ఆంధ్రప్రదేశ్‌

3వేల కొత్త బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 19: ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించేందుకు ఆంధ్ర రాష్ట్రంలో మూడు వేల కొత్త బస్సులు ప్రవేశపెడుతున్నట్టు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.సాంబశివరావు వెల్లడించారు. ఇక్కడి ఆర్టీసీ ద్వారకా కాంప్లెక్స్‌లో ఆదివారం సాయంత్రం ఆయన ప్రయాణికులకు ఉపయోగపడే మొబైల్‌యాప్‌ను, ఇన్ఫర్మేషన్ కియాస్క్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చేనెల నుంచి ప్రతినెల 410 బస్సుల వంతుల మూడు వేల బస్సులను రోడ్డెక్కిస్తున్నట్టు చెప్పారు. కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని, అలాగే మరో 114 ఏసి బస్సులు కొనుగోలు చేయనున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్‌లో ప్రమాదవశాత్తు చనిపోయే ప్రయాణికుల కుటుంబానికి 24 గంటల్లో నష్టపరిహారం అందించడం కోసం బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. ఆర్టీసీ సంస్థకు ఏడాదికి ఐదు వేల కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని, దీనిని మరింతగా పెంచే క్రమంలో అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రయాణికులకు అందించే సేవలు ద్వారా, కొత్తగా ప్రవేశపెట్టిన పార్శిల్ రవాణా, కొరియర్ సర్వీసు, ఖాళీ స్థలాలను వాణిజ్య సముదాయాలుగా మార్చడం ద్వారాను సంస్థ ఆదాయాన్ని పెంచుకోగలుగుతుందన్నారు. త్వరలో వేరే కియాస్క్‌ను ప్రవేశపెడుతున్నామని టికెట్ ఇష్యూయింగ్ మిషన్‌ల ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ప్రయాణికులు బస్సు టికెట్లను సులభంగా పొందవచ్చన్నారు. దీని వలన ప్రయాణికుల విలువైన సమయం వృథా కాకుండా, గంటల తరబడి క్యూలో ఉండనక్కర్లేదన్నారు. ఈ సరికొత్త పథకం త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. విశాఖ నుంచి కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం,విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల నుంచి సంఖ్య ఎక్కువుగా ఉంటుందని, వీరంతా గంటల తరబడి వివిధ చోట్ల నిరీక్షించకుండా ఈ విధానం ద్వారా సౌలభ్యంగా ఉంటుందన్నారు. 22 గంటలు అందుబాటులో ఉండే విధంగా దీనిని అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలోను పార్శిల్, కొరియర్ సర్వీసుల ద్వారా ఆదాయ లక్ష్యాలను సాధించేందుకు ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించామని, దీనివల్ల గడచిన 30 రోజుల్లో మూడు కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చిందని, అదే గతంలో ఏడాది మొత్తం మీద వీటి ద్వారా తొమ్మిది కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి వీటి ద్వారా రూ.150 కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చాలనేది సంస్థ లక్ష్యంగా పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా 423 బస్ స్టేషన్లు ఉండగా ఇందులో వంద బస్ స్టేషన్లు పూర్తిగా నిరుపయోగంగా ఉన్నాయన్నారు. తొలి దశలో వంద బస్ స్టేషన్లలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వౌలిక వసతులు కల్పించనున్నామన్నారు. అలాగే విశాఖలో మద్దిలపాలెం కాంప్లెక్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో గుజరాత్ అలహాబాద్‌లో మాదిరి ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌గా రూపొందించనున్నట్టు చెప్పారు. ఈ కాంప్లెక్స్‌లో నాలుగున్నర ఎకరాల స్థలం ఉందని, దీనిని అనేక రకాలుగాను, అన్ని ఒకేచోట ఉన్నట్టుగా అభివృద్ధి చేయనున్నట్టు ఆయన స్పష్టంచేశారు. వాణిజ్య సముదాయంతోపాటు, ప్రయాణికులకు అనుభూతిని అందించడం కోసం సినిమాహాల్ ఏర్పాటు చేస్తారన్నారు. దీనికి త్వరలో టెండర్లు పిలుస్తున్నామని, ఇది రూ.250 కోట్ల ప్రాజెక్ట్‌గా తెలిపారు. దీని పనులు ప్రారంభించిన నుంచి రెండేళ్ళకాలంలో పూర్తిచేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోను ఉండే బస్ స్టేషన్ల స్థాయిని పెంచేందుకువీలుగా 103 బస్‌స్టేషన్లలో ప్రయాణికులకు వౌలిక వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. గతంలో ప్రకటనల ద్వారా కేవలం 54 లక్షల మేర వచ్చేదని, దీనిని ఇపుడు ఏడు కోట్లకు పెంచగలిగామన్నారు. ఈ సమావేశంలో విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ, విశాఖ రీజనల్ మేనేజర్ సుదీప్‌కుమార్ పాల్గొన్నారు.

