తెలంగాణ

సరిహద్దుల్లో ఇసుక తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూన్ 16: ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో ఇసుక వివాదం రాజుకుంది. తెలంగాణలోని ఇసుక ర్యాంపుల నుంచి వస్తున్న లారీలను తమ రాష్ట్రంలో పర్మిట్ లేదంటూ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఎటపాక పోలీస్‌స్టేషన్ వద్ద పోలీసులు నిలిపివేస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ తంతు నడుస్తోంది. కేవలం ఇసుక లారీలనే ఆపి ఆంధ్రా పోలీసులు వేధిస్తున్నారని లారీ డ్రైవర్లు వాపోతున్నారు. ఖాళీ లారీలు వెళ్లేటపుడు పంపించి, లోడ్‌తో వస్తున్న సమయంలో ఆపేయడం ఎంత వరకు సమంజసం అంటూ వారు నిలదీస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఇసుక ర్యాంపుల్లో గోదావరి నుంచి ఇసుకను తవ్వే ప్రక్రియ నిలిచిపోనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి పర్యావరణ సాధికార కమిటీ సూచనల మేరకు మాన్‌సూన్ సమయంలో గోదావరిలో ఇసుక తవ్వకాలు జరపకూడదు. దీంతో ఇసుకను హైదరాబాద్‌కు భారీగా తరలించుకు పోతున్నారు. మరో రెండు నెలల పాటు ఇసుక దొరకదు. వెంకటాపురం మండలంలోని మరికాల, మొర్రవానిగూడెం, ఆలుబాక, ముత్తారం, కొండాపురం, పెద్దిపల్లి, చర్ల, రామారావుపేట ఇసుక ర్యాంపుల నుంచి ఇసుకకు టీఎస్‌ఎండీసీ కూపన్లు భారీగా ఇస్తోంది. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో లారీలు ఇసుక కోసం భద్రాచలం మన్యానికి క్యూ కట్టాయి. గత పది రోజులుగా వందల సంఖ్యలో వస్తున్న లారీలతో భద్రాచలం డివిజన్‌లో వాహనాల రొద ఎక్కువైంది. అకస్మాత్తుగా పర్మిట్ల పేరుతో ఇసుక లారీలను నిలిపివేస్తుండటంతో సరిహద్దుల్లో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య మళ్లీ వివాదం రేగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం భద్రాచలం శివారు రాజుపేట మొదలు కన్నాయిగూడెం వరకు సుమారు 12 కి.మీలు ఆంధ్రాలోనే రహదారి ఉంది. ర్యాంపుల నుంచి లారీలన్నీ ఈ మార్గం గుండానే రావాలి. పర్మిట్ల పేరుతో ఇసుక ర్యాంపుల నుంచి డబ్బులు గుంజేందుకు అధికారులు ఈ రకంగా వాహనాలు ఆపుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి సమస్య ఇటీవల రెండేళ్ల కాలంలో ఎన్నడూ తలెత్తలేదని, ఆంధ్రా నుంచి కూడా వాహనాలు తెలంగాణ మీదుగా వెళ్తున్నాయని, మరి వాటికి పర్మిట్‌లు అవసరం లేదా? అని స్థానిక అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఎటపాక పోలీసులను ప్రశ్నించగా తమకేమీ తెలియదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే లారీలను పర్మిట్లు లేవని ఆపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వివాదం ఎటు దారితీస్తుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.