులు, కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులతో పాటు రాష్టప్రతి, గవర్నర్‌లకు వసతి ఏర్పాట్లను అధునాతన టెక్నాలజీ పద్ధతులతో ఏర్పాట్లు పూర్తిచేయగా యాగశాలలో 108 హోమగుండాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రోజుకు లక్ష మంది ప్రజలు యాగానికి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భోజన, విశ్రాంతి కోసం వేరువేరుగా గుడారాలను ఏర్పాటు చేశారు. అయితే శాఖల వారీగా అయుత చండీ యాగం నిర్వహించే పరిసర ప్రాంతంలో నాలుగు స్థలాలను ఎంపిక చేసి పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా యాగశాలకు ఐదు రోజుల పాటు 24గంటల విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లను ఏర్పాటులో ట్రాన్స్‌కో అధికారులు నిమగ్నమయ్యారు. యాగశాలకు రాష్ట్ర, కేంద్ర ప్రతినిధులు, అధికారులు రావడానికి వీలుగా ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయగా, ప్రతి రోజూ ప్రజలు దర్శించుకునేందుకు వీలుగా మార్గాలను ఎంపిక చేశారు. ఎర్రవల్లి నుండి యాగశాల వరకు వచ్చేందుకు వీలుగా బస్సుల ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఫాంహౌస్‌లో భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. వందలాది మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తుండగా, జిల్లా ఎస్పీ సుమతి, సిద్దిపేట డీఎస్‌పి శ్రీ్ధర్‌లు పర్యవేక్షిస్తున్నారు. అనునిత్యం యాగశాలలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పు

న్యాయం కోసం
టవరెక్కిన రైతు
రామాయంపేట, డిసెంబర్ 13: తన భూమిని ఇతరుల పేరుపైకి రెవెన్యూ అధికారులు పట్టా మార్పిడి చేశారని ఆరోపిస్తూ ఓరైతు సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించగా పోలీసుల జోక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈసంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట పంచాయతీ పరిధిలోని గొల్పర్తి గ్రామానికి చెందిన సాదుల నర్సింలు తన వ్యవసాయ భూమి సర్వే నంబర్ 245,246లో గల భూమిని రెవెన్యూ అధికారులు ఇతరుల పేరుపైకి మార్చారని తనకు న్యాయం చేయాలని గత కొద్ది రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగి అధికారులకు మొరపెట్టుకున్నా న్యాయం జరుగలేదని దీంతో తమ కుటుంబం రోడ్డున పడుతుందని మనోవేదనకు గురైన రైతు కోమటిపల్లి శివారులో గల సెల్‌టవర్‌పైకి ఎక్కి ఆత్మహత్యా యత్నంచేశాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నాగార్జున్‌గౌడ్ బాదితుడితో ఫోన్‌లో మాట్లాడి న్యాయం చేస్తానని హామి ఇవ్వడంతో కిందకి దిగడంతో పోలీసులతో పాటు కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన నర్సింలును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

వరాహావతారంలో రామయ్య
భద్రాచలం, డిసెంబర్ 13: ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి వరాహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హిరణ్యాక్షుడి నుంచి భూదేవిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వరాహావతారం దాల్చుతాడు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. వారాహరూపుడైన రామయ్యను ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చి భక్తుల దర్శనార్థం ఉంచారు. స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. అధ్యయనోత్సవాల్లో నేడు స్వామి నృసింహావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