విశాఖ డెయిరీ డైరెక్టర్‌పై
బాంబు దాడి
తీవ్ర గాయాలు
బుచ్చెయ్యపేట, జూన్ 19: విశాఖ డెయిరీ డైరెక్టర్, చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్ రాజుకు ముఖ్య అనుచరుడు గేదెల సత్యనారాయణపై ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నాటుబాంబుతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా, బుచ్చెయ్యపేట మండలంలోని స్వగ్రామమైన కొమ్మళ్లపూడిలో నీరు-చెట్టు పథకం కింద చేపట్టిన చెరువులోని పూడికతీత పనులను స్వయంగా పరిశీలిస్తున్న గేదెల సత్యనారాయణపై ఆదివారం రాత్రి 8.15 గంటల సమయంలో చెరువును ఆనుకొని ఉన్న పొలాల నుండి గుర్తు తెలియని వ్యక్తులు నాటుబాంబు విసిరారు. ఆ బాంబు పేలి గేదెల సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే చోడవరం ఎమ్మెల్యే రాజు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సత్యనారాయణను తనకారులో విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు.
మాటువేసి మట్టుపెట్టాలని...
పథకం ప్రకారం సత్యనారాయణను ప్రత్యర్ధులు మాటువేసి మట్టు పెట్టాలని చూశారని, ఈ సంఘటనను పరిశీలించిన స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని చెరువులో పొక్లయినర్‌తో పూడికతీత పనులు జరుగుతుండగా, వాటిని పరిశీలించటానికి సాయంత్రం వేళల్లో చెరువు వద్దకు సత్యనారాయణ వస్తాడని గమనించిన ప్రత్యర్థులు చుట్టుపక్కల పొలాల్లో మాటు వేసి ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. పనులు పరిశీలిస్తున్న సమయంలో తనకు ఫోన్ రావటంతో పొక్లయినర్‌కు కొంచెం దూరంగా వెళ్లి ఫోన్ మాట్లాడుతుండగా నాటు బాంబు విసిరారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే స్థానిక ఎస్‌ఐ ధనుంజయ్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.
27న సిఎం బృందం చైనా పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూన్ 19: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులు, సీనియర్ ఐఎఎస్ అధికారులతో కలిసి ఈనెల 25వ తేదీ చైనా పర్యటనకు బయల్దేరనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ బృందం తిరిగి జూలై 1వ తేదీ నగరానికి చేరుకోనుంది. ఈనెల 22వ తేదీ జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పర్యటన వివరాలు ఖరారు కానున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్‌లో భారీఎత్తున పరిశ్రమల స్థాపన కోసం విదేశీ కంపెనీల నుంచి కోట్లాది రూపాయలను పెట్టుబడులుగా సమీకరించేందుకు గాను ముఖ్యమంత్రి ఈదఫా పర్యటనలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కొన్ని పరిశ్రమల స్థాపనకు సంబంధించి చైనాలోనే ఎంవోయు కుదుర్చుకోనున్నట్టు తెలియవచ్చింది.
నాటుసారాకు
ఇద్దరు గిరిజనులు బలి
పాడేరు, జూన్ 19: నాటుసారా తాగి ఇద్దరు గిరిజనులు మృత్యువాత పడ్డారు. విశాఖ జిల్లాలోని మన్యం ప్రాంతమైన పాడేరుకు సమీపాన కిండంగి పంచాయతీ సేరుబయలు గ్రామానికి చెందిన కిల్లో సూర్యనారాయణ (40), మధు (బద్రి) (35) అనే గిరిజనులు ఆదివారం మ.12.30 గంటల ఫ్రాంతంలో నాటుసారా తాగి స్పృ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించేసరికి మృతి చెందినట్టుగా వైద్యులు నిర్థారించారు. నాటు సారా తాగిన ఇద్దరు గిరిజనులు ఒకేసారి మృత్యువాతపడడంతో ఆ సారాలో విషం కలిసి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. పాడేరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన గిరిజనుల మృతదేహాలను శవ పంచనామాకు తరలించారు.