రాష్ట్రీయం

బావురుమంటున్న గండికోట, మైలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 14: వైఎస్సార్ కడప జిల్లాలో అక్టోబర్, నవంబర్ మాసాల్లో కురిసిన భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాగా, మరికొన్ని ప్రాంతాలు తుంపర జల్లులకే పరిమితమయ్యాయి. తాజాగా కురిసిన వర్షాలతో జిల్లావ్యాప్తంగా పలు ప్రాజెక్టులకు పదేళ్ల తర్వాత జలకళ వచ్చింది. అయితే గండికోట, మైలవరం ప్రాజెక్టుల్లో మాత్రం నీరు చేరక బావురుమంటున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు నీరు చేరాలంటే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి కిందకు రావాల్సి ఉంటుంది. అక్కడ అంత భారీగా వర్షాలులేని కారణంగా ఈ ప్రాజెక్టులకు నీరు చేరలేదు. మైలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో చెరువులకు అరకొరగా నీరుచేరినా ప్రాజెక్టుకు మాత్రం నీరురాలేదు. ఈ ప్రాజెక్టు 9.9టిఎంసి నీటి నిల్వ సామర్థ్యం కలిగి 75వేల ఎకరాలు సాగు సామర్థ్యంతో నిర్మించారు. ప్రస్తుతం 0.520 టిఎంసిల నీరు మాత్రమే ఈ ప్రాజెక్ట్‌లో లభ్యత ఉంది. దీంతో పంటలసాగుకు అవకాశం లేకపోగా, కనీసం తాగునీరు కోసం ఉన్ననీటిని పొదుపుగా వాడుకోవాల్సి ఉంది. అలాగే మూడు జిల్లాలకు వర ప్రసాదిని అయిన జిఎన్‌ఎస్‌ఎస్ గండికోట ప్రాజెక్టును 26.84టిఎంసిల సామర్థ్యంతో నిర్మించారు. ఈప్రాజెక్టు ద్వారా కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 3.5లక్షల ఎకరాలకు సాగునీరు , తాగునీరు అందించాల్సివుంది. ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా చేపట్టడంతో ప్రస్తుతం 5టిఎంసిల నీటిని నిల్వచేసేందుకు మాత్రమే అవకాశం ఉంది. కర్నూలు, అనంతపురం జిల్లాల ఎగువ ప్రాంతాలనుంచి నీరు రాకపోవడంతో గండికోట ప్రాజెక్టులో నీరు అడుగంటింది. ప్రస్తుతం 0.007 టిఎంసిల నామమాత్రపు నీరు మాత్రమే ఈ ప్రాజెక్ట్‌లో ఉంది. పులివెందుల నియోజకవర్గంలోని వేముల, లింగాల, సింహాద్రిపురం, తుండూరు, పులివెందుల మండలాల్లో సాగు,తాగునీటికి గండికోట ప్రాజెక్ట్ మాత్రమే ఆధారం. గండికోటకు నీరుచేరని కారణంగా పులివెందులతోపాటు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు సాగునీరు అందే అవకాశాలు కనుచూపుమేరలో కన్పించడం లేదు. సెప్టెంబర్ చివరిలో ఒక మోస్తారులో వర్షాలు కురిసినా ఆ వర్షాలకు పెద్దగా నీరు చేరలేదు. అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడుకు సరిహద్దుల్లో ఉన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఆ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న బద్వేలు, రైల్వేకోడూరు, రాయచోటి, రాజంపేట, కడప, కమలాపురం, పులివెందుల (రెండుమండలాలు) నియోజకవర్గాల్లో వర్షాలు ముంచెత్తాయి. దీంతో అన్నయమ్మ, పింఛా, ఝరికోన, కుషావతి, వెలిగల్లు, బుగ్గవంక ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. బద్వేలు నియోజకవర్గంలోని సగిలేరు ప్రాజెక్టుకు కూడా నీరు చేరింది. రాష్ట్రప్రభుత్వం కడపజిల్లాలో భారీ వర్షాలు కురిసినందున వరుస కరవుల నుంచి గట్టెక్కారని భావిస్తోంది. నిత్యం తాగు,సాగునీటికి కటకటలాడే జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల నియోజకవర్గాలకు మాత్రం నీటికష్టాలు తప్పేట్లు లేదు.