‘ఆకర్ష్’తో భీతిల్లుతున్న బిజెపి

‘గ్రేటర్’ అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు
సంస్థాగత కమిటీలు.. ముఖ్యులకు బాధ్యతలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్‌తో బిజెపి రాష్ట్ర నాయకులు భీతిల్లుతున్నారు. స్థానిక సంస్ధల కోటా ద్వారా శాసనమండలికి (కౌన్సిల్) జరగబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలకు చెందిన అభ్యర్థులే టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించడంతో బిజెపి రాష్ట్ర నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు వారు సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, బిజెపి నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నగర నాయకుడు వెంకట రమణి ప్రభృతులు సమావేశమై చర్చించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయాలని వారు నిర్ణయించారు. ఇందులో భాగంగానే తొలుత పార్టీ శ్రేణులకు భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టాలని వారు భావించారు. వారం రోజుల్లో సంస్థాపరంగా కమిటీల ఏర్పాటుకు డాక్టర్ కె. లక్ష్మణ్‌ను చైర్మన్‌గా నియమించి బాధ్యత అప్పగించారు. సభ్యులుగా ప్రేంసింగ్ రాథోడ్‌ను, బి. జనార్ధన్ రెడ్డిని నియమించారు. ఆర్థిక కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని, మీడియా చైర్మన్‌గా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిని, సోషల్ మీడియా చైర్మన్‌గా ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్‌ను నియమించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని, విద్యుత్తు ఇతరత్రా పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు.
టిడిపితో దోస్తీ..
జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిడిపితో దోస్తీ కొనసాగించాలని, కలిసి పోటీ చేయాలని వారు భావించారు. సీట్ల సర్దుబాటు కోసం టిడిపితో త్వరలో భేటీ కావాలని నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో టిడిపికి, బిజెపికి సమానంగా బలం ఉన్నందున మొత్తం సీట్లలో సమానంగా తీసుకుని పోటీ చేద్దామని టిడిపి నాయకత్వాన్ని కోరాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు.
12 బుల్లెట్ పాయింట్స్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీని ప్రజల్లోకి దూసుకెళ్ళేలా చేసేందుకు 12 బుల్లెట్స్ పాయింట్స్ రూపొందించారు. తాగు నీరు, హౌసింగ్, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన వంటి ప్రధాన అంశాలపై ఫోకస్ చేస్తూ పోరాటం చేయాలని నిర్ణయించారు.

పాలమూరు ప్రాజెక్టు
టెండర్లకు రంగం సిద్ధం

ప్రభుత్వానికి చేరిన అంచనాలు.. ప్యాకేజీలుగా విభజన
ఎలక్ట్రానిక్, మెకానిక్ పనులకు రూ.6,258 కోట్లు
ఎన్నికల కోడ్ అడ్డంటున్న అధికారులు

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, డిసెంబర్ 13: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లకు రంగం సిద్ధమైంది. ఒక్క రిజర్వాయర్ మినహయిస్తే అన్ని పనులకు అంచనాల విలువలను సంబంధిత అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. అధికారులు సిద్ధం చేసిన నివేదికలను, ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. వీటిని ప్యాకేజీలుగా విభజించే ప్రక్రియకు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే టెండర్లు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎన్నికల కమిషన్ అనుమతిస్తే మాత్రం టెండర్లను పిలిచేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని చూస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించినట్లుగా మూడేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తప్పక సాకారం అయ్యే విధంగా అవకాశాలు మెండుగా ఉన్నాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ ఏడాది జూన్ 11వ తేదిన ప్రభుత్వం రూ.35,200 కోట్ల అంచనా విలువతో ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి ఇచ్చింది. అదే రోజు ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాలోని భూత్పూర్ మండల కర్వెన రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసి కురుమూర్తి రిజర్వాయర్‌గా పేరును కూడా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కావాల్సి భూముల సేకరణ ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, కాలువలకు సంబంధించి మొత్తం 20 వేల ఎకరాలు అవసరం కాగా ఇప్పటికే 18 వేల ఎకరాలకు సంబంధించిన భూములను రైతులను ఒప్పించి ఒప్పంద పత్రాల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. రైతుల నుండి అంగీకార పత్రాలు రావడం ఇప్పటికే 3000 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయంది. భూసేకరణతో పాటు ప్రాజెక్టు సర్వే, అంచనాల రూపకల్పన వేగంగా జరిగింది. ఆధునాతన లైడార్ సర్వే ద్వారా అధికార యంత్రాంగం చకచకా అంచనాలు తయారు చేసింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టులో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ మినహా మిగిలిన అన్ని పనులకు అంచనాలు పూర్తయ్యాయి. ఈ ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరాయి. వీటిని ప్యాకేజిలుగా విభజించిన వెంటనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున టెండర్ల ప్రక్రియకు కోడ్ అడ్డు వస్తుంది. అయితే ప్రాజెక్టుకు గతంలోనే ఇచ్చిన దరిమిలా టెండర్లకు అనుమతి ఇవ్వాలని నీటిపారుదల శాఖ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. అక్కడి నుండి అనుమతి వస్తే కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచే అవకాశం ఉంది.
కాగా, పంప్‌హౌస్‌ల అంచనాలను కూడా సిద్ధమయ్యాయి. నార్లపూర్‌కు సివిల్ పనులకు రూ.938 కోట్లు, మెకానికల్ పనులకు రూ.1558 కోట్లు, వట్టెం రిజర్వాయర్‌కు సివిల్ పనులకు రూ.1392 కోట్లు, మెకానిక్ పనులకు రూ.1815 కోట్లు, ఎదుల రిజర్వాయర్ పరిధిలోని సివిల్ పనులకు రూ.1298 కోట్లు, ఉదండాపూర్ రిజర్వాయర్ సివిల్ పనులకు రూ.968 కోట్లు, మెకానిక్ పనులకు రూ.1070 కోట్ల అంచనాలు వేశారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోదల పథకానికి టెండర్లు సర్వం సిద్ధం చేసింది.

