ఆంధ్రప్రదేశ్‌

సాయం ఇసుమంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 6: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఆశించినంత సాయం చేయదని తేలిపోయింది. కేవలం 2500 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్ర పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు చెవిన వేశారు. దీంతో కేంద్రంపై ఆశలు వదులుకుని రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించేందుకు తన వద్ద ఉన్న ప్రత్యామ్నాయ ప్రణాళికలను ఒక్కటొక్కటిగా చంద్రబాబు అమలు చేస్తున్నారు. రాజధాని అమరావతికి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ సంస్థలు గత ఏడాది జూలైలో సమర్పించాయి. అప్పుడే రాజధాని నిర్మాణ సంస్థలను స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పుడు ఆ విధానాన్ని అమలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది.
కొత్త ముద్దు..!
స్విస్ చాలెంజ్ అనేది ఒక కొత్త విధానం.అయితే ప్రపంచ శ్రేణి రాజధాని నిర్మించాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత విధానానికి స్వస్తి చెప్పి ఈ పద్దతిని అనుసరిస్తున్నారు. ఈ పద్దతిలో సీట్ క్యాపిటల్ అభివృద్ధికి ఒక సంస్థ డిజైన్లు, అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదనలు తయారు చేసి ఇస్తుంది. ఇంతకన్నా మెరుగైన డిజైన్లు, తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ నిర్మించడానికి మరే ఇతర సంస్థలైనా ముందుకు వస్తే, ప్రభుత్వం వారికే ప్రాజెక్ట్‌ను అప్పగిస్తుంది. ఇప్పుడు సింగపూర్ సంస్థ ఇచ్చిన ప్రతిపాదన కన్నా, మెరుగైన ప్రతిపాదనలు వచ్చి, పోటీ నుంచి సింగపూర్ తప్పుకుంటే, వారికి 7.5 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుంది.

సుముఖత చూపని కేంద్రం
ఇదిలా ఉండగా స్విస్ చాలెంజ్ విధానానికి కేంద్రం సుముఖత చూపడం లేదు. గతంలో ఈ విధానంపై అధ్యయనం చేయడానికి విజయ్ కేల్కర్ నేతృత్వంలో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే, స్విస్ చాలెంజ్ విధానం అన్ని చోట్లా అమలు చేయడానికి వీల్లేదని పేర్కొంది. ఒక విధంగా చూస్తే, కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేని విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోందన్నమాట! అలాగే రాజధాని నిర్మాణంపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన సూచనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టడం కూడా కేంద్రం గమనిస్తోంది. శ్రీకృష్ణ కమిటీ తుది నివేదిక ఇవ్వకమునుపే చంద్రబాబు రాజధాని ప్రాంతాన్ని ప్రకటించడం కూడా కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్విస్ చాలెంజ్‌కు పోవడం ఎంత వరకూ సమంజసమని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
ఎంఓయులపై అనుమానాలు
ఇక స్విస్ చాలెంజ్‌కు సంబంధించి సింగపూర్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందాలు బహిర్గతం కాకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చినట్టవుతోంది. సింగపూర్ కన్సార్టియం, ఎపి క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ సంస్థ (సిసిడిఎంసి) ఉమ్మడిగా సీడ్ క్యాపిటల్ ఏరియాలోని 1691 ఎకరాలను అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చింది. ఇందులో సింగపూర్ కన్సార్టియం 306 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. సిసిడిఎంసి 221 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. ఈ జాయింట్ వెంచర్‌లో సింగపూర్ కన్సార్టియంకు 58 శాతం, సిసిడిఎంసికి 42 శాతం వాటాలు ఉంటాయి. స్విస్ ఛాలెంజ్ పోటీలో నెగ్గిన సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మొదట 50 ఎకరాలు, ఆ తరువాత 200 ఎకరాలు, మిగిలిన భూమిని విడతల వారీగా ఇవ్వనుంది. ఈ భూమిని కూడా కారు చవకగా కన్సార్టియంకు కట్టబెట్టనుందన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సీడ్ క్యాపిటల్ ఏరియాలోని రోడ్లు, కాలువలు, విద్యుత్ వంటి వౌలిక సదుపాయాల కల్పనకు 5500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేయబోతోంది. ఇక సింగపూర్ కన్సార్టియం అభివృద్ధి చేయాల్సిన పనేమీ లేదు. సింగపూర్ కన్సార్టియంకు ఇచ్చిన భూమిలో నివాస భవంతులు, కార్యాలయ భవనాలు, ఆహ్లాదకర ప్రదేశాలను నిర్మించడానికి అవకాశం ఉంటుంది. వీటిని తిరిగి విక్రయించే అధికారం కూడా కన్సార్టియంకు ఉంటుంది. పెట్టిన పెట్టుబడిలో కన్సార్టియంకు లాభాలు వస్తే సరి. లేకుంటే 150 శాతం మొత్తాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే కన్సార్టియంకు చెల్లించాలన్న అంతర్గత ఒప్పందం ఉందని, ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించడం ఆలస్యమైతే వడ్డీని కూడా ముట్టచెప్పుకోవలసిన పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఈ భూములకు సంబంధించి వివాదాలేమైనా తలెత్తితో, పరాయి దేశం కోర్టులో తేల్చుకోవాలన్న నిబంధన కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
స్విస్ చాలెంజ్‌పై పారదర్శకతతో వ్యవహరిస్తామని ప్రభుత్వం చెపుతోంది. అయితే, స్విచ్ ఛాలెంజ్‌పై జారీ చేసిన జిఓలో ఇటువంటి అంశాలేమీ పొందుపరచకపోవడం వలన అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వమే చొరవ తీసుకుని స్విస్ ఛాలెంజ్‌లో ఏ ప్రాంతాన్ని ఎవరికి ఎంతక ధరకు ఇవ్వచూపుతున్నారన్న వివరాలను తెలియచేయాల్సి ఉంది. ప్రజా రాజధానిగా పేర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణంలో ప్రధాన ఘట్టానికి తెర తీస్తున్నప్పుడు మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.