రాష్ట్రీయం

కేంద్రంలోకి గరికపాటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19:కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఈనెల 22న జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి అదనంగా మరొక కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని బిజెపి నిర్ణయించింది. అడిగిన వెంటనే సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు ఇచ్చినందుకు ప్రత్యుపకారంగా, మిత్రపక్షమైన టిడిపికి మరొక కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని బిజెపి నిర్ణయించినట్లు ఆంధ్రభూమిలో గతంలోనే వార్తాకథనం వెలువడిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దక్కనున్న కేంద్రమంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్న చర్చ మొదలయింది. ఇప్పటికే ఏపి నుంచి అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్లీ సహాయ మంత్రి ఇచ్చేందుకు బిజెపి అంగీకరించడంతో, ఏపి, తెలంగాణ నేతల్లో సహజంగానే ఉత్కంఠ పెరిగింది. రాయలసీమ నుంచి ఒకే జిల్లాకు చెందిన జెసి దివాకర్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప (బీసీ), కర్నూలు నుంచి ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయిన టిజి వెంకటేశ్ (వైశ్య), తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నలుగురిలో ఒకరికి బెర్తు ఖాయమన్న చర్చ రాజ్యసభ ఎన్నికల తర్వాత నుంచే మొదలయింది.
నిజానికి, తెదేపాకు ఒక కేంద్రమంత్రి పదవి ఇస్తారన్న విషయం పార్టీలో అంతర్గతంగా చాలామందికి ముందుగానే తెలుసు. బాబు ప్రధానితో భేటీ అయిన తర్వాత జరిగిన ఈ పరిణామాలపై పార్టీలో అంతర్గత చర్చ కూడా జరుగుతోంది. అందరి అంచనాలు తల్లకిందులు చేసి, అనూహ్యంగా రాజ్యసభ సీటు దక్కించుకున్న టిజి వెంకటేష్, కేంద్రమంత్రి పదవిని కూడా ‘అదే మార్గం’లో సాధించినా ఆశ్చర్యపోవలసిన పనిలేదంటున్నారు. అయితే, ఆయనకు ఎంపి సీటు ఇవ్వడంపై సొంత జిల్లాతోపాటు, రాష్ట్రంలో పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన వ్యతిరేకతను నాయకత్వం గమనంలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.
తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని, తనకూ ఒక అవకాశం ఇవ్వాలని జెసి దివాకర్‌రెడ్డి చాలాకాలం నుంచి కోరుతున్నారు. రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వాలని విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆయనకే దక్కవచ్చు. ఇక కేంద్రంలో ఇద్దరూ ఓసీలే ఉన్నందున, బీసీలను దూరం చేసుకోకూడదని భావిస్తే నిమ్మల కిష్టప్పకు ఇవ్వవచ్చు.
ఇక తెలంగాణలో పార్టీ కనుమరుగవుతున్న క్రమంలో, అక్కడ పార్టీ పునరుజ్జీవం కోసం లోకేష్ ఎక్కువ సమయం వారికే కేటాయిస్తున్నారు. తెరాస ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం శ్రేణులను పోరాటానికి సిద్ధం చేస్తున్నారు.
గత కొద్దిరోజుల క్రితం చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు, తెలంగాణ సీనియర్లతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంలో తెలంగాణకు ఢిల్లీ స్థాయి పదవులు ఇప్పించాలని చాలామంది కోరారు. ఏదైనా జాతీయ గుర్తింపు ఉన్న పదవి ఉంటే, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడటంతోపాటు, ధైర్యంగా కార్యకలాపాలు సాగించవచ్చని చెప్పారు. దానికి స్పందించిన బాబు, ఇకపై ఎలాంటి అవకాశం వచ్చినా తెలంగాణ నేతలకే ఇస్తానని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో తెలంగాణలో తెదేపాకు సంప్రదాయ మద్దతుదారుగా ఉంటూ, ఇటీవలి కాలంలో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో తెరాస వైపుమళ్లుతున్న కమ్మ వర్గాన్ని తిరిగి దరి చేర్చుకోవాలంటే, కమ్మ వర్గానికి చెందిన గరికపాటి మోహన్‌రావుకే మంత్రి పదవి ఇవ్వవచ్చంటున్నారు. బాబు-లోకేష్‌కు నమ్మకస్తుడైన ఆయనతోపాటు, దేవేందర్‌గౌడ్ రాజ్యసభలో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, గౌడ్ చాలాకాలం నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
గరికపాటికి కేంద్రమంత్రి ఇవ్వడం ద్వారా తెలంగాణలో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని భావిస్తే, ఆయనకే ఇవ్వడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాబుకు అత్యంత సన్నిహితుడవడం, పార్టీ నిర్వహించే భారీ ఈవెంట్లకు ఆయనే బాధ్యతలు చూస్తుండటంతో తెలంగాణ నేతలంతా పనుల కోసం ఆయన వద్దకే వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే గరికపాటికి దక్కవచ్చని పార్టీ వర్గాలు విశే్లషిస్తున్నాయి.