టెక్నాలజీ ప్రజలకు ఉపయోగపడాలి

‘నిట్’ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్

ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 13: ప్రపంచంలోనే భారతదేశం విద్యాపరంగా మూడవ స్థానంలో ఉందని మొదటి, రెండవ స్థానంలో యుఎస్‌ఎ, చైనా దేశాలు ఉన్నాయని ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ అన్నారు. వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో శనివారం జరిగిన 13వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానం ప్రజలకు ఉపయోగపడేలా యువ ఇంజనీర్లు, శాస్తవ్రేత్తలు కృషి చేయాలని కోరారు. వరంగల్ నిట్ విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. 2017-18 సంవత్సరంలో చంద్రయాన్-2 అంతరిక్షలోకి పంపిస్తామన్నారు. అంతరిక్ష పరిశోధనలో భారతదేశం ప్రపంచంలో 6వ స్థానంలో ఉందన్నారు. వరంగల్‌కు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, 12వ శతాబ్దంలో కాకతీయులు పాలించిన కీర్తికట్టడాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా 1598 మంది నిట్ విద్యార్థులకు డిగ్రీ ఆయన అవార్డులు ప్రదానం చేశారు. పిహెచ్‌డిలో 65, ఎంటెక్, పిజిలో 685, బిటెక్‌లో 848 మంది విద్యార్థులు డిగ్రీ అందుకున్నారు. నిట్ గోల్డ్‌మెడల్‌గా సివిల్ ఇంజనీర్ విద్యార్థి ఇ.సాయికళ్యాణ్ అందుకున్నారు. ఒక్కో విభాగంలో టాపర్ ఒక్కొక్కరికి గోల్డ్‌మెడల్ అందజేశారు. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.శ్రీనివాసరావు రిపోర్ట్ ప్రజెంటేషన్ చేశారు. నిట్‌లో 5.8 కోట్లు ఖర్చు చేసి 22 ఆర్‌అండ్‌డి ప్రాజెక్టులు చేశామన్నారు. డాక్టర్ రెడ్డి, సి-ఎంఇటి, న్యాట్‌కో, డిఆర్‌డిఓ, ఇసిఐఎల్ కంపెనీలతో నిట్‌టైఅప్‌తో పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థులకు డిగ్రీ పట్టాల అనంతరం వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు.

ఫిల్టర్‌బెడ్స్‌కు తాళం

ౄ నీరు లేకపోవడమే కారణం ౄ 20 ఏళ్లలో ఇదే తొలిసారి
ౄ వీధినపడ్డ కార్మికులు ౄ భవిష్యత్తు ప్రశ్నార్థకం

హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 13: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంతో పాటు మరో 32 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే తుమ్మనపల్లి రక్షిత నీటి ఫథకం (్ఫల్టర్‌బెడ్స్)కు తాళం పడింది. 1995లో మాజీ ఎంపి వొడితెల రాజేశ్వర్‌రావు చొరవతో కేంద్ర ప్రభుత్వం పథకాన్ని నిర్మించింది. ఇందులో భాగంగా కాకతీయ కాలువ పక్కన ఫిల్టర్‌బెడ్స్, దీనికింద ఉన్న హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, శంకరపట్నం మండలంలోని 32 గ్రామాలకు పైప్‌లైన్లు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించారు. కాకతీయ కాలువ నుండి వచ్చే నీటిని వినియోగించుకుని ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేస్తారు. కాకతీయ కాలువ నీటితో సింగాపురం చెరువును నింపి స్టోరేజీ రిజర్వాయర్‌గా వినియోగించుకుంటారు. నిత్యం 64 లక్షల 80 వేల లీటర్ల నీరు శుద్ధి చేసి పై గ్రామాలకు పంపింగ్ చేస్తారు. ఇందుకు 40 హెచ్‌పి సామర్థ్యం ఉన్న మూడు మోటార్లు, 7.5 హెచ్‌పి సామర్థ్యం ఉన్న రెండు మోటార్లు, ఆరు ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. బోర్నపల్లి గుట్టపై ఒక ఓవర్ హెడ్ ట్యాంక్, మాణిక్యాపూర్ వద్ద అండర్‌గ్రౌండ్ ట్యాంక్‌తో పాటు రత్నగిరి వద్ద గుట్టపై ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించారు. గత 20 ఏళ్ల నుంచి కొన్ని ఆటంకాలు ఎదురైనా నిరంతరాయంగా నీటి సరఫరా జరుగుతోంది. కానీ ఈ ఏడాది వర్షాభావం, కాకతీయ కాలువకు నీటి సరఫరా లేకపోవడం, స్టోరేజి రిజర్వాయర్‌గా ఉన్న సింగాపురం చెరువు ఎండిపోవడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయి చివరకు తాళం వేయాల్సిన పరిస్థితి దాపురించింది. దీంతో అన్ని గ్రామాల్లో నీటికి కటకట ఏర్పడింది. ఈ నీటి పథకం నిర్వహణను ఓ ప్రయివేటు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఇందులో 24 మంది కార్మికులు పనిచేస్తున్నారు. నీటి లభ్యత లేక పథకానికి తాళం వేయడంతో కార్మికులు అయోమయానికి గురవుతున్నారు.
ఎందుకీ దుస్థితి?
తుమ్మనపల్లి రక్షిత నీటి పథకం ముఖ్యంగా కాకతీయ కాలువ నీటిపైనే ఆధారపడి నడుస్తోంది. తాగునీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో అత్యవసర వినియోగం నిమిత్తం వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు 40 టిఎంసిల నీటిని నిలువ ఉంచాలి. కానీ ఈ ఖరీఫ్‌లో ఉన్న కొదిపాటి నీటిని పూర్తిగా పంట పొలాలకు విడుదల చేశారు. దీంతో డ్యాం ఖాళీ అయినట్లు తెలుస్తోంది. కేవల ఏడు టిఎంసిల నీరు మాత్రమే శ్రీరాంసాగర్ డ్యాంలో ఉండడం, అదికూడా ప్రస్తుతం విడుదల చేసే అవకాశం లేకపోవడంతో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. కేవలం కాకతీయ పైనే ఆధారపడకుండా స్థానికంగా ఉన్న చెరువుల్లో బావులను తవ్వి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ దీనిపై ముందుచూపు లేకపోవడంతో నీటి సమస్య మరింత తీవ్రమవుతోంది. ఇంకా వేసవి రాకముందే హుజూరాబాద్ పట్టణంతో పాటు గ్రామాల్లో నీటి కరవు ఏర్పడింది. పట్టణంలో రూ.500 వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని, ఇది తమకు భారంలా మారుతోందని, మధ్యతరగతి, పేదప్రజలు వాపోతున్నారు.
ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం : ఆర్‌డబ్లుఎస్ - డిఇ
ఫిల్టర్‌బెడ్స్ మూతపడటంతో ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నామని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్లుఎస్) డివిజనల్ ఇంజనీర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సింగాపురం చెరువులో 30 గుంటల్లో బావిని తవ్వి ఫిల్టర్‌బెడ్స్‌కు నీటి పరఫరా చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి తాము ఇప్పటికే పంపామని ఆయన స్పష్టం చేశారు.